నవతెలంగాణ-హైదరాబాద్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్‌మెంట్ పోస్ట్ చేశాడు. 35 ఏళ్ల విలియమ్సన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్.. తన కెరీర్‌లో 378 మ్యాచ్‌లు ఆడి 19,346 పరుగులు సాధించాడు. 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2021లో భారత జట్టును ఓడించి తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్‌ను కివీస్‌కు అందించాడు. అలాగే రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు సెమీ ఫైనల్స్‌కు జట్టును నడిపించాడు.
‘రిటైర్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో విలియమ్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ నిర్ణయం గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. అయితే ఇదే సరైన సమయమని నాకు అనిపించింది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నాకెప్పుడూ గర్వకారణం. ప్రతి మ్యాచ్‌లో నా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాను. ఈ జట్టుతో నా అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇన్నేళ్లు ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం’ అని విలియమ్సన్ వెల్లడించాడు.


