2013 చట్టానికి తిలోదకాలు
2016 చట్టం ప్రకారమే భూసేకరణ
గత ప్రభుత్వ బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం
గతంలో కేంద్రంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టానికి తూట్లేనా?
రైతులు ఆగం.. పారిశ్రామికవేత్తలకు లాభం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
భూసేకరణ ప్రజాప్రయోజనాల ప్రాతిపదికన చేపట్టాలి. ప్రయివేటు కంపెనీలు, పారిశ్రామిక వేత్తల అవసరాలు ప్రజా ప్రయో జనం కాదు. కానీ 2013 చట్టం ద్వారా భూ సేకరణ అసాధ్యమని భావించిన గత ప్రభుత్వం దాన్ని సవరించి, 2016 భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది 2017 నుంచి అమలు చేసింది. దీన్ని వ్యతిరేకించిన నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, నేడు అధికారంలోకి వచ్చాక అదే చట్టాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వాల ద్వంద్వ వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
భూ యాజమాన్యాలను భాగస్వామ్యం చేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ మేరకు భూ సేకరణ ఉండాలన్న ఉద్దేశంతో నాటి యూపీఏ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని తీసు కొచ్చింది. అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ కాలం నాటి 1894 భూ సేకరణ చట్టాన్ని సవరిస్తూ.. 2013 చట్టాన్ని తీసు కొచ్చింది. 2013 భూ సేకరణ చట్టంలో రైతుల నుంచి భూములు సేకరించే క్రమంలో.. రైతులు ఆమోదం లేనిది భూసేకరణ కుదరదు. సేకరిం చిన భూమి విని యోగంలో లేకపోతే తిరిగి రైతులకు ఇచ్చేలా ఈ చట్టంలో పొందు పరిచారు. భూ సేకరణకు ముందు ఆ భూముల విలువలను పెంచాల్సి ఉంది. పెంచిన ధరకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలి. భూ యాజమాన్యులకు మాత్రమే పరిహారం కాకుండా ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు కూడా పరిహా రం ఇవ్వాలని 2013 చట్టం చెబు తున్నది. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2013 చట్టాన్ని సవరణ చేస్తూ 2016 చట్టాన్ని తీసు కొచ్చింది. ఈ చట్టం అమలుతో రైతుల హక్కు లు పూర్తిగా హరించబడ్డాయి. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై సీపీఐ(ఎం) పాదయాత్రలు, నిరసనలు చేపట్టింది. నిర్వాస తులకు అండగా నిలిచింది. 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని పోరాడింది.
అయితే తాము అధికారంలోకి వస్తే.. 2016 చట్టాన్ని రద్దు చేసి, 2013 చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తు న్నప్పటికీ 2016 భూసేకరణ చట్టమే అమలులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాలు సేకరిస్తోంది. ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సుమారు 50 వేల ఎకరాల భూ సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటి వరకు సుమారు 25 వేల ఎకరాలు సేకరించింది. గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పలు ఒప్పందాలు చేసుకున్న కంపెనీలకు ఈ ప్రాంతా ల్లో భూములు ఇచ్చేందుకు టీజీఐసీసీ నేతృత్వం లో వేలాది ఎకరాలు సేకరించింది. ఇటీవల గ్రీన్ఫీల్డ్ రోడ్డు, చేవెళ్ల మండలం అలూరులో ఇండిస్టియల్ కారిడార్ భూ సేకరణ కోసం 2016 భూ సేకరణ చట్టం ప్రకారం ఫారమ్(సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక్కటే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన భూ సేకరణ మొత్తం 2016 భూసేకరణ చట్టం ప్రకారమే సాగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల ఆమోదం లేకుండానే భూములు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తున్నాయి.
2016 చట్టంతో రైతులకు నష్టం..
2016 భూ సేకరణ చట్టంలో భూముల మార్కెట్ ధరను సవరించే పరిస్థితి లేదు. 2013 చట్టం ప్రకారం పంట భూములను తీసుకోవద్దు.. కానీ 2016 చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ప్రాజెక్టుల కోసం సారవంతమైన భూములను కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. దాంతోపాటు కేవలం యాజమానికే పరిహారం వర్తిస్తుంది. భూసేకరణ క్రమంలో ఊరిలో పర్యావరణ సమతుల్యత ప్రమాదం ఉంటే ఆ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలి. భూములు కోల్పోతున్న వారికి మాత్రమే పరిహారం కాకుండా.. ఇల్లు, భూమి, ఇలా పునరావాసం కింద ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసిన చట్టం ప్రకారం ఒకేసారి డబ్బులు ఇస్తే సరిపోతోంది. భూ సేకరణలో నాటి బ్రిటిషు కాలం నాటి 1894 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరావృతం చేస్తోంది. ఇలా కాకుండా 2013 చట్టాన్ని అమలు చేసి, తమకు న్యాయం చేయాలని భూ బాధిత రైతులు కోరుతున్నారు.



