నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటన విడుదల చేశారు.
‘‘జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తయినా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, దీనిపై జాహ్నవి కుటుంబం తరఫున అటార్నీ నుంచి ఇంతవరకూ స్పందన రాలేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలూ గతవారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసినట్లు తెలిసింది.
ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. 2023 జనవరి 23న రాత్రి ఆమె రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే.. జాహ్నవి మృతిపై జోకులు వేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.
‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అని పోలీసు అధికారి అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతం వ్యక్తం చేసింది. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం 40kph జోన్లో ఉంది. కానీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా.. ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.



