సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
హనుమకొండలో ”ప్రభుత్వ విధానాలు-ఉద్యోగులు, కార్మిక వర్గం కర్తవ్యం”పై సెమినార్
నవతెలంగాణ-నక్కలగుట్ట
ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకొని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) ఆధ్వర్యంలో ”ప్రభుత్వ విధానాలు-ఉద్యోగులు, కార్మిక వర్గం కర్తవ్యం” అంశంపై శనివారం హనుమకొండ బాలసముద్రంలోని డివిజనల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో సెమినార్ నిర్వహించారు. ఐసీఈయూ వరంగల్ డివిజన్ అధ్యక్షులు బి.శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్‌లో వీరయ్య ప్రసంగించారు. దేశ, రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాలు ఉద్యోగులు, కార్మికుల జీవన పరిస్థితులపై చూపుతున్న ప్రభావాన్ని విశ్లేషించారు. ఉద్యోగం కేవలం జీతభత్యాలకే పరిమితం కాదని, సమాజ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం పట్ల కూడా ఉద్యోగులకు బాధ్యత ఉందని చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు.
హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయాలు ఏర్పడితే ఇంధన సరఫరా దెబ్బతిని ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు భారంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్య విలువలు, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం ప్రభుత్వరంగ సంస్థలు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల హక్కులపై పడుతున్న తీరును వివరించారు. ప్రజాస్వామ్య, సామాజిక హక్కుల పరిరక్షణలో ఉద్యోగవర్గం కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాగుల రమేష్ మాట్లాడుతూ.. ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ట్రేడ్ యూనియన్ ఐక్యత, సమిష్టి పోరాటాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఈయూ జాయింట్ సెక్రెటరీ సిహెచ్ పాపిరెడ్డి, బేస్ యూనిట్ సెక్రెటరీ జె.కుమార్ రాజు, ఐసీఈయూ జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర్, సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదే ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఉప్పలయ్య, బోట్ల చక్రపాణి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాలపై అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



