తేలిగ్గా తీసుకోవద్దు..ప్రమాదంలో దేశం
16.5 కోట్ల ఓట్లను తొలగించే కుట్ర
ఏటా ఎస్.ఎస్.ఆర్. చేస్తుండగా మళ్లీ సర్ ఎందుకు?
ఈసీఐకి తన పనిపై తనకు నమ్మకం లేదా?
సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలడిగితే సమాధానాలు కరువు
గ్రామసభ పెట్టి ఓటర్ లిస్టు తయారు చేయాలి
తెలంగాణలో సర్ కు ముందే రాష్ట్ర ఎన్నికల సంఘంతోనూ వివరాలు సేకరించాలి : రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్
రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సర్‌పై అవగాహన సదస్సు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రక్తపాతం లేని నరమేధమే సర్ అని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో సర్ని తేలిగ్గా తీసుకోవద్దని ప్రజలకు, రాజకీయ నాయకులకు సూచించారు. భారత ఎన్నికల సంఘానికి పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారమే లేదనీ, సర్‌కు వ్యతిరేకంగా ప్రజలందరూ తిరగబడాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యం లో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జి.విద్యాసాగర్ అధ్యక్షతన తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలు(సర్)పై అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డీజీ.నర్సింహారావు, ఉమామ హేశ్వర్రావు, డీఏఎస్‌వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా అక్టోబర్ – జనవరి మధ్యలో ఎస్ఎస్ఆర్ జరుగుతుందనీ, మళ్లీ సర్ ఎందుకని ప్రశ్నించారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో అవకతవకలు జరుగుతున్నాయనీ ఈసీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీకి తన పనిపై తనకు నమ్మకం లేకపోతే ఎట్లా అని నిలదీశారు. ఎస్‌ఎస్‌ఆర్‌లో జరుగుతున్న లోపాలేంటి? అవకతవకలు జరిగినట్టు ఆధారాలేవి? అసలు మీరు ఏం అధ్యయనం చేసి సర్‌ను తీసుకొస్తున్నారు? అని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నిస్తే ఈసీ వద్ద సమాధానాలే లేవని విమర్శించారు. సర్ ప్రక్రియను చేపట్టాలని ఎక్కడ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తే దానికీ ఈసీ వద్ద సమాధానం లేదని ఎత్తిచూపారు. సర్‌ను కొత్తగా చేయట్లేదనీ, 2002లో కూడా చేశామని ఈసీ బుకాయించడాన్ని తప్పుబట్టారు. 2002లో జరిగినప్పుడు సాధారణంగానే వివరాలు సేకరించారనీ, ఇన్ని డాక్యుమెంట్లు అడగలేదని గుర్తుచేశారు.
సర్ పేరిట బీహార్‌లో 63 లక్షల ఓటర్లను తొలగించామని ఈసీ చెబుతుందన్నారు. ఎవరివి తొలగించారనే దానిపై ఈసీ స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. పదేపదే ప్రశ్నిస్తూ, కోర్టులను ఆశ్రయించినా ఈసీ దానిపై మాట్లాడటం లేదనీ, ఈసీ మాట్లాడటం మానేసిందని విమర్శించారు. వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీం కోర్టు మెట్టికాయలు వేస్తే అతి తెలివితో బూతుల వారీగా లిస్టు పెట్టారని తెలిపారు. రిస్కు అయినప్పటికీ బూతులవారీగా తాము వివరాలు సేకరించగా..ఆ లిస్టులో చొరబాటుదారులు అని ఎక్కడా లేదన్నారు. తొలగించిన జాబితాల్లో చాలా మంది బతికే ఉన్నారని తెలిపారు. వలసెళ్లడం, ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం, చనిపోవడం, డిలీట్ (ఎస్ఏడీడీ) అనే కాలమ్స్ ఉన్నాయిగానీ, చొరబాటుదారులు అనే కాలమే లేదని ఎత్తిచూపారు. అక్రమంగా ఉన్న విదేశీయుల ఓట్లను తొలగించేందుకు సర్ అని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నదిగా..మరి ఆ కాలం ఎందుకు లేదు అని నిలదీశారు. తాము శాంపిల్‌గా మూడు నియోజకవర్గాల్లో సర్వే చేస్తే ఫేక్ అడ్రస్‌ల పేరుతో 80 వేల ఓట్లు కొత్తగా చేర్చారని తేలిందన్నారు.
