Wednesday, June 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅట్టుడుకుతున్న మధ్యప్రాచ్యం

అట్టుడుకుతున్న మధ్యప్రాచ్యం

- Advertisement -

దాడులు, ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్తత ట్రంప్‌ ఆదేశాలతో హార్ముజ్‌ వద్ద ఇరాన్‌పై అమెరికా దాడులు
ప్రతిగా గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడిన టెహ్రాన్

నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
దాడులు, ప్రతి దాడు లతో మధ్య ప్రాచ్యం అట్టు డికిపోతోంది. కాల్పుల విర మణను ఉల్లంఘిస్తూ, ఆరోపణలు-ప్రత్యా రోపణలు చేసుకుంటూ అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడులకు దిగుతు న్నాయి. హార్ముజ్‌ జలసంధి పరిస రాలలోని ఇరాన్‌ లక్ష్యాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిగా జోర్డాన్‌, కువైట్‌, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డులు బుధవారం క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. హార్ముజ్‌ సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్‌ మంగళవారం కూల్చివేసిన నేపథ్యంలో ప్రతీకార దాడులు జరపాలని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సేనలను ఆదేశించారు. దీంతో అమెరికా సేనలు హార్ముజ్‌ పరిసరాలలోని ఇరాన్‌ లక్ష్యాలపై దాడులు జరిపాయి.

ఏం జరిగింది?
అమెరికా స్పందన చాలా బలంగా, శక్తివంతంగా ఉంటుందని దాడులకు ముందు ట్రంప్‌ ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. ట్రంప్‌ ఆదేశాల మేరకు ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్‌ కంట్రోల్‌ స్టేషన్లు, నిఘా రాడార్‌ ప్రదేశాలపై తాజాగా దాడులు చేశామని అమెరికా సైన్యం వివరించింది. ఈ దాడులు నాలుగు గంటల పాటు కొనసాగాయి. దాదాపు 20 ఇరాన్‌ లక్ష్యాలపై దాడులు జరిగాయని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. హార్ముజ్‌ పరిసరాలలోని మూడు వ్యూహాత్మక ప్రదేశాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. రెండు నీటి రిజర్వాయర్లపై కూడా అమెరికా దాడి చేసిందని, దీంతో ఆ ప్రాంతంలో ఇరవై వేల మందికి నీటి సరఫరా నిలిచిపోయిందని ఇరాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ తెలిపింది. ఈ రిజర్వాయర్ల నుంచి కౌహెస్‌టాక్‌ పట్టణానికి, దాని పరిసరాలలోని పది గ్రామాలకు తాగు నీరు సరఫరా అవుతోంది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టి ప్రత్యామ్నాయ మార్గాలలో నీటి సరఫరా చేస్తున్నారు. కాగా ఖెష్మ్‌ దీవి పైన, హార్ముజ్‌లోని ఓడరేవు నగరమైన సిరిక్‌ పైన అమెరికా దాడులు చేసిందని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలియజేసింది. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా బV్‌ారైన్‌, కువైట్‌, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించామని చెప్పింది. ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌ హ్యాంగర్లు సహా దూర శ్రేణి క్షిపణులతో జోర్డాన్‌లో అమెరికాకు చెందిన అల్‌-అజ్రఖ్‌ స్థావరంలోని నాలుగు ప్రదేశాలు, కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంపై రివల్యూషనరీ గార్డులు దాడులు చేశారు. అమెరికా మరోసారి దాడులకు దిగితే తమ స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని, నామరూపాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

