నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంలోని సుంకాల నిబంధనలపై ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం భారతదేశ పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారులపై ప్రతికూల ప్రభావం చూపుతందని ఆయన అన్నారు. అమెరికాతో బంగ్లాదేశ్, భారత్ రెండు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరి బంగ్లాదేశ్‌కు సున్నాశాతం సుంకాలు, భారత్‌కి 18 శాతం సుంకాలేంటని రాహుల్ ఎక్స్ పోస్టులో మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాగా, రాహుల్ శనివారం ఎక్స్ పోస్టులో ’18 శాతం టారిఫ్ వర్సెస్ జీరో (సున్నా) శాతం.. పన్నుల విషయంలో అబద్ధాలు చెప్పడంలో నిపుణుడైన ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గం ఈ అంశంపై ఎలా గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారో నేను వివరిస్తాను. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశ పత్తి రైతులను, వస్త్ర ఎగుమతిదారులను ఎలా మోసం చేస్తున్నారో చెబుతాను. అమెరికాకు చేసే వస్త్ర ఎగుమతులపై బంగ్లాదేశ్‌కు సున్నా శాతం సుంకాలే విధించడం జరుగుతుంది. బంగ్లాదేశ్ అమెరికాకు కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఈ సుంకాల విషయంలో బంగ్లాకు ప్రయోజనం కలిగింది. కానీ ఈ ఒప్పందంలో ఒక్కటే నిబంధన ఏమిటంటే.. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవాలి. భారతీయ వస్త్రాలపై 18 శాతం సుంకం ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్‌కు ఇస్తున్న ప్రత్యేక రాయితీ గురించి నేను పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తినప్పుడు..
మోడీ ప్రభుత్వంలోని ఒక మంత్రి సమాధానం ఈవిధంగా ఇచ్చారు. ‘మనం కూడా అదే ప్రయోజనం కోరుకుంటే.. మనం అమెరికా నుండి పత్తిని దిగుమతి చేసుకోవాలి’ అని అన్నారు. మరి ఈ విషయాన్ని ఇప్పటివరకు దేశం ముందు ఎందుకు దాచారు? అని రాహుల్ ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందం వల్ల లక్షలాది మందిని నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులవైపు నెట్టేస్తుందని రాహుల్ అన్నారు.
ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికాతో కేంద్రం జరిపిన చర్చలపైనా రాహుల్ విమర్శించారు. ఇది ఎలాంటి విధానం? ఇది ఏరకమైన ఎంపిక. ముందు గొయ్యి.. వెనుక నుయ్యి మాదిరిగా రూపొందించిన ఉచ్చునా? అమెరికా పత్తిని దిగుమతి చేసుకుంటే..? మన దేశ రైతులు నాశనం అవుతారు. మనం అమెరికా పత్తిని దిగుమతి చేసుకోకూడదు. దిగుమతి చేసుకుంటే మన వస్త్ర పరిశ్రమ వెనుకబడి నాశనం అవుతుంది. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల భారత్ నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం ఆపివేసే సంకేతాల్ని బంగ్లాదేశ్ ఇస్తుంది అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
భారతదేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి వ్యవసాయం జీవనోపాధికి వెన్నెమక. ఈ రంగాలపై ఆధారపడడం వల్లే కోట్లాది మంది ప్రజల ఆకలి తీరుతుంది. ఈ రంగాలపై దాడి చేయడమంటే.. లక్షలాది కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఆలోచించే దార్శనిక ప్రభుత్వమైతే.. పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారులు శ్రేయస్సును రక్షించి ఒప్పందాన్ని కుదుర్చుకునేది. కానీ మోడీ ప్రభుత్వం అలా లేదు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంది. నరేంద్రమోడీ అమెరికాకు లొంగిపోయాడు. మోడీ, అతని మంత్రులు పత్తి, వస్త్ర రంగాలకు తీవ్ర నష్టం కలిగించే ఒప్పందం కుదుర్చుకున్నారు అని రాహుల్ ఎక్స్ పోస్టులో తీవ్రస్థాయిలో ఆరోపించారు.



