Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమావాస్తవికతను ఆవిష్కరించిన దర్శక శిఖరం

వాస్తవికతను ఆవిష్కరించిన దర్శక శిఖరం

- Advertisement -

ప్రకృతి అందాలు, మానవ సంబంధాలను వెండితెరపై అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించిన దర్శక శిఖరం భారతీరాజా. స్టూడియోల నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయిన సినిమాను పల్లెటూరి పచ్చని పొలాల్లోకి, మట్టి వాసనల్లోకి తీసుకెళ్ళిన దార్శనికుడు. ఆయన సినిమాల్లోని ప్రతి ఫ్రేమ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఆయన సృష్టించిన పాత్రల మధ్య జరిగే సంఘర్షణ కూడా ప్రేక్షకుల మనసు పొరల్ని అంతగా మెలిపెడతాయి. కులం, మతం, వివక్ష, కట్టుబాట్లు..ఇలా సామాజిక కోణంలో ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఆలోచింపజేస్తుంది.

భారతీయ సినిమా దిశను మార్చిన గొప్ప కథా రచయిత, స్క్రీన్ ప్లే మాంత్రికుడు , దర్శకుడు, నటుడు, నిర్మాతగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన దర్శక శిఖరం భారతీరాజా.
గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భారతీరాజా (84) బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1941 జులై 17న తేని జిల్లా అల్లి నగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. మలేరియా డిపార్ట్మెంట్ లో చిన్న జాబ్ చేశారు. తర్వాత నాటకాలు ఆడటం కోసం, సినిమాల్లో పని చేయాలని ఆ ఉద్యోగం వదిలేశారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిచయంతో పుట్టన్న కణగల్ దగ్గర దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా చేరారు. తర్వాత మలయాళ దర్శకుడు బేబీ దగ్గర పనిచేశారు. దర్శకుడు అవ్వాలని ఎందరో నిర్మాతల చుట్టూ తిరిగారు. చివరికి తన కథ విని ఉత్తేజితుడై ఎస్.ఎ. రాజ్ కణ్ణు అనే లారీ డ్రైవర్ నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశారు. రజనీకాంత్, కమలహాసన్ శ్రీదేవి నటించిన ఆ చిత్రం పేరే ’16 వయదినిలే..’ . 1977లో వచ్చిన ఈ సినిమాతో భారతీయరాజా దర్శకుడిగా పరిచయ మయ్యారు. తమిళంలోనే కాకుండా తెలుగుతోపాటు మిగతా భాషల్లో కూడా ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

సినీ సంప్రదాయాన్ని తిరగరాసి.. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. కేవలం గ్రామీణ చిత్రాలకే భారతీరాజా పరిమితం అనే విమర్శకు సమాధానంగా ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులాబీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్‌ ‘తుడరుమ్‌’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పుల‌వ‌ర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సిఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా.

భారతీరాజా తర్వాతితరం చిత్రనిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సినిమా’ని స్థాపించారు. ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. ఆయన తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించి, ‘ఇయక్కునార్ ఇమయం (దర్శక శిఖరం)’ అనే బిరుదును పొందారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను అందు కున్నారు. ఇందులో తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డు కూడా ఉంది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ 2004లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. వీటితో పాటు 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. కథలు, పాత్రల్లో భావోద్వేగాలే కాక పాటల చిత్రీకరణలో కూడా భారతీరాజా కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. తమిళ సినీ ఇండస్ట్రీకి ఎక్కువమంది దర్శకుల్ని అందించిన ఘన చరిత్ర కూడా భారతి రాజాదే. భాగ్యరాజా, మణివణ్ణన్, మనోబాల, కే.రంగరాజ్ లాంటి డైరెక్టర్స్ తో పాటు, తెలుగులో భావుకత నిండిన దర్శకునిగా పేరు తెచ్చుకున్న వంశీ కూడా ఆయన శిష్యుడే. వంశీ చిత్రాల్లో భారతీరాజా ప్రభావం గురించి అందరికీ తెలిసిందే.

ఇళయరాజా సినీ అరంగేట్రానికి కూడా భారతిరాజా కారకులు. పాటల రచయిత వైరముత్తుని కూడా ఆయనే తీసుకొచ్చారు. డాన్స్ మాస్టర్ స్వర్ణని.. ఇలా మరెందరో టెక్నీషియన్స్ని, రాధిక, రాధ, రేవతి, రేఖ,సుకన్య లాంటి స్టార్ హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. ఆడ శిశువుల హత్యల నేపథ్యంలో తన తల్లి పేరుతో ‘కరుతమ్మాల్` అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి వచ్చిన జాతీయ అవార్డును రాష్ర్టపతి చేతుల మీదుగా తన తల్లితో అందుకున్నారు. అయితే ఆయన తనయుడు మనోజ్‌ భారతీరాజా మృతి భారతీరాజాను మానసికంగా కుంగదీసింది.

భారతీరాజా తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. హరి ప్రసాద్‌, సుహాసిని కీలక పాత్రల్లో ‘కొత్త జీవితాలు’ మూవీతో తెలుగులో మెగాఫోన్‌ పట్టారు. ఇక ఆ తర్వాత ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌. మాస్‌ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని ఆవిష్కరించారు. కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. సినీ సంగీత ప్రియులను ఓ ఊపు ఊపేసిన సినిమాల్లో ‘సీతాకోక చిలుక’ స్పెషల్‌. ‘16 వయదినిలే’ని తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో కె.రాఘవేంద్రరావు రీమేక్ చేశారు. ‘సిగప్పు రోజక్కల్‌’, ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమైంది. ‘కిళక్కే పోగుం రైల్’ను బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా, ‘ముదల్ మారియాదై’ ‘ఆత్మబంధువు’గా, ‘మన్ వాసనై’ బాలకృష్ణ హీరోగా ‘మంగమ్మగారి మనవడు’గా, భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ కథను తెలుగులో కమల్ ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించాయి. ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీసి, విజయం సాధించారు.

నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపి స్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా. – భారతీ రాజా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -