నవతెలంగాణ-వర్ధన్నపేట
మామునూరులో రిలే దీక్షలు చేపడుతున్న దీక్షా కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధావరం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అభివృద్ధిలో వెనుకబడ్డ మామునూరు గ్రామాభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుడుతానని అన్నారు. గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ మామునూరు గ్రామంలో మామునూరు గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం నాటికి 5వ రోజుకు చేరిందన్నారు. ఈ ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. గ్రామం వందేళ్ల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోవడం విచారకరమన్నారు.
మామునూరును మండల కేంద్రం చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మండల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. మామునూరులో పుట్టిన కారణంగా ఎమ్మెల్యేగా మండల కేంద్రం చేసి కన్న ఊరుకు న్యాయం చేస్తానన్నారు. మామునూరును మండల కేంద్రంతో పాటు భవిష్యత్తులో మున్సిపాలిటీ అయ్యే విధంగా కార్యాచరణ తీసుకుంటానన్నారు. గ్రామంలో నూతనంగా బస్ డిపోతోపాటు క్రీడాకారులకు మినీ స్టేడియం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమిష్టిగా కలిసి గ్రామంలో కావాల్సిన అన్ని అభివృద్ధి పనులను చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నే బాబురావు, గంటా నరేందర్ రెడ్డి, కొమురెల్లి యాదవ్, కలకోట్ల రవీందర్, సింగారపు అరుణ, తదితరులు పాల్గొన్నారు.



