Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే జైలు శిక్ష‍

తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే జైలు శిక్ష‍

- Advertisement -

ఆదాయపు పన్ను చెల్లింపుల్లో
దేశంలో నాలుగో స్థానంలో తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల కమిషనర్లు బి. బాలకృష్ణ, కె. హరిత
“ఆదాయపు పన్ను సమస్యలు”పై సదస్సు


నవతెలంగాణ- కంటోన్మెంట్
తప్పుడు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం, పన్ను ఎగవేతకు పాల్పడటం వంటి చర్యలకు భారీ జరిమానాలతోపాటు జైలు శిక్ష తప్పదని ఆదాయపు పన్ను తెలంగాణ, ఏపీ రాష్ట్రాల కమిషనర్లు బి. బాలకృష్ణ, కె. హరిత హెచ్చరించారు. సికింద్రాబాద్‌లో శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “ఆదాయపు పన్ను సమస్యలు” అంశంపై నిర్వహించిన సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ తెలంగాణ కమిషనర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను చట్టం-2025 ద్వారా ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను ఆధునీకరించి, మరింత సరళీకృతం చేసినట్టు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను చెల్లింపులు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులతో దేశంలో నాలుగో స్థానంలో నిలిచాయని వెల్లడించారు.

పన్ను చెల్లింపులు దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి కీలకమని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ ఏపీ కమిషనర్ మాట్లాడుతూ.. టీడీఎస్ విధానం ద్వారా పన్ను ఎగవేతను అరికట్టడంతోపాటు ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం లభిస్తోందన్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత అర్హులైన వారికి ప్రస్తుతం ఒక్క రోజులోనే రీఫండ్ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీఏ చంద్రశేఖర్ వేముల మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను చట్టం-2025 ఎంతో సరళమైన పన్ను విధానమని, ప్రజల్లో అవగాహన పెంచి పన్ను చెల్లింపులను ప్రోత్సహిస్తు న్నామని చెప్పారు. ప్రజలు చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను న్యాయవాదుల సలహాలు తీసుకుని సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తెలుగు రాష్ట్రాల నూతన సభ్యుల డైరీని ఆవిష్కరించారు. సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను న్యాయవాదులు పాల్గొని పన్ను చట్టాలకు సంబంధించిన పలు అంశాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -