– ముగ్గురు మంత్రులు ముఖ్యమే..
– అయినా పొంగులేటి వైపే మొగ్గు
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. తాను విద్యావంతుడిగా, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేస్తున్నానని తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేటలోని కాసాని పద్మశేఖర్ గార్డెన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు, అశ్వారావుపేట పీఏసీఎస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, డీసీసీ సభ్యులు తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త అనే తేడాలు లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురూ తనకు సమానంగా ముఖ్యులేనని పేర్కొన్నారు. అయితే తన రాజకీయ ప్రస్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారని, ఎమ్మెల్యేగా గెలవడంలో ఆయన అండదండలు ఉన్నాయని పేర్కొంటూ పొంగులేటి వైపే తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు.
తన రాజకీయ ఎదుగుదలలో విలేకరుల సహకారాన్ని ఎన్నటికీ మరవలేనని ఎమ్మెల్యే తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సంక్షేమ నిధి కోసం రూ.1 లక్ష కార్పస్ ఫండ్‌ను అందజేశారు.



