గుండమ్మ కథలో పాటను పక్కన పెడితే..
‘పాములను మింగే కప్పలు పుట్టును
డేగలను తరిమే పిచ్చుకలొచ్చును
కుక్కలకు భయపడే సింహాలుండే’ కాలమొకటొస్తుందని బ్రహ్మంగారు చెప్తే ఏమో అనుకున్నాంగానీ, ఇంత కాలం మనం విన్న కథలేమిటి? ‘ఏకలవ్యుని బొటనవేలు గుటుక్కున మింగిన ద్రోణా చార్యుల గురించీ, సూతపుత్రుని చంపడానికి ఆరుగురు కలిసి చేసిన దాన్ని ‘కుట్ర’ అనే పేరు రాకుండా చూసుకున్న శ్రీకృష్ణుడి పన్నాగాలు వగైరాలేగా మనం నేర్చుకున్నది!’ అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రామయ్య! పాపం అతనికి చార్మినార్ రేకుల గురించి చెప్పేవాడెవడూ లేడు. ఇది యాడ్ కాదు కదా, నిజజీవితం! లచ్చుమన్న వచ్చి పై సంగతులన్నీ చెప్పాడు. ఒక మహాబలిసిన ఏనుగును, ఇంకో గున్న ఏనుగును చిట్టెలుక ఒకటి ఏ కన్నంలో నుండి ఎగబడతుందో తెలీకుండా ఒక కంతలోంచి బయటి కొస్తుంది. బాంబులతో విధ్వంసం సృష్టించి మళ్లీ కంతలో దూరిపోతోంది. బయట జరిగే ఈ ఇరాన్, అమెరికా + ఇజ్రాయిల్‌ల ‘చుంచు’ సయ్యాట గురించి తర్వాత చూద్దాం. ముందు ఇంట్ల జరిగే ‘ఆట’ చూద్దాం. ఆ యాటకి, ఈ ఆటకి సంబంధమేంటనీ, అసలు బ్రహ్మంగారు చెప్పిన దానికీ, దీనికి సంబంధమేమంటనే సందేహాల్రావులకు మన దగ్గర కొదవేం లేదు కదా! కప్ప, పాముల కథని మళ్లీ జ్ఞాపకం చేసుకుందాం.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ మధ్య ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఇదేంటని కాంగ్రెస్‌లో ఎవరూ, టీడీపీలో ఎవరూ చప్పుడు చేయలేదు. ఆ నాటికి ముప్ఫయేండ్ల కాంగ్రెస్ పాలనను మట్టికరిపించాడు ఎన్టీఆర్. 1982లో మిన్నంటిన గిట్టుబాటు ధరల ఉద్యమం దానికి పునాది వేసింది. ఆయనపై కాంగ్రెస్‌లో కసీ ఉండాలి, కోపం టీడీపీకి ఉండాలి. కందకి లేని దురద కత్తిపీట కెందుకనే వారుంటారు. మధ్యలో నీకెందుకనే దురదగొండి ఆకులుంటాయి. ప్రస్తుతానికి ఏది కప్పో, ఏది పామో తెలీదు. ఎవరు ఎవర్ని మింగాలనుకుంటున్నారో తెలియదు. ఇటీవల ఎన్టీఆర్ విగ్ర హాన్ని ఆవిష్కరించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ‘ఎన్టీఆర్ దేశం గర్వించదగిన గొప్ప నాయకుడని, అది కేవలం విగ్రహం మాత్రమే కాదు, రాజకీయాలకు అతీతమైన స్ఫూర్తి!’ అన్నారు. దీని భావమేమి తీరుమలేశా?! జంట నగరాల్లో ఒక సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన జరపడానికి టీడీపీ శ్రేణులు ఉరకలెత్తడంలో ఆశ్చర్యమేం లేదు. కానీ, జీవిత ఆసాంతం కాంగ్రెపై పోరాడిన వ్యక్తి కోసం బంధు, మిత్ర సపరివార సమేతంగా తరలివెళ్లిన రేవంత్ రెడ్డిని పురికొల్పిందేమిటి? పాత గురువు సంస్మరణా? ఆ పేర జిహెచ్‌ఎంసి ఎన్నికలపై ఓ కన్నేశా? లాభం లేనిదే వ్యాపారి వరదన పోతాడా? ఇక్కడ, నాటి మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రినీ, 1984లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకీ మధ్య శిఖండి పాత్ర పోషించిన రామ్‌లాల్‌నూ, ఆయన్ని పురమాయించిన ఇందిరాగాంధీ పాత్రనూ మరిచి పోకూడదు.
