Wednesday, June 10, 2026
E-PAPER
Homeసినిమాగొప్ప దర్శకుడిని కోల్పోయాం

గొప్ప దర్శకుడిని కోల్పోయాం

- Advertisement -

దిగ్దర్శకుడు భారతీరాజా ఇకలేరన్న విషయాన్ని ఆయన అభిమానులే కాదు ఆయనతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర య్యారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారు. ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించారు. ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి


భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయ కత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. ‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రేమ, నిరాడంబరత, తన కళ పట్ల అంకితభావం నాపై చెరగని ముద్ర వేశాయి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన అద్భుతమైన చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. – చిరంజీవి

సహజంగా, ఎక్కడా రాజీపడకుండా సినిమా కథను చెప్పే విషయంలో ఒక విప్లవం సృష్టించిన మార్గదర్శి భారతీరాజా. మర్చిపోలేని విధంగా ఆయన తెరపైకి తెచ్చిన గ్రామీణ కథలు, వాస్తవితక ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయి. సినీ ఇండస్ట్రీ ఆయన అసాధారణ కృషి, పనితీరును స్మరించు కోవడం గొప్ప గౌరవం. – దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి

భారతీరాజా తెలుగులో దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. ఆ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అన్నయ్య చిరంజీవితో ‘ఆరాధన’ చిత్రం రూపొందించారు. అందులో ‘అరె ఏమైంది…’ అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. – పవన్‌ కల్యాణ్‌ నిశ్శబ్దంలో సత్యాన్ని చూపిన దర్శకుడు భారతీరాజా. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రకృతిని అందంగా చూపారు. ‘తుడరుమ్’ చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ పంచుకోవడం నేను ఎప్పటికీ పదిలపరుచుకునే గౌరవం. ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. – మోహన్‌లాల్‌

భారతీరాజా సర్‌.. మాపై మీరు చూపిన ప్రేమకి, మాలో మీరు నింపిన స్ఫూర్తికి, ఎన్నో గొప్ప సినిమాలను అందించినందుకు.. అన్నింటికీ ధన్యవాదాలు. – ప్రకాష్ రాజ్‌

భారతీరాజా ఓ దిగ్గజం, ఆయన దార్శనికత, కథ చెప్పే విధానంతో పాటు భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి. నేటి దర్శకులు, నటులకే కాదు, రాబోయే తరాలకు ఆయన సినిమాలు స్ఫూర్తి.– అల్లు అర్జున్‌


భారతీరాజా సినిమాలు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు ఆయన చిత్రాలు ఓ నిఘంటువులా ఉంటాయి. ప్రతి సినిమా ప్రేమికుడి కోసం ఆయన ఒక గొప్ప వారసత్వాన్ని వదిలి వెళ్లారు. – ఖుష్బూ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -