Monday, April 20, 2026
E-PAPER
Homeక్రైమ్బతుకులు బుగ్గి

బతుకులు బుగ్గి

- Advertisement -

తమిళనాడులో బాణసంచా పేలుడు
22 మంది కార్మికులు మృతి
రాష్ట్రపతి ముర్ము ప్రభృతుల దిగ్భ్రాంతి
చెన్నై :
తమిళనాడులో విరుద్‌ నగర్‌ సమీపంలోని కట్టనార్‌పట్టిలో ఉన్న ఒక ప్రయివేటు బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 22 మంది కార్మికులు కోల్పయారు. శరీరాలు గుర్తుపట్టలేనంతగా బుగ్గి అయ్యాయి. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు 10 కిమీ దూరం వరకు ప్రకంపనలు విస్తరించాయి. పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి బాణసంచా తయారీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు పరిసరాలు కంపించిపోయాయి. సమీప ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ పెను విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడం తమను ఎంతో కలచివేసిందని ముర్ము పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఆమె తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాణాసంచా పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని స్టాలిన్‌ పేర్కొన్నారు. మతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి, బాధిత కుటుంబాలను ఓదార్చడానికి మంత్రులు కెకెఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ను, తంగం తెన్నరసును వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆయన ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.

స్థానికులు, ప్రభుత్వ అధికారుల కథనం ప్రకారం..తమిళనాడు విరుదునగర్‌ జిల్లా కాటునార్‌పట్టిలో ముత్తుమాణికంకు చెందిన ‘వనజ ఫైర్‌క్రాకర్‌’ ఫ్యాక్టరీ ఉంది. దీనికి ప్రభుత్వ అనుమతి ఉంది. ఈ కర్మాగారంలోని 10కి పైగా గదులు ఉన్నాయి. వాటిలో సుమారు 30 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, ఫ్యాక్టరీ ముందు భాగంలోని వరాండాలో బాణసంచా తయారీ, ముడి పదార్థాల నిర్వహణ పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే ముడి పదార్థాలు ఒకదానికొకటి రాపిడికి గురై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీనితో క్షణాల వ్యవధిలోనే మంటలు ఫ్యాక్టరీ అంతటా వేగంగా వ్యాపించి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలతో విరుదునగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీనివల్ల మతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, సహాయక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితమే విరుదునగర్‌ సమీపంలోని వెంబకోట్టై ప్రాంతంలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో నలుగురు మరణించారు. మళ్లీ అదే జిల్లాలో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరగడం స్థానిక ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, భయాందోళనలను కలిగిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -