Sunday, June 14, 2026
E-PAPER
Homeసోపతిధర్మాగ్రహ సమూహం

ధర్మాగ్రహ సమూహం

- Advertisement -

కేతిగాడు : యువతరం శిరమెత్తితే/ నవతరం గళమెత్తితే/ లోకమే మారిపోదా.. ఈ చీకటే మాసిపోదా. కాక్రోచ్‌ జనతాపార్టీ, అదే బొద్దింకల పార్టీ ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద తన తడాఖా చూపింది. మహాత్మాగాంధీ శాంతియుత సత్యాగ్రహ మార్గంలో కేంద్ర ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేసింది. భగత్‌ సింగ్‌, అంబేద్కర్‌ ఫొటోలు, రాజ్యంగం ప్రతులు, పుస్తకాలు పట్టుకుని ‘నహీ డరేంగి, నహీ డరేంగి’ (భయపడేది లేదు) అంటూ పాటలతో, నినాదాలతో హోరెత్తించడం ప్రజాస్వామ్య వాదులకు ముచ్చట గొల్పింది. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు.
జుట్టుపోలుగాడు : నీవు ఎన్నైనా చెప్పు. నాకు అంతగా నమ్మకం కుదరడం లేదు. ఇల్లు అలకగానే పండుగ కాదు కదా.. అందులోనూ రీల్‌ హీరోలను రియల్‌ హీరోలుగా అస్సలు లెక్కించక్కర్లా. అదంతా ఆన్‌లైన్‌ సోషల్‌ మీడియా బాపతి.

కేతిగాడు : ‘శుభం పలకరా మంకా అంటే పెళ్ళికూతురు ముండెక్కడీ’ అని నీలాంటివాడు ఎవడో అన్నాడట వెనకటికి. అలా ఉంది నీ తంతు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండానే వేల సంఖ్యలో జంతర్‌ మంతర్‌కు వచ్చిన వీళ్ళను గుర్తించక పోతే ఎలా..? ఎస్‌.ఎఫ్‌.ఐ. వంటి విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. వాంగ్‌చుక్‌ వంటి పర్యావరణ వేత్తలు, అనీరాజా వంటి మహిళా నేతలు పాల్గొన్నారు. మరి వారు దేశభక్తులు కాదా..? దేశంలో లక్షలాది మంది యువ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రాధాన్‌ భేషరుతుగా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసారు. పైగా కాంగ్రెస్‌ నేతత్యంలోని 22 పార్టీల ‘ఇండియా కూటమి’ కూడా ఆ డిమాండ్‌ను బలపరిచింది. కాక్రోచ్‌ జనతా పార్టీతో కలసి పనిచేయడం అవశ్యం అని కూడా చర్చించింది
జుట్టుపోలుగాడు : నీలాంటివాడే.. కుడుము ఇస్తే చాలు… పండుగొచ్చేసింది అనుకున్నాడట. పుబ్బలో పుట్టి మఖలో కలసిపోయే పార్టీలను, ఉద్యమాలను ఎన్ని చూళ్లేదు. దేశం అంటే కుర్రోళ్లే కాదుగా. రైతులు, మహిళలు, కార్మికులు, కష్టజీవులు, ఉద్యోగులు… ఇలా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందర్నీ ఆకట్టుకునే ప్రకటనలు ఏమున్నాయి వాళ్ళ దగ్గర. అసలు రాజకీయ పార్టీగా అవతరిస్తారో లేదో అస్సలే తెలియడంలా..

కేతిగాడు : నీతో వచ్చింది అదే గొడవ. అన్నప్రాసన రోజే.. ఆవకాయ కావాలంటే ఎలా…? ఏదో ధర్మాగ్రహ సమూహం. కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు తమ పోరాటం ఆగదని ఆ కాక్రోచ్‌ జనతా పార్టీ నేత అఖజిత్‌ దీప్కే తేల్చి చెప్పాడు. దేశంలో గత పన్నెండేళ్ళుగా రాజకీయాలు కేవలం హిందూ-ముస్లిం ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయని ఆక్షేపించాడు. ప్రభుత్వ విధానాలు మారాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని గట్టిగా డిమాండ్‌ చేశాడు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పుకోసం ఏజెండాను కూడా రూపొందిస్తున్నట్టు చెప్పాడు. రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి ఉన్న ప్రధాని మోడీకి నీట్‌ ఎగ్జామినేషన్‌ పేపర్‌ లీక్‌ను ఆపే శక్తి లేదా అంటూ ఎద్దేవా చేశాడు. జెన్‌ జెడ్‌ యువత ఎవరికీ భయపడబోదని నొక్కి చెప్పాడు. గుర్తుందా..?

జుట్టుపోలుగాడు : అదో వెర్రి ఆవేశం. పోలీసులు తమ అసలు ప్రతాపంతో బొక్కలో తోసి నాలుగు లాఠీ దెబ్బలు తగిలిస్తే అసలోళ్లు ఎవరో.. నకిలీవాళ్ళెవరో ఇట్టే తేలిపోయేది. అయినా జంతర్‌ మంతర్‌ కాడికి వచ్చింది వేలల్లోనే కదా. అదే సోషల్‌ మీడియాలో లక్షలు. అందుకే వీళ్ళని రీల్‌ హీరోలని అంటున్నా.
కేతిగాడు : అవునవును. ఈ వేల సంఖ్యకే భయపడి పోలీసుల్ని కూడా వేల సంఖ్యలో కాపలా పెట్టారు. అదీ ఆయుధాలతో. ఏ చిన్న సాకు దొరికినా పోలీసులు నీవన్నంత పనీచేసేవారే. అయితే వాళ్ళు ఆ చాన్స్‌ ఇవ్వలేదు. ప్రజలు కోరుకునేది కూడా ఈ శాంతియుత నిరసనోద్యమాలే.

బంగారక్క : మీరిలా తగువులాడుకో కూడదు. మనది ప్రజాస్వామ్య దేశం – భిన్నాభిప్రాయాలకు విలువనివ్వాలి. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలి. ఏదేమైనా యువత అరాచకమైన దుర్మార్గ పోకడలకు పోకుండా ఇలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడాన్ని అభినందించాల్సిందే. స్వాగతించాల్సిందే. ఎవరికైనా అచరణే గీటురాయి. భవిష్యత్‌లో కాక్రోజ్‌ జనతాపార్టీ మరింత మెరుగైన నిర్మాణంతో ఎదుగుద్దని ఆశిద్దాం. ఎవర్నైనా మనం వర్తమానంలోనే చూడాలి. గతాన్ని బట్టి కాదు, భవిష్యత్తును బట్టి కాదు. గతంలో మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు చెడిపోవచ్చు. ఇప్పుడు బాగున్నవాళ్ళు రేపు చెడిపోవచ్చు. వాస్తవాల ఆధారంగానే నిర్ణయాలకు రావాలి. కేంద్రం రాజ్యాంగ వ్యవస్థలను, మీడియాను లోబర్చుకుని నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజస్వామ్యంగా వ్యవహరించే ప్రతి చిన్న సమూహాన్ని ప్రజలు ఆదరిస్తారు. అవే బలమైన ప్రజా ఉద్యమాలకు పునాది రాళ్ళుగా నిలుస్తాయి.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -