పాఠశాలలను పరిశీలించిన ఎంపీడీవో, సర్పంచ్
పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి
ఎంపీడీవో రురావత్ రమాదేవి
నవతెలంగాణ – బోనకల్
విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అయిన ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని మండల ఎంపీడీవో రురావత్ రమాదేవి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరధిలోని బోనకల్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండతో కలిసి సోమవారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులతో వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న పరిశుభ్రత పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి, విద్యాభ్యాసానికి ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా బోధన, విద్యార్థుల అభ్యాస స్థాయిలు, మౌలిక వసతులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై చర్చించారు.
విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్య అందించాలన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, పఠన సామర్థ్యాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ మాట్లాడుతూ, గ్రామంలోని పాఠశాలల అభివృద్ధికి గ్రామ పంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
పాఠశాలలు కేవలం చదువు చెప్పే కేంద్రాలు మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక బాధ్యతలను నేర్పించే ఆలయాలుగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కోల రాజేశ్వరి, ఉపసర్పంచి బానోతు కొండ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరిదు శేషు, అంతోటి శ్రీను, పోటు వెంకటేశ్వర్లు, అంతోటి సునీత, షేక్ మీరా సాహెబ్, జరుపల లావణ్య, తాళ్లూరు జ్యోతి, షేక్ నౌషిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అట్లూరి గోపీచంద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.



