మరోసారి అమెరికాను అగ్రగామిగా నిలపాలన్నది డోనాల్డ్ ట్రంప్ నినాదం. వాషింగ్టన్ అడుగుజాడల్లో నడుస్తున్నది జపాన్. గత వారంలో జరిగిన ఎన్నికల్లో 1955 తర్వాత అత్యధిక మెజారిటీ సాధించిన మితవాద ఎల్‌డిపి నేత, ప్రధాని సానే తకాయిచీ మరోసారి జపాన్‌ను అగ్రగామిగా చేయాలని ఇచ్చిన పిలుపు ప్రమాద ఘంటికలను మోగించింది. డైట్(పార్లమెంటు) ఎగువ సభలో మెజారిటీ లేనప్పటికీ అవసరమైతే వ్యతిరేకతను పక్కకు నెట్టి తన అజెండాను ముందుకు తీసుకుపోయేందుకు పూనుకున్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తాలలో మిలిటరీ బడ్జెట్‌కు కేటాయించిన ప్రభుత్వం అవసరమైతే యుద్ధాలను నిషేధించి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత మిలిటరీ ఉండాలన్న శాంతికాముక రాజ్యాంగాన్ని కూడా మార్చేందుకు చూస్తున్నది. తనను తాను జపాన్ మార్గరెట్ ధాచర్‌గా వర్ణించుకొనే తకాయిచీ చైనా, ఉత్తర కొరియాలనుంచి ముప్పు అంటూ సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
గతంలో అధికారానికి వచ్చిన షింజే అబే ”ధృడమైన జపాన్‌ను పునరుద్దరించాలని” ప్రతిజ్ఞ పూనాడు. గత విధానాలను క్రమంగా పక్కన పెట్టటం ప్రారంభించాడు. దాని కొనసాగింపుగా ”మరోసారి జపాన్‌ను అగ్రగామి” చేయాలని తకాయిచీ చెబుతున్నారు. దానిలో భాగంగా మిలిటరీని పటిష్టపరచటం, ఆయుధ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత, నాటో, ఐరోపా యూనియన్, క్వాడ్‌తో సహా నూతన భద్రతా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం, అమెరికాతో బంధాన్ని మరింత పటిష్టపరుచుకొనే వ్యూహంతో ముందుకు పోవాలని జపాన్ నిర్ణయించుకుంది. తమ మీద ఎవరైనా దాడి చేస్తే ఉమ్మడిగా ఆత్మరక్షణ లేదా భాగస్వాముల సాయం పొందవచ్చని రాజ్యాంగమే అనుమతిస్తున్నదంటూ నూతన భాష్యాలు చెబుతున్నారు. గత ఏడాది అధికారానికి వచ్చిన వెంటనే ఒక వేళ చైనా గనుక తైవాన్‌పై దాడి చేస్తే తమ మిలిటరీని రంగంలోకి దించుతామని ప్రకటించారు. ఈ వైఖరి ప్రాంతీయ భద్రతకు ముప్పు అని చైనా వర్ణించింది.
ఆర్థిక రంగంలో దీర్ఘకాల పక్షవాత రోగి మాదిరిగా ఉన్న జపాన్ ఇప్పుడు ఆర్థిక, మిలిటరీ లక్ష్యాలను ఉమ్మడిగా ముందుకు తీసుకుపోవాలని చూస్తున్నది. ఇప్పటికే జీడీపీలో రెండు శాతానికి రక్షణ ఖర్చు చేరింది.అణు జలాంతర్గాములను సమకూర్చుకోవాలని, ఆయుధ విక్రయాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని, మారణా యుధాలను ఎగుమతులు చేయాలని చూస్తున్నది. ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు పంపటంతో తగ్గిన పేట్రియాట్ పిఏసి-3 క్షిపణులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇటలీ, ఆస్ట్రేలియాకు ఫ్రైగేట్స్ సరఫరా, నూతనతరం జెట్‌ఫైటర్ల రూపకల్పనకు బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాటో పేరుతో ఉక్రెయిన్‌కు మిలిటరీ పరికరాలను సరఫరా చేస్తున్నది.
