దుక్కుల కోసం రైతుల ఏర్పాట్లు
వానాకాలం
సాగు ప్రణాళిక ఖరారు
రుతుపవనాలపైనే
అన్నదాతల ఆశలు
ఆకాశంలో
‘ఎల్ నినో’ ముప్పు.. !
ఈ వానాకాలం వ్యవసాయశాఖ అంచనాలు ఓకేనా ?
వాతావరణ శాఖ సూచనలతో రైతులకు జాగ్రత్తలు
నవతెలంగాణ –
కరీంనగర్/మెదక్ ప్రాంతీయ ప్రతినిధులు
ఈ ఏడాది వానాకాలం (ఖరీఫ్) సీజన్ ప్రారంభమైంది. కేరళను నైబుతి పవనాలు తాకడం, చిన్నపాటి వర్షాలు పడుతుండటంతో దుక్కులు దున్నడం కోసం రైతులు సేంద్రీయ ఎరువులను పంట పొలాల్లో వేయడం వంటి పనులు ప్రారంభించారు. వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ 2026-27కు సంబంధించి పంటల ప్రణాళిక ఖరారు చేసింది. కోటి 34 లక్షల 66 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు అధికారులు అంచనా వేశారు. 60 లక్షల ఎకరాల్లో వరి, 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని అంచనా. మిగతా దాంట్లో కందులు, పెసర, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పనుపు, ఆయిల్ పామ్ పంటలు ఉంటాయి. ఎరువులు కూడా సిద్ధం చేసి పెట్టినట్టు తెలిసింది. అయితే అంచనాలు ఎలా ఉన్నా వర్షాలు సజావుగా పడతాయా అన్న అనుమానాలు ఉన్నాయి.
వాతావరణం పెద్ద సవాలుగా మారనుంది. ఒకవైపు రుతుపవనాల రాక, మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ‘ఎల్ నినో’ ప్రభావం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఒకవేళ వర్షాలు పడినా అవి ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలుగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందకుండా, సంప్రదాయ నీటి ఆధారిత పంటల కంటే తక్కువ కాల వ్యవధిలో పూర్తయ్యే ఆరుతడి పంటలు, పప్పుధాన్యాల సాగు వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ అత్యవసర ప్రణాళికను సిద్ధం చేసే పనిలో పడింది.
వాతావరణాన్ని బట్టి పంట ఎంపికే రైతుకు రక్ష!
‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనా రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడకూడదు’ అని వ్యవసాయ అధికారులు భరోసా ఇస్తున్నారు. సాంప్రదాయకంగా ఎక్కువ నీరు తీసుకునే పంటల జోలికి వెళ్లకుండా, 60 నుంచి 70 రోజుల స్వల్ప కాల వ్యవధిలో చేతికొచ్చే ఆరుతడి పంటలను ఎంచుకోవడమే ప్రస్తుత తరుణంలో ఉత్తమ మార్గమని చెబుతున్నారు. జూలై 15 వరకు వర్షాలు లేకపోతే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని, పొడి నేలల్లో (దుమ్ముల్లో) విత్తనాలు వేయకూడదని సూచిస్తున్నారు. జూలై 30 వరకు కూడా వర్షాభావం ఉంటే వరి, ప్రత్తి, మక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా అలసంద (బొబ్బర్లు), కంది, పెసర వంటి పప్పుధాన్యాల పంటలను సాగు చేయాలని, అందుబాటులో ఉన్న నీటిని ఆదా చేసేందుకు ఒక సాలు (వరస) వదిలి ఒక సాలుకు తడులు ఇచ్చే పద్ధతిని అనుసరించాలని చెబుతున్నారు. ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు ఆలస్యమైతే తీవ్ర వర్షాభావం కింద పరిగణించాలని, అప్పుడు కంది పంట సాగు చేస్తే కేవలం విల్ట్ (ఎండు తెగులు) తట్టుకునే మధ్యకాలిక రకాలను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఎరువులు, విత్తనాలు సిద్దం..
వానాకాలం సాగుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండాడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పంటల వారిగా సాగు విస్తీర్ణం.. అందుకు కావలసిన ఎరువులు, విత్తనాలు ఎంత అవసరం అవుతాయో ప్రణాళికలు వేశాం. అందుకు అనుగుణంగా నెలవారిగా ఎరువులను అందుబాటులో ఉంచనున్నాం. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా ఏర్పాట్లు చేశాం. ప్రత్యామ్నాయాల వైపు కూడా చూస్తున్నాం.
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్



