– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
– సిద్దిపేటలో సిధారెడ్డికి సన్మానం
నవతెలంగాణ-సిద్దిపేట
తెలంగాణ సాహిత్య రంగ అభివృద్ధికి నందిని సిధారెడ్డి ఎనలేని కృషి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నందిని సిధారెడ్డికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పురస్కారం, 300 గజాల స్థలాన్ని తిరస్కరించారని, తెలంగాణ తల్లి అస్తిత్వం ముఖ్యమని చెప్పారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిధారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఉద్యమకారులను, కవులు, కళాకారులను ఉద్యమం వైపు మళ్లించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఊపిరి పోశాయన్నారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలంగాణతోపాటు సిద్దిపేట ప్రాంతానికి దక్కిన గౌరవమన్నారు. ఆస్తుల కంటే స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించి నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్యం కోసం పనిచేశారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయి పదవి ఇస్తానంటే తీసుకోకుండా.. సాహిత్య రంగంలో జరగాల్సింది ఇంకా చాలా ఉంది, సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి తనకు బాధ్యతలు ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. దీంతో కేసీఆర్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి సిధారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో.. తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో ఎంతో అద్భుతంగా నిర్వహించారన్నారు. ఆయన పొగడ్తలు, సన్మానాలకు దూరంగా ఉంటూ సాహిత్యం, ప్రజల కోసం ఎంతో పని చేశారన్నారు.
రానున్న రోజుల్లో బందరం, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు తీసుకొస్తామని హరీశ్‌రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీయూడబ్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, వివిధ సంఘాల ప్రతినిధులు దేవి ప్రసాద్, కె.అంజయ్య, కల్వకుంట్ల రంగచారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు కడవేరుగు రాజానర్సు, వేలేటి రాధాకృష్ణ శర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గ్యాదరి పరమేశ్వర్, పాప్పయ్య గౌడ్, విక్రాంరెడ్డి, శ్రీహరి యాదవ్, సాహితీ మిత్రులు, పౌర, ప్రజా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సాహిత్యరంగ అభివృద్ధికి సిధారెడ్డి కృషి ఎనలేనిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