సిఐఏ మాదిరి నేషనల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. తద్వారా ఇప్పటికే ఐదు కళ్ల పేరుతో అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గూఢచర్యంలో సహకరించుకుంటున్నాయి, దీనిలో చేరటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అమెరికాతో రక్షణ ఒప్పందంలో భాగంగా అమెరికా మిలిటరీ, సైనిక కేంద్రాలను ఏర్పాటును అనుమతించింది. ”డోన్రో సిద్దాంతం”(డోనాల్డ్ ట్రంప్ ఎత్తుగడలు) పశ్చిమార్ధగోళం వైపు కేంద్రీకరిస్తూ ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నందున ఈ ప్రాంతంలో తాను కేంద్ర బిందువుగా ఉండాలని జపాన్ భావిస్తున్నది, అందుకోసం అమెరికాతో మరింతగా జతకట్టేందుకు పూనుకుంది. తన దగ్గర ఉన్న నిల్వ నుంచి 550 బిలియన్ డాలర్ల మేర అమెరికాలో పెట్టుబడులు పెడతామంటూ అమెరికాకు ఆశచూపుతున్నది.
మరోసారి మిలిటరీవాదం వైపు పయనిస్తున్న జపాన్ చర్యలను దాని బాధిత దేశాలలో ఒకటైన చైనా సహజంగానే వ్యతిరేకిస్తుంది. జర్మనీ నగరమైన మ్యూనిచ్‌లో ప్రస్తుతం జరుగుతున్న భద్రతా సమావేశాలలో మిలిటరీ భూతంలా జపాన్ ఉందని చైనా విమర్శించింది. మమ్మల్ని అంతమాట అంటారా అని జపాన్ నిరసన తెలిపింది. ” ప్రపంచంలో చైనా” అనే ఇతివృత్తంపై మ్యూనిచ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ మాట్లాడుతూ చైనాకు దూరంగా జరుగుతున్న జపాన్ మరోవైపు తైవాన్‌కు మద్దతు ఇస్తూ దురాక్రమణ ఉద్దేశ్యాలను బయటపెట్టుకున్నదని విమర్శించాడు. తైవాన్‌పై దాడితో వలసగా మార్చుకొనేందుకు చూస్తున్నదని, జపాన్ మిలిటరీ వాద భూతం భయం కొనసాగుతున్నదంటూ ఒకవేళ గతంలో మాదిరి పాత పద్ధతిలో దురాక్రమణకు పూనుకుంటే వెనక్కు తిరిగి చూసుకొనేలోపే చావు దెబ్బతింటుందని హెచ్చరించాడు. తైవాన్‌కు మద్దతు ఇవ్వటం ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన పరిణామం అవుతుందని, చైనా సర్వసత్తాకతకు సవాలు, 140 మంది జనాభా అంగీకరించే సమస్యే లేదని కూడా చైనా మంత్రి స్పష్టం చేశాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత సామ్రాజ్యవాదాన్ని జర్మనీ తిరస్కరించిందని, నాజీల ప్రచారాన్ని నిషేధిస్తూ చట్టాలు చేయగా జపాన్ మాత్రం యుద్ద నేరగాండ్లకకు ఇప్పటికీ నీరాజనాలు పలుకుతున్నదని, వారికి వందనాలు చేయటమే సమస్యలన్నింటికీ మూలమని వాంగ్ ఇ చెప్పాడు.చైనా ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని జపాన్ పేర్కొన్నది. తమ మిలిటరీ నిర్మాణం పెరుగుతున్న భద్రతా పర్యావరణానికి స్పందన తప్ప ఒక దేశానికి వ్యతిరేకం కాదని, తైవాన్ సమ స్యను శాంతియుతంగా పరిష్కరించాలనే వైఖరికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పుకుంది. కొన్ని దేశాలు తమ మిలిటరీ శక్తిని పెంచుకుంటున్నాయని, బెదిరిస్తున్నాయని చైనాను ఉద్దేశించి పరోక్షంగా జపాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో వ్యాఖ్యానించారు. తమ పరిసర దేశాలు తీసుకుం టున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని జపాన్ రక్షణ మంత్రి కొజుమీ మ్యూనిచ్ సమావేశాల్లో ఆరోపించాడు.
అక్టోబరులో అధికారానికి వచ్చిన తకాయిచి జపాన్‌కు తొలి మహిళా ప్రధాని. వచ్చీ రావటంతోనే దూకుడుగా, చైనాను రెచ్చగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నారు. తమ భూ భాగాల రక్షణకు ఇప్పటికే తిష్టవేసిన అరవైవేల మంది అమెరికన్ మిలిటరీతో పాటు తాము కూడా రక్షణ ఏర్పాట్లను మరింతగా పెంచుతామని ప్రకటించారు. గత పద్నాలుగు సంవత్స రాలుగా క్రమంగా జపాన్ మిలిటరీ బడ్జెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా 2026 సంవత్సరానికి రికార్డు స్థాయిలో గత రికార్డులను బద్దలు కొట్టి 57.8 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఆమోదించింది. వాస్తవానికి ఇంకా ఎక్కువ మొత్తమే ఖర్చు చేయనుందని, జీడీపీలో రెండుశాతానికి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదేదో అనుకోకుండా జరిగే పరిణామం కాదు. నయా సైనికవాదంలో భాగమే. రాజ్యాంగం శాంతికాముకమని, ఆత్మరక్షణ మిలిటరీ బలగాలని చెబుతున్నప్పటికీ వర్తమాన ఆచరణ యుద్ధోన్మాద బాటగా ఉంది. ప్రతిదాడులు చేసే, దీర్ఘశ్రేణి లక్ష్యాలను దెబ్బతీసే సామర్ద్యాలను సమ కూర్చుకుంటున్నది. చైనా, తైవాన్‌ల సమీపంలో ఉన్న తన దీవులను మిలిటరీ, ఆయుధాలతో నింపుతున్నది. నిజానికి జపాన్ వద్ద ఆధునిక ఆయుధాలను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానానికి కొదవలేదు.
ఇప్పుడు ఉపగ్రహాలు పనిచేయకుండా స్తంభింపచేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నది. అనేక ఆంక్షల కారణంగా ఆయుధాల బదులు ఎలక్ట్రానిక్, వినియోగ వస్తువులపై కేంద్రీకరించి కొన్ని దశాబ్దాల పాటు హవా నడిపింది. ఇటీవలి కాలంలో చైనా సవాలు విసురుతున్నది. ఈ నేపధ్యం లోనే ఆయుధాల తయారీకి పూను కుందని చెప్ప వచ్చు, అయితే తనకు ముప్పు రానంత వరకు లేదా తనకు అవసరమైన వాటిని మాత్రమే అమెరికా అనుమతించ వచ్చు. తానుగా విదేశాలపై దాడులు చేసినపుడు అంతర్గతంగా తలెత్తుతున్న వ్యతిరేకత, నష్టాలను గమనంలో ఉంచుకొని తమ చేతికి మట్టి అంటకుండా చూసుకుం టున్నది. నాటో దేశాలు తమ మిలిటరీ బడ్జెట్లను పెంచుకోవాలని ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇదే మాదిరి ఆసియాలో చైనా మీద దాడికి దిగితే పక్కనే ఉన్న జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఎంతో అవసరం. అందువలన వాటి మిలిటరీ ఖర్చు పెంచేందుకు అమెరికా పూనుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత కుదిరిన ఒప్పందాల ప్రకారం జపాన్, జర్మనీ మిలిటరీ వాదాన్ని వదులుకోవాలని స్పష్టంగా ఉంది. అందువలన దానికి దానికి తూట్లు పొడుస్తూ రెండు దేశాలు కూడా మిలిటరీబాటలో ఉన్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది తప్ప దాని మిలిటరీ సామర్ధ్యాలు అంతరించలేదు. అందుకే మరోసారి వాటిని ప్రదర్శించేందుకు పూనుకుంది. తూర్పు ఆసియాను ఉద్రిక్తల్లోకి నెట్టేందుకు చూస్తున్నది.