రైతులు పంటల మార్పిడి
తప్పనిసరిగా చేయాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
రైతుల అనుభవం, శాస్త్రవేత్తల జ్ఞానం, ప్రభుత్వ సహకారంతో అద్భుత ఫలితాలు :
రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ముదిరెడ్డి కోదండరెడ్డి
నల్లగొండలో రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్లగొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో శనివారం రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో గతంలో 4 లక్షల ఎకరాల బత్తాయి సాగు కాగా, కాలక్రమేనా వివిధ కారణాల వల్ల అది 40 వేల ఎకరాలకు తగ్గడం బాధాకరమన్నారు. మారుత ున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉందని, ఎప్పుడూ వరిపైనే ఆధారపడకుండా బత్తాయి లాంటి పంటలు, ఇతర ఉద్యాన పంటలను సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. వివిధ పంటలు సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని, ముఖ్యంగా వరి పండించిన రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా, 500 రూపాయల బోనస్ ఇచ్చి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని చెప్పారు. అయితే బత్తాయికి పేరు ప్రఖ్యాతులుగాంచిన నల్లగొండ జిల్లాలో తిరిగి బత్తాయిని ఎక్కువ మొత్తంలో సాగు చేయాల్సిన అవసరం ఉందని, బత్తాయి ఆరోగ్య పరంగా కూడా మనిషికి ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. రైతులు పంట మార్పిడితో పాటు, ఉద్యాన పంటలను సాగు చేయాలన్నారు. హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు, భవిష్యత్ అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ ఎగుమతులు తదితర విషయాలపై ఆలోచిస్తామన్నారు.
రైతు సంక్షేమ కమిషన్ చైర్మెన్ ముదిరెడ్డి కోదండరెడ్డి మాట్లాడుతూ.. రైతుల అనుభవం, శాస్త్రవేత్తల జ్ఞానం, ప్రభుత్వ సహకారం కలిసి వస్తే వ్యవసాయ రంగంలో అద్భుత ఫలితాలు సాధించొచ్చని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది రైతులు ఎన్నో ఒడిదుడుకులు, ప్రకృతి సవాళ్లు, మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొంటూ బత్తాయి పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. వారి కష్టం, పట్టుదల, అనుభవమే నల్లగొండను తెలంగాణలో సిట్రస్ పంటల కేంద్రంగా నిలిపిందన్నారు. రైతుల సమస్యలను సమిష్టిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, రైతుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం ఏర్పాటు అభినందనీయం అని అన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయిలో అనేక కొత్త రకం వంగడాలు వచ్చాయని, రైతులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మెన్ అమిత్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డి.రాజిరెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి, చెవిటి వెంకన్న, పావని రెడ్డి, ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లాల అధికారులు, బత్తాయి రైతులు పాల్గొన్నారు.



