– ప్రాంగణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ఆలయంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పనుల పరిశీలన
– అధికారులతో సమీక్ష
నవతెలంగాణ – ములుగు
మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనుల్లో వేగం పెంచాలని, ఆలయ ప్రాంగణాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను ఆదివారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
అనంతరం మేడారం హరిత హోటల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఆ తర్వాత పనులకు సంబంధించి మంత్రి పొంగులేటి పలు సూచనలు చేశారు. సారలమ్మ పూజారుల కోరిక మేరకు లైన్ పక్కనే ప్రత్యేకంగా సారలమ్మ ప్రధాన ఆర్చీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని సూచించారు. గుడికి సంబంధించిన రాతి నిర్మాణాల్లో చిన్న ఖాళీలు కూడా లేకుండా అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలని, గద్దెల రైలింగ్, ఆలయ డ్రైనేజీలలో ఎక్కడా చుక్క నీరు నిలవకుండా చూడాలని చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రధాన రహదారి డ్రైనేజీకి లింక్ చేసే పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఫేజ్-2లో పనుల్లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి, మల్లూరు దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు చెప్పారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనులలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే విధంగా ఆలయ ప్రాంగణం ఉండాలన్నారు.
నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణంలో మిగిలిన చివరి దశ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేసినట్టు తెలిపారు. స్థానిక పూజారి కుటుంబానికి చెందిన బాలుడికి దురవృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూశారని, వైద్య ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించిందని స్పష్టం చేశారు. భవిష్యత్లో బాలుడికి, కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, మెరుగైన టెక్నాలజీ ద్వారా కృత్రిమ కాలును ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం మండలంలోని నార్లపూర్ గ్రామంలో ఆవుల లక్ష్మి – రాజు దంపతుల ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, మేడారం సర్పంచ్ పాల్గొన్నారు.