గగనతల రక్షణ వ్యవస్థలకు పని చెప్పిన గల్ఫ్‌ దేశాలు
ఇరాన్‌ వైపు నుంచి అల్‌-అజ్రఖ్‌ స్థావరం వైపు వచ్చిన ఐదు క్షిపణులను అడ్డుకున్నామని జోర్డాన్‌ సైన్యం చెప్పింది. ఈ క్రమంలో తమ భూభాగంలో శకలాలు పడ్డాయని, అయితే ఎవరూ గాయపడలేదని, నష్టం కూడా జరగలేదని తెలిపింది. ఇరాన్‌ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్‌ సైన్యం తెలియజేసింది. అధికారులు సూచించే భద్రతా చర్యలను పాటించాలని ప్రజలను కోరింది. అటు బV్‌ారైన్‌లోని అమెరికా లక్ష్యాలపై కూడా ఇరాన్‌ దాడులు జరిపింది. కాగా ప్రాంతీయ దేశాలపై ఇరాన్‌ జరుపు తున్న దాడులను ఈజిప్ట్‌, యూఏఈ, ఖతార్‌ ఖండించాయి.

క్షేమంగా ఉండాలంటే గల్ఫ్‌ను వీడండి : అమెరికాకు అరాగ్చీ హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. క్షేమంగా ఉండాలని అనుకుంటే పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని సూచించారు. దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్‌ సేనలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గల్ఫ్‌ ప్రాంతంలో ‘బయటివారు చొర బడితే’ కనీవినీ ఎరుగని తీవ్ర పరి ణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దని కూడా అన్నారు. ‘యుద్ధ భూమిలో పరాజయం పాలైనప్పటికీ మా సంకల్పాన్ని పరీక్షించాలని అమెరికా అనుకుంటోంది. శక్తివంతమైన మా సాయుధ సేనలు ఎలాంటి దాడులకైనా జవాబిస్తాయి. వదిలిపెట్టవు. క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉండాలని అనుకుంటే మా ప్రాంతాన్ని వదిలేయండి. బయటి నుంచి వచ్చే చొరబాటుదారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్న ఉదంతాలు పర్షియన్‌ గల్ఫ్‌ చరిత్రలోని అనేక ఛాప్టర్లలో ఉన్నాయి’ అని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో హెచ్చరించారు.

మళ్లీ పెరిగిన చమురు ధరలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసియాలో చమురు ధరలు బుధవారం ఏడు శాతం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.22 శాతం పెరిగి బ్యారల్‌కు 91.65 డాలర్లకు చేరింది. ఇరాన్‌తో మరో మూడు రోజులలో శాంతి ఒప్పందం కుదరబోతోందంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనతో మంగళవారం ఇంధన ధరలు బాగా తగ్గాయి. అయితే తాజా దాడులతో అవి మరోసారి పెరగడం ప్రారంభమైంది.

చర్చలపై ఇరాన్‌ ‘సమీక్ష’
తమ దక్షిణ ప్రాంతంపై అమెరికా జరిపిన దాడులను ఇరాన్‌ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఆత్మరక్షణ కోసమే ప్రతి దాడులు జరిపామని చెప్పింది. భూభాగాలను ఉపయోగించుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్‌లను అనుమతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గల్ఫ్‌ దేశాలను హెచ్చరించింది. దాడుల నేపథ్యంలో చర్చలపై ‘సమీక్ష’ జరుపుతున్నామని విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘై చెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలు పదే పదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. శూన్యంలో దౌత్యం సాధ్యపడదని స్పష్టం చేశారు. చర్చలు ముందుకు సాగాలంటే కనీస అనుకూల వాతావరణం ఉండాలని అన్నారు. ‘దురదృష్టవశాత్తూ పరస్పర విరుద్ధ సందేశాలు పంపడం, తరచూ వైఖరులు-డిమాండ్లను మార్చుకోవడం వంటి చర్యలతో చర్చల ప్రక్రియను అమెరికా నీరు కారుస్తోంది. ఇజ్రాయిల్‌ కూడా నమ్మకాన్ని కోల్పోతూ లెబనాన్‌పై తరచూ దాడులకు తెగబడుతోంది’ అని ఆరోపించారు. కాగా ఇరాన్‌ ప్రయోగించిన దాదాపు అన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడం జరిగిందని, తమ సిబ్బందికి కానీ, స్థావరాలకు కానీ నష్టం జరిగినట్లు సమాచారమేమీ లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -