Friday, February 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరో ఆయుధ పోటీకి అమెరికా నాంది?

మరో ఆయుధ పోటీకి అమెరికా నాంది?

- Advertisement -

ఫిబ్రవరి ఐదవ తేదీతో అమెరికా-రష్యాల మధ్య అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ముగిసిన తరువాత మరోసారి ఆయుధపోటీకి తెరలేచిందా? గతంలో సోవియట్‌ యూనియన్‌, తర్వాత రష్యాను బూచిగా చూపిన అమెరికా ఇప్పుడు చైనా నుంచి ముప్పు ఉందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పూనుకుంది. ఐదేళ్ల క్రితం చైనా అణ్వాయుధ పరీక్ష జరిపిందని అమెరికా విదేశాంగశాఖ సహాయమంత్రి ఇటీవల జెనీవాలో నిరాయుధీకరణ సమావేశంలో ఆరోపించాడు. మేకపిల్లను తినదలచుకున్న తోడేలు కథను గుర్తుకు తెచ్చాడు. వాగు ఎగువన ఉన్న తోడేలు నీళ్లను మురికి చేస్తున్నావంటూ దిగువన ఉన్న మేకపిల్ల మీద ఆరోపించింది. నేను దిగువన ఉంటే పైననీళ్లు ఎలా మురికి అవుతాయని ప్రశ్నిస్తే, నీవు గాకపోతే మీ అమ్మ చేసిందిలే అని దాడిచేసింది తోడేలు. ఐదేండ్ల క్రితం చైనా అణుపరీక్ష జరిపిందని అమెరికా చెప్పటం అలాంటి అడ్డగోలు తనం తప్ప మరొకటి కాదు.

అయితే చైనా అణుపరీక్ష జరిపినట్లు ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేవని సమగ్ర అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పంద(సిటిబిటి) సంస్థ కార్యదర్శి రాబర్ట్‌ ఫ్లాయడ్‌ వెంటనే ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. అమెరికా మంత్రి చెప్పిన సమయంలో అణ్వస్త్ర పరీక్ష జరిపిన లక్షణాలేమీ కనిపించలేదన్నాడు.నిత్యం అసత్యాలతో బతుకున్న అమెరికా తన ఆరోపణను వెనక్కు తీసుకుంటుందని ఎవరైనా అనుకుంటే అత్యాశే అవుతుంది. తాము సిటిబిటికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని చైనా బుధవారం నాడు స్పష్టం చేసింది. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తొలి దేశాలలో ఒకటైన చైనా 1996 నుంచి అణుపరీక్షల వాయిదా ప్రకటించి అమలు చేస్తున్నది. అణ్వాయుధాల గుట్టలపై కూర్చున్న అమెరికా ఇతరుల మీద నిస్సిగ్గుగా ఆరోపణలను గుప్పిస్తున్నది. మరొకసారి అణుబాంబులను ప్రయోగించ నంటూ ప్రతిజ్ఞ చేసేందుకు తిరస్కరిస్తున్నది. ఆయుధ నియంత్రణ ఒప్పందానికి తూట్లు పొడిచింది, ఇప్పుడు గడువు మీరిన తర్వాత మరోసారి పరీక్షలు చేసి కొత్తగా మరికొన్ని వేల ఆయుధాల తయారీ గురించి మాట్లాడుతూ ప్రపంచాన్ని భయపెడుతున్నది.

ప్రస్తుతం ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాలు తొమ్మిది ఉన్నాయి. వాటిలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు, బ్రిటన్‌ మాత్రమే అధికారికంగా ఎన్‌పిటి మీద సంతకం చేసినవిగా గుర్తింపు పొందాయి. ఇవి ఆ ఒప్పందం జరిగిన 1967కు ముందే ఆయుధాలను తయారు చేశాయి. ఒప్పందం పై సంతకాలు చేయని భారత్‌, పాకిస్థాన్‌, ఒప్పందం నుంచి వైదొలిగిన ఉత్తర కొరియా కూడా ఇప్పుడు వాటిని కలిగి ఉన్నట్లు స్వయంగా ప్రకటించాయి. ఇజ్రాయిల్‌ వద్ద కూడా ఉన్నప్పటికీ అది ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్‌పిటిపై ఇరాన్‌ కూడా సంతకం చేసినప్పటికీ అమెరికా అనుసరిస్తున్న శత్రుపూరిత వైఖరి కారణంగా తాము బాంబుల తయారీకి అవసరమైన అణుశుద్ధి చేస్తామని ప్రకటించింది. దాన్నుంచి నివారించేందుకు చేసుకున్న ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటంతో సమస్య తిరిగి మొదటికి వచ్చింది. ఇప్పుడు ఇరాన్‌ను చూపి తాము కూడా అణుకార్యక్రమాన్ని చేపడతామంటూ టర్కీ ప్రకటించింది. మధ్య ప్రాచ్యంలో బలాబలాలు సమతూకంతో ఉండాలంటే తప్పదని చెప్పుకుంది. దీనివెనుక అమెరికా హస్తం లేదని చెప్పలేము.

నిజానికి ఇరాన్‌ను రెచ్చగొట్టింది, బాధ్యతా రహితంగా వ్యవహరించింది అమెరికా. ఒప్పందం నుంచి వైదొలగాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందో డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పలేదు. ఇజ్రాయిల్‌ను వ్యతిరేకిస్తున్నది గనుక ఏదో ఒకసాకుతో దానిపై దాడిచేసి లొంగదీసుకోవాలన్న దుష్ట చింతన తప్ప మరొక పరమార్ధం లేదు. టెహరాన్‌ అణుబాంబు తయారీని అనుమతించే ప్రసక్తేలేదు, దాడులు చేస్తామంటూ ఇటీవల భారీఎత్తున నౌకాదళాన్ని మోహరించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అణుశక్తి దేశాలు జవాబుదారీతనంతో వ్యవహరించాలని టర్కీ ప్రకటనపై రష్యా వ్యాఖ్యానించింది. ఎందుకంటే టర్కీ నాటో కూటమి సభ్యురాలు.

నాటో ఒప్పందంలో భాగంగా దాని ఇన్సిర్‌లిక్‌ వైమానిక కేంద్రంలో అమెరికా అణ్వాయుధాలు మోహరించి ఉన్నాయి. నిజానికి అవి మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాను బెదిరించేందుకు తప్ప ఆ ప్రాంత దేశాల నుంచి నాటో దేశాలకు ఎలాంటి ముప్పులేదు. అణు నిరాయుధీకరణకు తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మరో ఒప్పందం కుదుర్చుకొనేందుకు చర్చలు జరపాలని మాస్కో కోరింది. అయితే మరో ఒప్పందం అంటూ కుదిరితే చైనా కూడా ఉండాలంటూ అమెరికా పేర్కొన్నది. రష్యా, అమెరికాలతో పోల్చితే తమ దగ్గర ఉన్నవి తక్కువ అని, అందువలన తాము చేరే ప్రసక్తి లేదని బీజింగ్‌ స్పష్టం చేసింది.ఏదో ఒకసాకుతో మరింత ప్రమాదకరమైన ఆయుధపోటీకి తెరలేపుతున్న అమెరికాను ప్రపంచశాంతి శక్తులు అడ్డుకోకపోతే ముప్పు మరింత పెరిగినట్లే!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -