పూర్తి స్థాయిలో అందని వైనం
ఖరీఫ్ సీజన్ పెట్టుబడికి ఇబ్బందులు
నవతెలంగాణ – మల్హర్ రావు
వానాకాలం సాగుకు సీజన్ ప్రారంభమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట అందించే పంట పెట్టు బడి సాయం రెండెకరాలకే పరిమితం కావడంతో రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మిగతా సాయం అందుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం విత్తనాలు, ఎరువుల వినియోగంపై సమావేశాలు నిర్వహిస్తోంది. యాసంగి సీజన్ రైతు భరోసా మొదటి విడత గత మార్చి 22న ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల లెక్కన ఎకరంలోపు వారికి విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్ చివరలో జమ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 23న రెండో విడత రెండెకరాల్లోపు రైతులకు అందజేసింది. మొత్తంగా రెండెకరాల్లోపు రైతులకు 12వేలు జమ చేసింది. మండలంలో 9,319 రైతుల ఖాతాల్లో రూ.4,97,84,205 కోట్లు జమయ్యాయి.
పెట్టుబడికి అప్పులు..
యాసంగి పంట పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందక ఇబ్బంది పడాల్సివస్తోందని, డిసెంబర్లో అందించాల్సిన నగదు మార్చిలో ఒక ఎకరం, ఏప్రిల్లో మరో ఎకరానికి జమయ్యాయి. ఐదెకరాలు ఉన్నవారికి రెండెకరాలకే అందించారు. పెట్టు బడి సాయం అందుతదా లేదా తెలుస్తలేదని రైతులు వాపోతున్నారు. యాసంగి పంట సాగు కోసం ప్రైవేట్ అప్పు చేసినట్లుగా రైతులు చెబుతున్నారు. పెట్టుబడికి ప్రభుత్వ సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లుగా వాపోతున్నారు. పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.