రేవంత్ చెప్పిన ముగ్గురు మహిమాత్ముల్లో ఎన్టీఆర్‌తో పాటు ఆమె కూడా ఉంది. అదెలా సాధ్యం ముఖ్యమంత్రి వర్యా? అది ఆయనే చెప్పుకున్నట్టు ‘ఖాకీ లాగూల’ దశ కావచ్చు. కప్పని మింగ పోయి భంగపడ్డ పామునీ, పెద్దఎత్తున ప్రజాపోరాటం జరిగి దేశ చరిత్రలో సదరు పాము విషకోరల్లో నుండి బయలు పడ్డ ‘కప్ప’నీ ఇద్దర్నీ చూసి స్ఫూర్తి ఎలా పొందుతాం సారూ! రాజకీయ తాయిలాలు ‘వర్థిల్లు’గాక! బతికి ఉన్నన్నాళ్లు ఒక వ్యక్తిని తిట్టుకుని, రాజకీయ కుట్రలు చేసి, పదవి నుండి కూలదోసి, ఈ మరణానంతర కౌగిలింతలెందుకు? దానికీ అర్ధ౦ లేక పోలేదు! భూస్వాముల నుంచి పెట్టుబడిదారులుగా ఎదిగినవారు, ఫక్తు భూస్వాములు వచ్చిన నీటిపారుదల సౌకర్యాలు, కొత్త వంగడాలు, రసాయన ఎరువులు వాడుకుని శత కోటీశ్వరులుగా ఎదిగిన వారు మెల్లిగా తెలుగుదేశం వైపు మళ్లారు. వర్గంలో తేడా లేనంతవరూ రాజకీయ రంగు లకు, వాడే డైలాగులకు పరిమితేముంటుంది? నేటి ఐక్యతకు అర్థమదే! రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా దాన్లో భాగమే! మిగిలి ఉన్న టీడీపీ ‘కప్ప’ల్ని ప్రస్తుతానికి ఆ పాము మింగే ప్రయత్నమే అది.
కేసీఆర్ చేసిన పీవీ విగ్రహావిష్కరణ కూడా అటువంటిదే. పీవీ స్వగ్రామం తెలంగాణలో ఉందన్న మిష, ఆర్థిక విధానాలు తప్ప కేసీఆర్‌కు ఇంకేం సాకుంది?! రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి మొదలవుతున్న -వాసన రాగానే ఇటు పీవీ విగ్రహావిష్కరణా, అటు ఆయన బిడ్డను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడం, శాసనమండలిలోకి ఎంపిక చేసి లూప్‌లైన్‌లోకి నెట్టేయడం చకాచకా జరిగిపోయాయి. ఇది ఫక్తు అవసరార్థం చేసిన పొలిటికల్ జిమ్మిక్కే. ఇక్కడ కప్పని మింగేందుకు పాము నోరుసరిపోనట్టుంది. ‘మరో రాజకీయ సయ్యాట’ మన్మోహన్ సింగ్ మరణానంతరం మోడీ సర్కార్ ఆడిన ‘ఆట’! వారం రోజులు అధికారిక సంతాప దినాలుగా ప్రకటించడంతో పాటు, మంత్రి వర్గం ఇచ్చిన ప్రకటనలో ఆయన పదేళ్ల పాలనా కాలాన్ని ఆకాశానికి ఎత్తారు. ఆశ్చర్యమేమంటే, ఇవే నోళ్లు ‘కోల్ గేట్’ స్కాం గురించీ, బొగ్గు గనులు కేటాయిస్తున్న కాలంలో (2004-09) కేంద్ర బొగ్గు శాఖను నిర్వహించిన మన్మోహన్‌సింగ్ అవినీతి మసి అంటిన ప్రధానిగా తెగనాడటం మనం మర్చిపోయుంటామని ‘మో-షా’ల ఆలోచన! దేశాన్ని సంస్కరణల పథంలో నడిపిన ‘మహనీయుడి’గా మోడీ సర్కార్ కొనియాడటం ఒక కోణంలో సరైందే! ఆ దార్లో నడిచేగా మోడీ సర్కార్ మాటలు కాకుండా ‘చేతల్లోకి’ దిగింది.
