Saturday, February 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమెరుగైన ఫలితాలు సాధించాం

మెరుగైన ఫలితాలు సాధించాం

- Advertisement -

కాంగ్రెస్‌, బీజేపీలను నిరోధించడమే లక్ష్యం
సింగరేణిలో దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి మద్దతు
మా అభ్యర్థులను బెదిరిస్తున్న కాంగ్రెస్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) అన్నారు. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా అండగా నిలబడ్డ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అధికార పార్టీ ఎన్ని రకాలుగా బెదిరింపులు, దాడులు, ప్రలోభాలకు గురిచేసిందనీ, ప్రజల మనసు గెలవడంలో విఫలమైందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేలకుపైగా సర్పంచ్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలిచిందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 15 మున్సిపాల్టీలను గెలిచిందని వివరించారు. హంగ్‌ వచ్చిన వాటిలో 10, 15 మున్సిపాల్టీల్లో తమకు అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో డబ్బు, మద్యం, అధికార యంత్రాంగ దుర్వినియోగం పరాకాష్టకు చేరాయని అన్నారు. అయినా ఓటర్లు భయపడకుండా బీఆర్‌ఎస్‌కు ఓటు వేశారని చెప్పారు.

కాంగ్రెస్‌ బేరసారాలు, ఎత్తుకుపోవడాలు, పోలీసులను పంపించి బెదిరించడాలు మొదలయ్యాయని అన్నారు. సింగరేణి బొగ్గు కుంభకోణం రూ.ఆరు వేల కోట్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాల్టీలో సీపీఐ తమకు మద్దతిచ్చిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో తాను మాట్లాడాననీ, కొత్తగూడెంలో హంగ్‌ వచ్చిందనీ, తాము మద్దతిస్తామని హామీ ఇచ్చానని వివరించారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీని ఎండగడతామనీ, వాటిని నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. బీఆర్‌ఎస్‌కు మంచి భవిష్యత్తు ఉంన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పారు. కాంగ్రెస్‌ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని అన్నారు.

హైదరాబాద్‌ కార్పొరేషన్‌గానీ, మిగతా వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు గానీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు గానీ ఇదే ఉత్సాహంతో ముందుకు పోతామని చెప్పారు. తానే రాజు తానే మంత్రి అనుకున్న వాళ్లను ఎంతో మందిని చూశామని అన్నారు. పిచ్చి తుగ్లక్‌లు చాలా మంది ఉంటారనీ, అలాంటి వారు వస్తుంటారు, పోతుంటారనీ, ఎవరూ శాశ్వతం కాదన్నారు. ఈ దేశం చాలా గొప్పదనీ, ప్రజల చైతన్యాన్ని ఎవరైనా తక్కువ అంచనా వేయొద్దని కోరారు. రేవంత్‌రెడ్డికి పాలన మీద నమ్మకముంటే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రాకేశ్‌, బాలరాజు యాదవ్‌, బొమ్మెర రామూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -