పెట్టుబడిదారీ వ్యవస్థ, దాని ఉన్నతదశ ఎంత వికృత విన్యాసాలతో కూడుకుని ఉంటుందో, ఎంత అమానవీయంగా వ్యవహరించగలదో, నీచ, ద్రోహ, కుటిల, హీన ఆచరణలకు దోహదం చేస్తుందో ఒక రెండు వందలయేండ్ల క్రితమే కారల్‌మార్క్స్ చెప్పాడు. ఆ విషయాలు చాలా స్పష్టంగా తేటగా ప్రపంచం ముందు కనపడుతున్నాయి. వికృత సాంస్కృతిక విలువకు అద్డం పట్టే సంఘటన వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జేఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్ ఉదంతం, దానిలో దాచిపెట్టబడిన వివరాలు, వ్యాపారం, అధికారం కలిసి చేసే నీతిబాహ్య అమానుష కృత్యాలను బయటపెడుతుంది. మనుషులు, మాటలు, నీతులు, రాతలు, బోధలు, రాజ్యాలు, అధికారము, ప్రజాస్వామ్యము, పరిపాలనలు, సంబంధాలు, సంస్కృతులు, అన్నీ వేటి ఆధా రంగా నిర్మితమవుతున్నాయో, వ్యాపార, లాభాలకాడ ఎలా మోకరిల్లుతున్నాయో తెలియపరుస్తుంది. అధికారం వ్యాపారము కలిసి ఆడిస్తున్న నాటకంలో ఎవరెవరు ఏ పాత్రలో జీవిస్తున్నారో విశదపరచింది.
ఈ సంవత్సరం ఆరంభంలోనే బయటకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్, దేశదేశాల్లోని రాజకుమారులు, దేశాధి నేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు ఎందరెందరివో పేర్లను బయటపెట్టింది. అందులో మన అధికారగణ పెద్దలు, వ్యాపారులూ ఉన్నారు. ప్రపంచంలో ఎలాంటి నీచ సంస్కృతి చలామణిలోకి వస్తున్నదో, డబ్బు, అధికారం కలిసి ఎంత వికృతక్రీడ నడుపుతున్నదో తెలుసుకోవచ్చు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేవాడు అమెరికాలో ఒక ఫైనాన్సియర్‌గా ఎదిగాడు. కరేబియన్ సముద్రంలో అతనికొక పచ్చనిదీవి ఉంది. అది ఏ చట్టమూ, అధికారము లేని అతని స్వేచ్ఛా ప్రపంచం. అక్కడికి ప్రపంచాన్ని శాసించే నాయకులను తీసికెళ్లి, అమ్మాయిలను, చిన్నపిల్లలను వారి లైంగిక అవసరాలకు వినియోగించేవాడు. అమ్మాయిలను చదివిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని దీవిలోకి తీసుకెళ్లి ఈ ఆకృత్యాలకు పాల్పడ్డాడు. సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. విపరీతంగా డబ్బు సంపాదించాడు.
బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్, బార్జ్‌బూష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, టోనిబ్లెయర్, జోబైడెన్, హిల్లరీ, అబ్దుల్లా, అంబానీ ఇలా చాలామంది ఆయన్ను కలిసినవారిలో ఉన్నారు. ట్రంప్ అయితే అనేకసార్లు కలిసాడు. ఆ దీవిలోనూ వివహరించాడు. అయితే ఆ ఐలాండ్‌లో నరకం అనుభవించామని, చిన్నతనంలోనే లైంగిక హింసకు గురయ్యామని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపుల కేసులో 2008లోనే ఎప్‌స్టీన్‌కు జైలుశిక్ష పడింది. శిక్ష అనుభవించాడు.లాబీయింగ్ నడిపి బయటకి వచ్చాడు. తరిగి అదే మహిళల అక్రమరవాణా అభియోగాలు, చిన్నపిల్లలపై లైంగికహింస ఆరోపణలతో కోర్టు జైలుశిక్ష వేసింది. 2019లో అతడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఆత్మహత్యా, హత్యనా అనే విషయమై సందేహాలున్నాయి. అధినేతల రహస్య జీవితాల వివరాలు అతను ఎక్కడ బయటపెడతాడోనని, హతమార్చి ఉండొచ్చని వినపడుతున్నది.అయితే అతను చనిపోయాక విచారించిన అమెరికా న్యాయ విభాగం, అతని సామ్రాజ్యంలో ప్రపంచ అధినేతల, ప్రముఖుల వీడియోలు, మెయిల్స్ వివరాలు వేలాదిగా ఉన్నాయని తెలిసింది.కొన్ని మెయిల్స్‌ను, వీడియోలను బయటపెట్టింది.