లేబర్ కోడ్‌లు, రైతు ‘నల్ల’ చట్టాలు, తాజాగా వ్వవసాయ కూలీల కడుపు కొట్టే వీబీజీ రామ్‌జీ అంటూ ఉపాధి హామీ చట్టానికి మంగళం పాడటం అన్నీ ఆ బాపతులే! వామపక్షాల వత్తిడితో తయారైన ఉపాధి హామీ చట్టం ఏ పెట్టుబడిదారీ దేశంలోనూ లేనిది. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తామన్న ప్రతి స్త్రీ పురుషుడికి ఏడాదికి వంద రోజుల పని గ్యారంటీ చేసిందీ చట్టం. పని ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నది చట్టం. ఆ విధంగా పొందిన రాష్ట్రాల వ్యవసాయ కూలీలున్నారు. దానికి వేతనాలు ఫిక్స్ చేశారు. మధ్యలో వాటిని పెంచారు. మోడీ సర్కార్ రాకతో బడ్జెటరీ కేటాయింపుల కోతలతో ప్రారంభమై ఇప్పుడు మొత్తనికే మంగళంపాడారు. ఏడాదికి 125 పని దినాలు చేశామన్న అంశం తప్ప ఇతర ఏ మంచి మాటా, విబిజి రామ్‌జీ చట్టంలో లేదు. దీనిపై కాంగ్రెస్ వారి అభ్యంతరమేమంటే మహాత్మాగాంధీ పేరు తీసేశారనే! నలభై శాతం నిధులు రాష్ట్రాలే చెల్లించాలన్న దాన్ని కూడా హిమాచల్, కర్నాటక, తెలంగాణలు కనీస అభ్యంతరాలు చెప్పలేదు.
పార్లమెంటులో ప్రత్యక్షంగా మీ విధానాలనే మేము అవలంబిస్తున్నామని చెప్పుకుంది మోడీ సర్కార్! ఆ అవలంబన పాపం వీళ్లు చూసేది, చేసేది ఏముంది? అంతా ‘పైవాడే’గదా చూసుకునేది?! మన్మోహన్‌సింగ్, మోంటేంగ్ సింగ్ అహ్లువాలియా, అరవింద్ పనగారియా వంటి వారందరు ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఏడీబీల వారే. వ్యవహారం, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులది వ్యాపారం కాంగ్రెస్, బీజేపీలదీ! ఈ మొత్తం ఆటలో పాములన్నీ అవే! కప్పలు మ్రాతం కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు వంటి కష్టజీవులే! కాబట్టి సృష్టి రివర్సు అయ్యే సమస్యే లేదు. కష్టజీవుల కులంలో పుట్టి కష్టపడేవారందరికీ ధైర్యం చెప్పిన బ్రహంగారు ధన్యులు.
ఇక బయటికి తొంగి చూద్దాం. ప్రస్తుతం మధ్య ఆసియా యుద్ధంలో అటు ఆమెరికాను, ఆయుధ సంపత్తిలోగాని, గూఢచర్యంలో గాని సిఐఏకు ధీటైనది ఇజ్రాయిల్ గూఢచారి విభాగం మొసాద్ అని ప్రచారంలో ఉంది. అందుకే ఫ్రిబవరి 28న అత్యంత రహస్య ప్రదేశంలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశంపై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ దేశ సుప్రీం నాయకుడిగా పరిగణించబడే అయతుల్లా అలీ ఖమేనీతోపాటు దాదాపు నలభై మంది ఉన్నత స్థాయి సైనికాధికారుల్ని మట్టుబెట్టింది అమెరికా, ఇజ్రాయిల్ బృందం. తర్వాతి పది రోజుల్లో ఆయుద్ధం పరిసమాప్తమ వుతుందనీ, ఇరాన్‌లో ప్రజా తిరుగుబాటుతో పాలనా మార్పు జరగుతుందని (రెజీమ్ ఛేంజ్) ఈ ప్రపంచ డెకాయిట్లు ఇరువురూ ఆశించారు. జూన్ పది వచ్చినా యుద్ధం ముగిసే సూచనలు కనపడటంలేదు.
