Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి

అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి

- Advertisement -

అధికారులకు సీఎస్‌ రామకృష్ణారావు ఆదేశం
సిగాచీ బాధితులకు పరిహారం చెల్లింపుపై ఆరా


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
భారీ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై నిబంధనలు సిద్ధం చేయాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సిగాచీ ఇండస్ట్రీస్ దుర్ఘటనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులు, కోర్టు కేసుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వివిధ విభాగాలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించడానికి ఉమ్మడి బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్‌, పరిశ్రమలు, కార్మిక, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో కూడిన తనిఖీ బందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో (డాష్‌ బోర్డ్‌) పొందుపరిస్తే అన్ని విభాగాల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశముంటుందన్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు, ఆడిట్‌, కార్మికుల భద్రతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్‌ కుమార్‌, సంజయ్ కుమార్‌, దాన కిషోర్‌, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య, ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ శశాంక, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -