హిట్లర్ అనేవాడు ఒకప్పుడు జర్మనీలోనే ఉండే! కార్ల్‌మార్క్స్ అనే తత్వవేత్త కూడా అక్కడే ఉండే. వీళ్లిద్దరూ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆలోచనల్లో ప్రపంచ మంతా ఉన్నారు. కాకుంటే మంచిపని కంటే కాస్తా చెడ్డపనికే ప్రచారం ఎక్కువ. అది లోకం తీరని సరిపెట్టుకుందాం. ప్రచార సాధనాల నిండా హిట్లర్ అనబడే పేరు మార్మోగిపోతుంటే, ఈయన రూపం ఈ తరానికి ఎక్కడ చూపించాలి. ఈ తరం హిట్లర్లు మాస్క్ తగిలించుకొని ఉంటారు. ఆ మాస్క్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, మరి కాస్తా పైకెళితే ప్రధాని మోడీ కావచ్చును, ఇంకాస్తా పైకెళితే ప్రపంచ పోలీసు బాస్ ట్రంప్ కావచ్చును. వెనక్కు వెళితే కేసీఆర్,జగన్, దీదీ, కేజ్రీవాల్ ఎవరైనా కావచ్చును.మాస్క్ తొలగిస్తే కనపడే అంతర్ముఖం అధికారం. అది ముదిరితే అహంకారం, మరింత ముదిరితే దురహంకారం. అధికారం, దానిచుట్టూ పేరుకుపోయిన దురహంకారమే హిట్లర్. హిట్లర్ అనబడే పదం మానవరూపంతో పోల్చుకునే పదం కానేకాదు. ఇప్పుడు అది నియంతలకు, నియంత్రృత్వానికి పర్యాయపదం.
ప్రజాస్వామ్యం పక్కనే నియంతృత్వం అనబడే వ్యతిరేక పదం ఉంటుంది.ఈ రెండుపదాలు అధికారం చుట్టూ పరిభ్రమించే కీలకమైన అర్థన్నిచ్చే అసాధారణ పదాలే. కాకుంటే ఇవి పదాలేకాదు చారిత్రికంగా పేరుకుపోయి స్థిరపడ్డ భావనలు. ఇప్పుడు ఇది అధికారానికి అటూ, ఇటూ బొమ్మ బొరుసు, లేదా చిత్తు బొత్తు! అధికారం అనబడే లక్మణరేఖకు ఆవతలవైపు ప్రజాస్వామ్యం ఉంటే, ఇవతల వైపు నియంతృత్వం ఉంటుంది. అంటే నేతలు ఓటేయించుకునే వరకు ప్రజా స్వామ్య వాదులు గానే ఉంటారు. అధికారంలోకి వచ్చి పీఠాలు ఎక్కిన తర్వాతనే నియంతలుగా మారతారు. మనిషిని త్వరగా నియంతగా మార్చగల ముఖ్యమైన సాధనం రాజ్యాంగ యంత్రం. దాని పాలనా కేంద్రీ కరణ అభిముఖం! అక్కడేకొత్త మాస్క్ ముఖానికి తగిలించుకుని అధికారం అనే భావన మనిషిని ‘హిట్లర్’ రూపానికి దగ్గరగా తీసుకెళుతుంది. అధికారం ఎప్పుడూ దాన్ని అనుభవించే వారికి దాహం లాంటిది, అది ఎంతకీ తీరేది కాదు? అది తనకే శాశ్వతం కావాలని ఎప్పటికప్పుడు కోరుకుం టుంది. దానిరుచి,వాసన వేరు.అందుకు ఎన్ని అష్టవంకర్లయినా అది తిరుగుతుంది. అధికారంలో ఉన్న ఎవరైనా, ఎంతగొప్పవారైనా ఏదో ఒక సందర్భం, ఎప్పుడో ఒకసారి వారితో అధికారం అనబడే మాస్క్ లోపల హిట్లర్ ముఖం కనిపిస్తుంది.
ప్రజాస్వామ్య వాదులు కాస్తా అధికారం రుచితో హిట్లర్లు అవుతారు. ఇదే ఇప్పుడు రాజకీయాల్లో సాధారణ సూత్రీకరణ. అంటే అధికారానికి ఈవల కనిపించే ముఖం ఏదైనా ఒక నిర్ణయం రూపం కావచ్చును, పూర్తి పాలనా స్వరూపం కావచ్చును. అది హిట్లర్ రూపమే! కాకుంటే తరతమ స్థాయిలే వేరు. అందులోనూ పోల్చుకునే సందర్భాన్ని బట్టి. అయితే హిట్లర్ చర్చ ఇప్పుడెందుకు వచ్చిందని కదా మీ ప్రశ్న. ఇటీవల ఓ పాత్రికేయుడితో జరిగిన ఇంటర్యూలో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోకుండా తనలో ఉన్న “హిట్లర్”అనబడే ముఖాన్ని బయట పెట్టుకున్నారు. తనకిష్టమైన ‘‘హైడ్రా” అనబడే పదం ఒక నాటి జర్మనీ నియంత హిట్లర్ అనబడే వ్యక్తి కూల్చివేత డిక్షనరీ లోంచి అరువు తెచ్చామని ప్రకటించారు.ఆయన చెప్పడంలో బోళాతనం, నిజాయితీని ఎవరూ శంఖించాలసిన పనిలేదు. కాకుంటే హిట్లర్ అంటే నాకిష్టం అని పరోక్షంగా అనడం, హిట్లర్ హిస్టరీ గురించి లోతుగా అధ్యయనం లేకపోవడం రేవంత్ రెడ్డిలో బయటపడ్డ జ్ఞాన సంకుచితం తప్ప మరొకటి కాదు.
