కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమించం రాజకీయ స్వార్థం కోసం ప్రతిష్టను దెబ్బతీయొద్దు
దోపిడీదారులకు సింగరేణిలో ఎలాంటి స్థానం లేదు : ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-నస్పూర్
సింగరేణి కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ను మంత్రి శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, సింగరేణి సీ అండ్ ఎండీ బుద్ధ ప్రకాష్‌తో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓపెన్ హౌస్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. మైన్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతోపాటు అక్కడ అమలవుతున్న భద్రతా ప్రమాణాలు, బొగ్గు రవాణాకు సంబంధిం చిన లెక్కలను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ .. కార్మికుల శ్రమను అవమానిస్తే సహించేది లేదన్నారు.
సింగరేణి సంస్థపై జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధమనే వాస్తవాలను ప్రజలముందుకు తీసుకురావాలనే ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయో జనాల కోసమే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రభుత్వం చెప్పేది కేవలం నిజాలు మాత్రమేనని, ఆ నిజాన్ని ప్రజల ముందుంచడమే తమ బాధ్యతని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధి లో కార్మికుల చెమట, కఠోర శ్రమ దాగి ఉన్నాయని, వారి ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా సహించేది లేదని అన్నారు. సింగరేణి కేవలం ఒక సంస్థ మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల ఆస్తి అని అన్నారు. ఇక్కడి వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజల నుంచి వచ్చిందేనని తెలిపారు. భవిష్యత్తులోనూ సింగరేణి సంస్థ అత్యంత పారదర్శకంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
శ్రీరాంపూర్ ఓసీ మైన్ నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం మరో 28 సంవత్సరాలపాటు ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న ప్రతి ప్రక్రియ అత్యంత ఆధునికంగా, కంప్యూటరైజ్డ్ విధానంలో పారదర్శకంగా సాగుతోందని అన్నారు. కార్మికుల ఆరోగ్యం, పిల్లల చదువు, వారి భవిష్యత్తుపై సింగరేణి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి చికిత్స అందించేం దుకు వీలుగా పూర్తి ఆధునిక పరికరాలతో కూడిన ‘క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సులను’ మంజూరు చేస్తున్నా మన్నారు. ఈ బస్సులు ఊరూరా తిరిగి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు. వ్యాధి లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరితగతిన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. సింగరేణి కార్మికులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా రూ.1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. కార్మికుల పిల్లల ఉన్నత ఆశయాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో మేళవించి సింగరేణిని ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు.
సింగరేణిపై డేగ కన్ను వేస్తే ఊరుకోం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