ఒకే ఇంట్లో 509 ఓట్లు కొత్తగా నమోదు చేశారనీ, అందులో అన్ని కులాలు, ప్రాంతాల వారు ఉన్నట్టు గుర్తించామనీ, 9 ఇండ్లలో వంద ఓట్ల చొప్పున ఉన్నారనీ, అదెలా సాధ్యమని అడిగారు. వారంతా కొత్తగా నమోదు చేసిన ఓటర్లు అని విమర్శించారు. ఇలా ఫేక్ అడ్రస్‌ల పేరుతో ఉన్న 1.32 కోట్ల ఓట్లను తాము గుర్తించామనీ, అలాంటప్పుడు సర్ సమర్ధవంతమైన ప్రక్రియ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో 97 లక్షల ఓట్లను తొలగించారనీ, అందులో 40 లక్షల మందికిపైగా చనిపోయారని తేల్చారని తెలిపారు. ఒక రాష్ట్ర అడల్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉండి ఓటర్ల సంఖ్య ఎలా తక్కువగా ఉంటుందని ప్రశ్నించారు. బీహార్‌లో అడల్ట్ పాపులేషన్ 8.22 కోట్లుగా ఉండగా..ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు ఉందనీ, 80 లక్షలు తేడా ఉందనీ, అందులో మళ్లీ కొత్తగా 20 లక్షల ఓట్లను యాడ్ చేశారనీ, ఇదంతా రాజకీయ లబ్ది కోసం చేస్తున్నట్టుగా ఉందని స్పష్టమవు తుందన్నారు. బెంగాల్లో తాము చనిపోలేదనీ, బతికే ఉన్నామనీ, అంతకుముందు ఎన్నికల్లో ఓటు వేశామనీ బూతు అధికారిపై దాడి చేశారని గుర్తుచేశారు. తమ ఓట్లను ఎలా తీసేస్తారనీ ప్రశ్నిస్తూ రోడ్లు ఎక్కుతున్నారని వివరించారు. ఆర్థిక వేత్తగా గుర్తింపు పొందిన అమర్త్యసేన్ కూడా తనకు తాను నిరూపించుకోవాల్సిన దుస్థితి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళలో 24 లక్షలు, గుజరాత్లో 75 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 45 లక్షలు, ఛత్తీస్‌గడ్‌లో 28 లక్షలు, రాజస్థాన్‌లో 44 లక్షలు, గోవాలో 1.5 లక్షలు, పాండిచ్చేరిలో 1.19 లక్షలు, అండమాన్ నికోబార్ దీవుల్లో 60 వేల ఓట్లను తొలగించారని వివరించారు. ఇప్పటివరకూ దేశంలో సర్ పేరిట 6.5 కోట్ల ఓట్లను తొలగించారనీ, 16.5 కోట్ల ఓట్లను ఏరివేయాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. తీసేసిన ఓటర్ల జాబితాలో ఎక్కువగా మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, ఆడవాళ్లు, నిరక్షరాస్యులున్నారని చెప్పారు. పౌరసత్వం సమస్య ప్రధానంగా అస్సాంలో ఉందనీ, అక్కడ సర్ ఎందుకు చేపట్టలేదని ఈసీని ప్రశ్నించారు. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత మన దేశంలో ఓటు ఉన్న భారతీయులు ప్రథమ శ్రేణి పౌరులుగా, ఓటు లేని భారతీయులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చలామణి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు లేనప్పుడు రాజకీయ నాయకులు మన దగ్గరకు వస్తారా? సంక్షేమ పథకాలు అందిస్తారా? అని ప్రశ్నించారు. ఓటరుగా ఎవరు ఉండాలనేది అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరసత్వాన్ని చంపే ప్రక్రియను సర్ ద్వారా మొదలుపెట్టారనీ, ఓటు లేకుంటే జీవచ్ఛవంలా బతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉదాసీనతతో ఉండటం సరిగాదనీ, సర్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సర్ చేపట్టే ముందే రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా ఓటర్ లిస్టును తయారు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా చేర్చే ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు గ్రామసభ పెట్టి అందులో ఓటర్లలిస్టును ఫైనల్ చేయాలని ఈసీ నిబంధనల్లోనే ఉందనీ, తెలంగాణలో గ్రామ సభల ద్వారా అది చేయించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రోడ్లమీదకు రావాల్సిందేనన్నారు. బెంగాల్లో తొలగించ బడిన ఓటర్లు తమ ఓట్లను తిరిగి చేర్చాలని ట్రిబ్యునళ్లను ఆశ్రయిస్తున్నారనీ, ఈ నెల 21 నాటికి మహా అంటే కనీసం 50, 60 వేల ఓటర్లకు అవకాశం కల్పిస్తారేమో చూడాలని అన్నారు.
సర్ రక్తపాతం లేని నరమేధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