ఇరాన్ ఆయుధ సంపత్తిని చూసి రెండూ మిన్నాగులూ నోరెళ్ల బెడ్తున్నాయి. యుద్ధ వెటరన్స్ అమెరికా, ఇజ్రాయిల్ దుర్మార్గాలను ప్రతి రోజూ తమ యూట్యూబ్ ఛానెల్స్‌లో ఎండగడ్తున్నారు. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి అమెరికా ఆజ్యం పోస్తోందనీ, ‘మిస్టర్ ప్రెసిడెంట్, ప్లీజ్ స్టాప్ దిస్ వార్’ అని హెచ్చరిస్తున్నారు. మరి కొందరు మిలటరీ విశ్లేషకులు రోజూ హార్మూజ్ జలసంధి ద్వారా ఇరవై శాతం చమురు రవాణా జరుగుతుందనీ, నేడు చమురు (ఎనర్జీ) సంక్షోభం ముసురుకుంటోంది.
కొందరు మిలటరీ (జియో పొలిటికల్) విశ్లేషకులు 1928 నాటి ఆర్థిక సంక్షోభం పొంచి ఉందంటున్నారు. ఇజ్రాయిల్ ప్రయోజనాల కోసం తామెందుకు చావాలని అమెరికన్ సైనికులు ఆందోళన వ్యక్తం చేస్తూండగా, వారి కుటుంబీకులు పెద్దఎత్తున అమెరికాలో ప్రదర్శనలు చేస్తున్నారు. అమెరికన్ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ప్రదర్శనలతో హోరెత్తుతు న్నాయి. అయినా ఇటు ట్రంప్, అటు బెంజిమిన్ నెతన్యాహూలు మాత్రం ఇరాన్‌ని ధ్వంసం చేసే వరకు నిద్రపోమంటున్నారు. అనేక మంది ఆర్థిక, సామాజిక విశ్లేషకులు చెప్పేదేమంటే గత నాలుగు వేల యేండ్లలో ఇరాన్‌ను ఏ పరాయి శక్తులు ఓడించలేకపోయాయని! అత్యంత పురాతన సంస్కృతుల్లో ఇరాన్ కూడా ఒకటి. ఇరాన్‌కు మద్దతుగా లెబనాన్‌కి చెందిన హిజ్‌బుల్లా దళాలు, యెమెన్‌కు చెందిన హౌతీలు రంగంలో నిలిచాయి. పాలస్తీనా వీరులు ఎలానూ ఉన్నారు. (నౌ ఆర్ నెవ్వర్) ఇపుడు కాకపోతే ఎప్పటకీ కాదనే స్ఫూర్తితో సమిష్టిగా ఈ వేయి పడగల విష సర్పాన్నీ, దాని మధ్య ఆసియా మ్రితుడు ఇజ్రాయిల్‌పైనా విరుచుకుపడ్తున్నారు. ఇపుడే కప్పలు పాముల్ని మింగేస్తున్నాయనీ, పిచ్చుకలు డేగల్ని తరిమేస్తున్నాయనీ భావించలేం. అమెరికా దాష్టీకానికి బలౌతున్న చిన్న, పెద్ద దేశాలు ఏకమవుతున్న స్థితి చూస్తాం. ఏమైనా కుక్కల్ని చూసి బెదిరే సింహాలు మాత్రం మన కళ్లెదుటే ఉన్నాయి.
ఆర్.సుధాభాస్కర్