రేవంత్ రెడ్డి తెలంగాణాలో అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిలో వేసిన పాలనా ముద్ర లేదా ఓ సరికొత్త వ్యవస్థాగత నిర్మాణం “హైడ్రా” ఏర్పాటు. దాని ఉద్దేశ్యం మంచిదే కావచ్చును. నాళాలు, చెరువుల ఆక్రమణలు తొలగింపు, అన్యోపదేశంగా అక్రమ నిర్మాణాలు తొలగింపు… ఈ అనధికార కట్టడాలు అనే పదానికి పునాదులు వేసింది, అనుమతు లిచ్చింది గత పాలకులే! అంటే అది కేసీఆర్, వైఎస్సార్, చంద్రబాబు మరెవరైనా కావచ్చును.లేదా వారి పాలనలో అధికారులైనా కావచ్చును. వీరంతా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏదో ఒక స్థాయిలో ఆదర్శ ప్రాయులు, ప్రీతిపాత్రులు,అనుసరణీయులే! కనుక ఆక్రమణ క్రమాన్ని అనుమతించిన వారు కనుకనే అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇన్నేండ్ల తర్వాత అధికారం తిరిగొచ్చి అది అక్రమం ఇల్లు కూలగొడతా, బుల్డోజర్ నడుపుతా అంటే అధికా రాల నడుమ గూడు, కూడు, నీడ కోల్పోయే సామాన్య ప్రజలకు పాలకులు ‘హిట్లర్’ లాగానే కాదు, ఆయన అయ్య లాగానే కనిపిస్తారు. అందులో మినహాయింపు లేదు. ముఖ్యమంత్రి హైడ్రా ఏర్పాటు విషయంలో మంచి,చెడు రెండు అంశాలు దానిలో మిళితమై ఉండొచ్చును. కానీ పాలకులు, ప్రజల్ని చూసే వైఖరిలోనే భిన్నత్వం కనబడుతుంది. రేవంత్ రెడ్డి చాలాసార్లు చాలా బోలాగా మాట్లాడుతారు.
అనుభవరాహిత్యమా? లేక ఉద్దేశపూర్వకమా? అనేది పక్కన పెడితే, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కార్మిక నాయకుడు టంగుటూరి అంజయ్య తర్వాత, ఆ స్థాయిలో ఓ ముఖ్యమంత్రి మాటలపై చర్చ జరిగింది మాత్రం ఇప్పటి రేవంత్ మాటలకు మాత్రమే! ఇప్పుడే కాదు, ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదోఒక మాట తూలుతూనే ఉన్నారు. చర్చలో భాగమవుతూనే ఉన్నారు. కీలకమైన స్థానంలో ఉన్న వారినే కాదు,వారి మాటలనీ సమా జం పరిశీలనలో ఉంచుకుంటుంది. అందులో మినహాయింపు లేదు. అదే సందర్భంగా ‘డిమాలిటైజేషన్’అనే పదానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పోలిక కూడా అర్థరహితం అయినది. హైద్రాబాద్ హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ విధ్వంసంతో పోల్చి చూడమనడం కచ్చితంగా అనుభవరాహిత్యం, జ్ఞాన రాహిత్యం కిందకే వస్తుంది. విచక్షణ తో కూడిన ఒక పాలనా చర్యను, పరస్పర విచక్షణ కోల్పోయి చేసుకునే ప్రతీకార దాడులు, విధ్వంస చర్యను ఒకే విధంగా పోల్చడం ఎంతమాత్రం సరైనది కాదు.
ఉన్నత అధికార స్థానంలో ఉన్న వారు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సభల్లో మాట్లాడినా, ప్రతి పక్షాలపై విమర్శలు చేసినా ఆయనకు ఆయనే జవాబు దారీ? కానీ, ఒక రాష్ట్ర పరిపాలకుడిగా ఉన్నతమైన స్థానం నుండి మాట్లాడే మాటకు కొంత సార్వజనీనత అవసరం. ఔన్నత్యం ఉండితీరాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని వ్యక్తిగా కాకుండా సభ్యసమాజం తెలంగాణా ముఖ్యమంత్రి అనే భావన నుంచి చూస్తుంది, అదేస్థాయిలో అంచనా వేస్తుంది. కనుక ఆస్థానంలో ఎవరున్నా,చేతలే కాదు! మాటల పట్టింపు సహజంగా ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి మాట ముక్కోటి తెలంగాణా ప్రజల అధికార వాణి. ఆయన మాటలో సౌశీల్యం, అణుకువ, నిజాయితీ కనపడినప్పుడే అది తెలంగాణా సౌశీల్యత, సంపూర్ణత నింపుకుం టుంది. కనుక రేవంత్ రెడ్డినే కాదు పాలకులు ఎవరికైనా మెలుకువతో కూడిన అణుకువ నూటికి నూరు శాతం అవశ్యకమే! సందేహం ఉండాల్సిన అవసరమే లేదు, రాదు.
ఎన్.తిర్మల్, 9441864514



