ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న ఆయన, స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన నాయకునిగా చరిత్ర సృష్టించినట్లు చెప్తున్నారు. 1952 నుంచి జవహర్‌లాల్ నెహ్రు పాలనను సాంకేతికంగా లెక్కించి ఆ రికార్డును బుధవారం నాడు మోడీ అధిగమించినట్లు ప్రచారం చేస్తున్నారు. 1947 నుంచి ఐదేళ్ల పాటు సాగిన నెహ్రు పాలనను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఈ చర్యతో మోడీని తిరుగులేని నాయకునిగా చిత్రీకరించడానికి సంఘ్‌పరివార్, బీజేపీ, వాటి అనుబంధ సంస్థలు, గోడీ మీడియా ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రచార హోరును పక్కనబెట్టి ఈ పన్నెండేళ్ల పాలన దేశ ప్రజల జీవితాలపై ఎలాంటి ముద్ర వేసిందన్నది పరిశీలిస్తే ఏమున్నది గర్వకారణమన్న మహాకవి మాటలే గుర్తుకువస్తాయి.
మోడీ పాలన అనగానే 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తొలుత గుర్తుకొస్తుంది. ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసింది. అసంఘటిత రంగం, చిన్న పరిశ్రమలు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు కోలుకోలేని దెబ్బతిన్నారు. బ్యాంకుల ముందు క్యూలలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచాన్ని కుది పేసిన కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహ రించిన తీరు దేశ ప్రజలకు ఎప్పటికీ పీడకలే! అకస్మాత్తుగా ప్రకటించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్ లక్షలాది వలస కార్మికులను రోడ్డున పడేసింది. వందల కిలోమీటర్లు కాలినడకన స్వగ్రామాలకు వెళ్లిన వారి దృశ్యాలు మనదేశ సామాజిక వాస్తవికతను ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టాయి. రెండో దశ కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత, పడకల లభ్యత లేకపోవడం, ఔషధాల కొరత కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గంగానదిలో తేలిన మృతదేహాలు, శ్మశానాల్లో కనిపించిన భయానక దృశ్యాలు ప్రభుత్వ వైఫల్యాలకు ప్రతీకలుగా మిగిలిపోయాయి.
ఆర్థిక రంగంలోనూ మోడీ పాలన సాధించిన ఘన విజయాలు దాదాపు శూన్యం! రోజురోజుకి కృంగి కృశించి పోతున్న రూపాయి విలువే దీనికి నిదర్శనం.నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పెరిగిన ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను ఘోరంగా దెబ్బతీశాయి.
}
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్, నిత్యావసర వస్తువుల ధరలు వరుసగా పెరుగుతుండగా, ప్రజల నిజ ఆదాయాలు అందుకు అనుగుణంగా పెరగడం లేదు. కార్పొరేట్ సంస్థలకు భారీ పన్ను రాయితీలు, రుణాల మాఫీలు ప్రకటిస్తూనే, సామాన్యులపై పరోక్ష పన్నుల భారం మోపిన ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానిది. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల లాభాలే లక్ష్యంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రైతులపై రుద్దడానికి చేసిన ప్రయత్నం దేశ చరిత్రలోనే అతి పెద్ద రైతాంగ ఉద్యమానికి దారితీసింది. విదేశాంగ విధానంలోనూ ‘విశ్వగురు’వంటి ప్రచార యావ తప్ప, జాతీయో ద్యమ వారసత్వంగా నెలకొల్పిన విలువలను మంట గలిపిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కింది. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు క్షీణించాయి. అన్ని రంగాల్లోనూ అమెరికా అడుగులకు మడుగులొత్తడమే లక్ష్యంగా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కలిసి చేస్తున్న దాడులపట్ల మన దేశ వైఖరే దీనికి నిదర్శనం.
రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపర్చడం, ప్రజాసామ్య విలువలను తుంగలో తొక్కడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మోడీ సర్కారుదే పై చేయి! పార్లమెంటు చర్చల సంప్రదాయం క్షీణించింది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రత్యర్థులను, మేధావులను, లౌకిక వాదులను, అభ్యదయ శక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషన్‌తో పాటు న్యాయవ్యవస్థ స్వతంత్రత కూడా ప్రశ్నార్ధకంగా మారింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో సమాఖ్య స్ఫూర్తిని ఘోరంగా దెబ్బతీశారు. హిందూ మతోన్మాదం, మైనారిటీలపై విద్వేష ప్రచారం, గోగూండాల దాడులు, విద్వేష ప్రసంగాలు దేశ స్వాతంత్ర్య పోరాటం నిర్మించిన లౌకిక, బహుళత్వ విలువలకు సవాల్‌గా మారాయి. ఈ వాస్తవ పరిస్థితిని మోడీ ప్రచార యంత్రాంగం మసిపూసి మారేడు కాయ చేస్తోంది. అయితే, ఈ పరిస్థితి ఎల్లకాలం సాగదు. నాయకుల్ని వారి వాగాడంబరంతో కాకుండా, వారు సాధించిన ఫలితాలతోనే చరిత్ర అంచనా వేస్తుంది. నిరుద్యోగంతో నిస్సహాయులైన యువతరం, లేబర్ కోడ్‌లతో భద్రత కోల్పోయిన కార్మికులు-ఉద్యోగులు, భవిష్యత్తుపై బెంగలో చిక్కుకున్న రైతాంగం, మనువాద శక్తుల విజృంభణతో నిస్సహాయులుగా మారుతున్న మహిళలు, దళితులు, మైనార్టీలు… ఇవి చాలవా… పన్నెండేళ్ల కార్పొరేట్-మతతత్వ కూటమి పాలన ఘనతను అర్ధం చేసుకోవడానికి!
ఏమున్నది గర్వకారణం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



