– కార్మిక చట్టాలను కాపాడాలని సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ – కామారెడ్డి
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి అనంతరం మున్సిపల్ ఆఫీస్ ముందు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందరపు రాజనర్సు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ హాజరయ్యారు. సిఐటి యు జిల్లా కన్వీనర్ అరుణ్, సీనియర్ నాయకుడు కే. చంద్రశేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం – 2025, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసీలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి వంటి నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని కోరారు.
లేబర్ కోడ్ల అమలుతో కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, హైర్ అండ్ ఫైర్ విధానం పెరిగే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా హక్కులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె హక్కుపై కూడా ప్రభావం పడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ సమ్మెలో సుమారు 3,000 మంది కార్మికులు పాల్గొన్నారని నాయకులు తెలిపారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులు, స్వచ్ఛ కార్మికులు, స్కీం వర్కర్లు సహా వివిధ విభాగాల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకునే వరకు ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.



