పంచ భూతాత్మకం దేహం
పంచ రుణాత్మకం జీవం
ఏరు తీరుస్తుంది దాహం
ఊరు మారుస్తుంది జీవనం
ఏరు ఎక్కడ పుట్టినా ఊరు ఎక్కడ విస్తరించినా
నేలపై కొత్త ‘గీత’లను లిఖిస్తాయి…
** *** **
అతను ఏరులా ప్రవహించినవాడు —
జన హితమే మతంగా కాలే కడుపులకి
బతుకు మెతుకుని పంచుతూ,
బుద్ధి జీవులలో అభ్యుదయవాదాన్ని పాదుకొల్పి
నిరంతర సాహిత్య సేద్యం చేసినవాడు …
అతను ఊరులా స్పందించినవాడు..
పుట్టిన మట్టిలోని మిరప గుణాన్ని
ఎర్రగా అక్షరాల్లో కూర్చుకున్నాడు..
ఎర్రెర్రని జెండాని పట్టుకొని వూరిపాటలు పాడుతూ
నిజామ్ గడ్డమీదకు ‘లాంగ్ మార్చ్’ చేసాడు..
నీరసంగా ఉన్న లోకానికి ‘అరసం’ రెక్కలు తొడిగి
కాలాన్ని పోరుబాట పట్టించినవాడు..
శాంతి సభల్లో శ్రీశ్రీకి గొడుగై
విస్మృత కవి శిష్ట్లాకి వెలుగు తోడై
జనం నుండి జనంలోకి అక్షర సముద్రమై వెల్లువెత్తాడు..
నడిచే పుస్తకమై ‘శివయ్య’ను ‘మార్క్స్’ను
ఒక్కచోట కూర్చోపెట్టి,
‘ప్రజావాణి ‘నే తన వాణిగా , ‘విశాలాంధ్రనే ‘తన బాణీ గా
‘నవచేతన ‘నే తన సర్వస్వంగా ఆవాహన చేసుకున్నాడు..
తాపీ ధర్మారావు జీవన సారాన్ని పరిశోధించి,
అరసం పత్రాలను లోకార్పితం చేసి,
‘కన్యాశుల్కం’ కావ్యానికి నూరేళ్ళ పండుగ చేసి,
కవుల స్వదస్తూరిని ‘పోయెట్రీ వర్కుషాప్’లో
శిలాక్షరాలుగా మలచి భాషా భాస్వరమయ్యాడు…
*** *** **
అవును, ఇప్పడు ఏరు ఊరు దాటింది…
మరో ప్రపంచం లోని మరో ఊరును అక్షరాలతో బతికించడానికి!!
( ఏటుకూరి ప్రసాద్ గారి స్మృతిలో )
అయినంపూడి శ్రీలక్ష్మి
యేరు ఊరు దాటింది!
- Advertisement -
- Advertisement -



