అక్రమాలను అధిష్టానానికి చెప్పినందుకే మీనాక్షిపై కేసు
త్వరలో ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నిక : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలన అట్టర్ ఫ్లాపని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చేస్తున్న అవినీతి, అక్రమా లను పార్టీ అధిష్టానానికి చెప్పినందుకే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌పై కేసు పెట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఉన్న అతి కొద్ది మంది నిజాయితీ పరుల్లో ఆమె ఒకరని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కుట్ర చేశారని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి అన్యాయం చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రజలకు అడ్డగోలుగా హమీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేస్తోందని విమర్శించారు. ఐదేండ్లలో సగం కాలం ముగిసినా ఒక్క హమీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు. నిరుద్యోగ భృతి రూ. 4 వేలు ఎక్కడిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని ఇచ్చిన హామీ ఎక్కడ నెరవేరిందో నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీల లెక్క ప్రకారం ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ. 1.25 లక్షలు బాకీ ఉందని గుర్తు చేశారు. ఖైరతాబాద్‌లో రెండుసార్లు గులాబీ జెండా ఎగురవేశామనీ, మూడోసారి కూడా సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలను మోసం చేసి రేవంత్ పక్కన కూర్చున్న దానం నాగేందర్ వల్ల త్వరలో ఉప ఎన్నిక రావడం ఖాయమని పేర్కొన్నారు. ప్రతి ఓటు విలువైనదనీ, జూబ్లీహిల్స్‌లో లాగా దొంగ ఓట్లతో గెలిచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటును జాగ్రత్తగా గమనించాలని సూచించారు. జూన్ 25 నుంచి జూలై 31 వరకు జరిగే సర్ ప్రక్రియలో ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ బాధ్యతగా పనిచేయాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జనగణన, ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
మహబూబ్ నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను తరిమికొడతారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి పాలమూరు జీల్లా బీఆర్‌ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి, కమిషన్లు, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరివ్వకుండా ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా ఉండేదనీ, అలాంటి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపామని గుర్తు చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందనీ, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. లండన్ తోపాట పలు ఉన్నత విద్యాసంస్ధల్లో చేరనున్న నలుగురు యువతులు రాజకీయాలపై ఆసక్తితో కేటీఆర్‌ను కలిశారు. రాజకీయనేతలుగా ఎదగాలని తాము నిర్ణయించుకున్నామనీ, కలసి పనిచేస్తామని వారు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన అభిమతమనీ, వారి ప్రయాణంలో అండగా ఉంటామని ఈ సందర్బంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
రెండున్నరేండ్ల రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



