మూసీ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించండి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి
కేంద్ర నిధులతో కృష్ణా – వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాలు కేటాయిస్తాం
18 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి
యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించండి :కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ జోషీలను కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విజ్ఞప్తులు అందజేశారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని ఆయన ఛాంబర్‌లో సీఎం కలిశారు.
సీఎం వెంట ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.ఎస్.శ్రీనివాస రాజు, సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, కేంద్ర పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో… మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. మామునూరు విమానాశ్రయంలో కార్గో సేవలతోపాటు మెయింటెనెన్స్ ఓవర్‌హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు.
జౌళి, ఇతర పరిశ్రమలతో వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందనీ, వరంగల్‌కు దగ్గరలో రెండేండ్లకోసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారక్క జాతర మేడారంలో జరుగుతుందని గుర్తు చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్ వరంగల్‌తోపాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని వివరించారు. అలాగే, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఆ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మామునూరు విమానాశ్రయం పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.
కేంద్ర నిధులతో కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి
అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయన ఛాంబర్‌లో సీఎం కలిశారు. కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ వ్యయం మొత్తాన్ని తామే భరిస్తామని మరోసారి గుర్తు చేశారు. కృష్ణా-వికారాబాద్ రైలు మార్గంలోని టేకల్‌కోడ్‌లో లైమ్‌స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు. అలాగే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్నాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందన్నారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు సీఎం వివరించారు.
100 ఎకరాల భూములు బదలాయించండి
అంతకు ముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు 100 ఎకరాలు బదలాయించాలని కోరారు. ఈసా.. మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రోగ్రాంకు రావాలంటూ కేంద్రమంత్రిని ఆయన ఆహ్వానించారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నట్టు వివరించారు.
ఈసా.. మూసీ నదుల సంగమ స్థలిలో 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్టు వివరించారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవనశైలికి అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహక కేంద్రం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టుకు ఫిబ్రవరి నెలాఖరులో చేసే శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని రక్షణమంత్రిని సీఎం ఆహ్వానించారు.
హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాలు కేటాయిస్తాం
తెలంగాణకు కేటాయించిన మూడు హైస్పీడ్ రైళ్ల మార్గాలను ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ నుంచే ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని సీఎం కోరారు. హైదరాబాద్-చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్-బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని అభ్యర్థించారు.
దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతమవుతుందని తెలియజేశారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని వివరించారు. ఈ మూడు కారిడార్లకు భూసేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించాలని కేంద్రమంత్రిని కోరారు. ఈ విజ్ఞప్తులపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది.
అదనపు ధాన్యాన్ని తీసుకోండి
వానాకాలం పంటకు (2025-26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం కేంద్రమంత్రిని ఆయన నివాసంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. వానాకాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్‌ఎంటీ) అనుమతించారని తెలిపారు.
కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో అదనంగా 18 ఎల్‌ఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ సేకరించాలని విజ్ఞప్తి చేశారు. 2024-25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుమతించాలని కోరారు. 2024-25 వానాకాలం పంటకు సంబంధించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు నిర్దేశించారనీ, దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలని విన్నవించారు. ఎఫ్‌సీఐకి 2014-15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
అప్పటి అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. అప్పటిలో సేకరణకు తాము రుణం తీసుకున్నామని, దానికి వడ్డీ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగిందని తెలియజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అదనపు డైరెక్టర్ రోహిత్ సింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.



