యజమానిగా పర్వతాలు పేరు నమోదు
నవతెలంగాణ-అచ్చంపేట
మండల పరిధిలోని ఉమామహేశ్వరం దేవస్థానంలో సర్వీసులు నిర్వహిస్తున్న రెండు బస్సులు హైదరాబాదులో ట్రాఫిక్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ పార్కింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు పెనాల్టీ వేశారు. TG 31T 2766 నెంబర్ గల బస్సు మే-16 -20 26న హైదరాబాదులోని ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన రాంగ్ పార్కు చేసినందుకుచాలాన్ (పెనాల్టీ ) వేశారు. అదేవిధంగా TG 31T2765 నెంబర్ గల బస్సు ఏప్రిల్ -11 -2026 న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన రాంగ్ పార్కింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు చాలాన్ వేశారు.
ఉమామహేశ్వరం దేవస్థానంలో కొండ కింది నుంచి దేవాలయంపైకి భక్తులను చేరవేయవలసిన బస్సులు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లాయి..అనేది సందేహంగా ఉంది. అదేవిధంగా బస్సుల యజమానిగా (ఓనర్ ) ముచ్చపోతు పర్వతాలు అని నమోదు చేశారు. దేవస్థానానికి చెందిన బస్సులకు యజమానిగా పర్వతాలు అనే వ్యక్తి పేరు ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది.! ఇంతకూ పర్వతాలు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం పైన దేవస్థానం నిర్వహణ, నిధుల వినియోగంపైన భక్తులకు పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ విషయంపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావును నవతెలంగాణ వివరణ కోరగా.. పర్వతాలు అనే వ్యక్తి పేరు మీద దేవస్థానమే బస్సులు కొనుగోలు చేసిందని, ప్రతి నెల కిస్తులు (ఈఏంఐ) లు దేవస్థానం నుండి చెల్లిస్తున్నామని తెలిపారు.



