Monday, June 15, 2026
E-PAPER
Homeమానవిముందే గుర్తిస్తే…

ముందే గుర్తిస్తే…

- Advertisement -

మెనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక సాధారణ దశ. మాములుగా 45 – 55 ఏండ్ల మధ్య వచ్చే ఈ దశలో వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమటలు, క్రమం లేని పీరియడ్స్, యోని పొడిబారడం, నిద్ర సమస్యలు, మానసిక స్థితిలో మార్పులు, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయట. అంతేకాకుండా, హార్మోన్ల మార్పుల వల్ల ఎముకల సాంద్రత తగ్గడం, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ ముప్పు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి, నివారించడానికి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ ముప్పు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వయసు పెరగడం, హార్మోన్ల మార్పుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. మెనోపాజ్​లో శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు గణనీయంగా తగ్గిపోతుంది. ఈ హార్మోన్ల మార్పులు కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ లోపలి పొర, అండాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, వయసు పెరగడం అనేది క్యాన్సర్‌కు ఒక బలమైన ప్రమాద కారకమంటున్నారు. ఎందుకంటే వయసుతో పాటు దెబ్బతిన్న కణాలను బాగుచేసుకునే సామర్థ్యం శరీరంలో క్రమంగా తగ్గుతుంది. రుతువిరతి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నేషనల్‌ ‌లైబ్రరీ ఆఫ్‌ ‌మెడిసెన్‌ అంటుంది.

గమనించవలసిన సాధారణ క్యాన్సర్లు
రొమ్ము క్యాన్సర్
: మెనోపాజ్ తర్వాత మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది ఒకటి. శారీరక శ్రమ తగ్గడం, అధిక బరువు, మద్యపానం, కుటుంబ చరిత్ర వంటి కారణాల వల్ల దీని ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

గర్భాశయ క్యాన్సర్ : ఈ దశలో గర్భాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఒబెసిటీ లేదా డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్న మహిళల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ముందస్తు రుతువిరతి (45 ఏండ్లలోపు) గర్భాశయ, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాలను గణనీయంగా పెంచుతుందని నేషనల్‌ ‌లైబ్రరీ ఆఫ్‌ ‌మెడిసెన్‌ పేర్కొంది.

పేగు క్యాన్సర్
: వయసు పెరిగే కొద్దీ పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వయసు పైబడిన వారు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

జీవనశైలికి సంబంధించిన అంశాలు
రుతుక్రమం ఆగిపోయిన తర్వాత బరువు పెరగడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొవ్వు కణజాలం తక్కువ మొత్తంలో ఈస్ట్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తుందట. ఈ క్రమంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే మద్యపానాన్ని పరిమితం చేయడం, ధూమపానం మానేయడం మంచిది.

స్క్రీనింగ్, హెచ్చరిక సంకేతాలు
క్రమం తప్పకుండా రొమ్ము క్యాన్సర్​, పేగు క్యాన్సర్ కోసం చేసే స్క్రీనింగ్ పరీక్షలు ప్రాణాలను కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెనోపాజ్​ తర్వాత అసాధారణంగా యోని నుంచి రక్తస్రావం కావడం, ఆహారపు అలవాట్లలో మార్పులు లేకపోయినా కడుపు ఉబ్బరంగా ఉండటం, నిరంతరం అజీర్తి సమస్యలు వేధించడం లేదా ఆకస్మికంగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.

ఆరోగ్యంపై నియంత్రణ
కుటుంబ నేపథ్యం కారణంగా క్యాన్సర్ వస్తుందని కచ్చితంగా చెప్పలేం. శరీరం ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, డాక్టర్లను సంప్రదించడం ద్వారా మహిళలు క్యాన్సర్ ప్రమాదాలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -