హైకోర్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో రోడ్లపై ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లు ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయమనీ, ఫుట్‌పాత్‌లు లేక ప్రజలు రోడ్లపై నడవలేకపోతున్నారనీ, రోడ్లపై నడవాల్సివస్తోందనీ, దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పన్నులు చెల్లించే ప్రజలు ఫుట్‌పాత్‌ల వినియోగం లేని దుస్థితి ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు లేదా మీడియా కథనాల సమయంలో మాత్రమే అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి, తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారని అభిప్రాయపడింది.
బాగ్‌లింగంపల్లి ప్రాంతంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ శ్రవణ్ కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్ చట్ట ప్రకారం స్థలాన్ని కొని అధికారిక అనుమతులతో వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది ఆక్రమణలు గుర్తించిన తర్వాతే నోటీసులు జారీ చేశామన్నారు. ఫుట్‌పాత్ ఆక్రమించుకున్నారని చెప్పారు. దీనిపై హైకోర్టు, అధికారుల ఉదాసీనతపై కమిషనర్ విచారణ జరపాలని ఆదేశించింది. మూడు నెలల్లో ఆక్రమణ తొలగింపుపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీకి స్పష్టం చేసింది.
వైద్యం నిరాకరణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
రోగికి సహాయకుడు లేడనీ, ఆధార్ గుర్తింపు కార్డు లేదన్న కారణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం నిరాకరించిన ఘటనపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహాయకుడు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా వైద్యం అందించే విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రవి చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రాగా వైద్యం నిరాకరించబడినట్లు వచ్చిన కథనాల ఆధారంగా న్యాయవాది బి. కొమురయ్య హైకోర్టుకు లేఖ రాశారు. ఆ లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్య, వైద్యం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులని వాదనలు వినిపించగా, కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.
విద్యాహక్కు చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయండి
రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అమలులో నిర్లక్ష్యం జరుగుతోందంటూ న్యాయవాది బి. కొమురయ్య రాసిన లేఖను కోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్లు పెరుగుతున్నాయన్న వాదనలను గమనించింది. విద్యాహక్కు చట్టం అమలు కాకపోవడం పేద విద్యార్థులపై ప్రభావం చూపుతోందని పేర్కొంటూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ పిటిషన్‌ను ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులతో జత చేయాలని రిజిస్ట్రీకి సూచిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
భూదాన్ భూములపై ఈడీ కేసు రద్దుకు నిరాకరణ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రాథమిక దర్యాప్తులో అక్రమాలు, భారీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదనను కోర్టు సమర్థించింది. దర్యాప్తు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేస్తూ నిందితుల పిటిషన్లను తిరస్కరించింది.
హెచ్‌సీఏ నిర్ణయంపై విచారణ వాయిదా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తనపై అనర్హత వేటు వేసి మరో వ్యక్తిని నియమించడాన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు ఎ. జగన్మోహన్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అంబుడ్స్‌మన్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ పిటిషనర్ తరఫున వాదనలు వినిపించగా, హెచ్‌సీఏ తరఫు న్యాయవాది పిటిషన్ విచారణార్హం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్ విచారణార్హతపై ముందుగా పరిశీలన అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.
ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