వాటిల్లో ట్రంప్, క్లింటన్, యూరోపియన్ నేతల బండారమంతా బయటపడింది. అంతేకాదు, మన ప్రధాని మోడీ గురించి కూడా ఫైల్స్‌లో ఉందని తేలింది. ఇజ్రాయిల్ ప్రధానితో ట్రంప్ గురించి మోడీ పాటలు పాడి, నృత్యం చేశాడని ఎప్‌స్టీన్ పేర్కొన్నాడు. ఈ మాటలను డీకోడ్ చేసుకోవాల్సి ఉంది. ఇక కేంద్ర పెట్రోలియం మంత్రి హరిదీప్‌సింగ్ పూరి ఎప్‌స్టీన్‌తో జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. మంత్రిగారు కలిశానని ఒప్పుకున్నారు. కానీ ఆర్థికాభివృద్ధి గురించి అతనితో చర్చించానని వెల్లడిస్తూ, ఒకరితో వ్యక్తిగతంగా కలవడం తప్పెలా అని, నేరస్తులతో కలిసిన వాళ్లు నేరస్తులయిపోతారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే, ఒక అబద్ధాలకోరు, బ్రోకర్ ఫైల్స్‌లో ఉన్నవాటిని ఎట్లా పరిగణనలోకి తీసుకుంటామని కొట్టి పారేస్తున్నారు.కానీ ఇదే తరహా మెయిల్స్ వచ్చిన యురోపియన్ నేతలు కొందరు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. బ్రిటన్ ప్రధాని అయితే బహిరంగంగానే క్షమాపణలు కోరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎప్‌స్టీన్ ఫైల్స్ మీద చర్చ జరుగుతోంది. మనదేశ కార్పోరేట్ వ్యాపారి అనిల్ అంబానీకి, అమెరికా నుండి ఫేవర్ జరిగేందుకు ఎప్‌స్టీన్ మధ్యవర్తిత్వం వహించినట్టు ఫైల్స్ చూపిస్తున్నాయి.
ఒక బ్రోకర్, ప్రపంచస్థాయి నేరస్తుడు ఫైల్స్ విషయమై ఒక్కరూ పెదవి విప్పడం లేదు. దేశీయ టి.వి. ఛానెళ్లు కథనాలూ ఇవ్వడం లేదు. మీడియా కూడా ప్రజల కాపలాదారరు పాత్ర నుండి అధికార పీఠాల కాపలాదారుగా మారిపోయింది. ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయాన్ని లోక్‌సభలో ప్రస్తావించి ప్రశ్నించినందుకు, ప్రతిపక్ష నాయకున్ని సభకు అనర్హుడు ప్రకటించాలనే ప్రయత్నం మొదలయింది. ఏదీఏమైనా ఒక నేరస్తుడితో దౌత్య వ్యవహారాలు నడపడం, సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా చిన్న విషయంగా పట్టించుకోకపోవడం దారుణం. దీనిపై సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వాధినేతలే! పెట్టుబడిదారీ ప్రపంచం ఇలాంటి బ్రోకర్లను పెంచిపోషిస్తదని, హీనసంస్కృతికి కారణమవుతుందని గ్రహించాల్సి ఉంది.
ఎప్‌స్టీన్ ఫైల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