తొలుత వాణిజ్యం, మత ప్రచారం పేరుతో మనదేశానికి బ్రిటీష్, ఇతర సామ్రాజ్యవాదులు వచ్చినట్లుగానే 1,600 సంవత్సరంలో పోర్చుగీసు వాణిజ్య, మత ప్రచారకులు జపాన్‌లో అడుగుపెట్టారు. జపాన్ నాలుగు ప్రధాన దీవులు, 14,121 చిన్నదీవుల సముదాయం. పోర్చుగీసు, ఇతర పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులను ఎదుర్కొనే క్రమంలో అక్కడి రాజులు తామే సామ్రాజ్యవాదులుగా మారి కొరియాను ఆక్రమించుకున్నారు. చైనా ఆక్రమణకూ పూనుకున్నారు. ఈ క్రమంలో జపాన్-చైనా, జపాన్-రష్యా యుద్ధాలు జరిగాయి. కాముకురా, ఆషికా షోగుంటే రాజరికాలు జపాన్ను ఐక్యంకావించిన తర్వాత ప్రపంచానికి దూరంగా ఒక అగ్రహారంలా ఉంది.
అమెరికా 1853లో నౌకా దళాన్ని పంపి రాజును లొంగదీసుకొని పశ్చిమదేశాలకు మార్కెట్‌గా మార్చింది. దాంతో 1868లో షోగుంటే పాలన రద్దయి, మెజి పాలన ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న ఫ్యూడల్ సంబంధాలను బద్దలు కొట్టి పారిశ్రామీకరణ, నవీకరణ, మిలిటరీ వాదంతో పాలకులు ముందుకు వచ్చారు.ప్రష్యా(జర్మనీ) పాలకులను అనుకరించారు. ఈ క్రమంలో 1910లో కొరియాను ఆక్రమించుకుంది, 1937చైనా ఆక్రమణకు పూనుకుంది. తర్వాత అమెరికా,ఐరోపా దేశాలతో తలపడింది. రెండవ ప్రపంచయుద్దంలో మితవాద భావజాలం, మిలిటరీ శక్తులు, సామ్రాజ్యవాదులుగా ఉన్న ఇటలీ, జర్మనీలతో చేతులు కలిపి సోవియట్ యూనియన్, అమెరికా, ఇతర ఐరోపా దేశాలతో తలపడింది. ఆ యుద్ధంలో ఓడిపోయింది. హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులు వేయటంతో సామాన్య జపనీయులు యుద్ధ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
ఈ నేపధ్యంలో శాంతికాముక రాజ్యాంగంతో యుద్ధాలకు దూరంగా ఉంటామని జపాన్ పాలకవర్గం ప్రకటించక తప్పలేదు. అయితే వలసలు, సామ్రాజ్యవాదంతో ఎలా లబ్ది పొందవచ్చో తెలిసిన వారు గనుక మరోసారి నయా సైనిక వాదంతో ప్రాంతీయంగా అయినా తమ ప్రభావాన్ని రుద్దేందుకు ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ప్రారంభించింది. గడచిన ఎనిమిది దశాబ్దాలలో ప్రపంచ పటంలో అనేక మార్పులు వచ్చాయి. బలాబలాలు తారుమారవుతున్నాయి. గతంలో మాదిరి ఏ దేశాన్ని కూడా భౌతికంగా ఆక్రమించుకొనే అవకాశాలు లేదు. అందువలన జపాన్ గతాన్ని తలుచుకోవటం తప్ప అంతకుమించి చేసేదేమీ లేదు, అయినప్పటికీ పాలకవర్గ స్వభావం మారదు, అందుకే మరోసారి జాతీయోన్మాదాన్ని, నయా సైనికవాదాన్ని ముందుకు తెస్తున్నది. అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయో జపనీయులకు తెలిసి నంతగా మరొరికి తెలియదు గనుక పాలకవర్గ యత్నాలను అడ్డుకుంటారని, అడ్డుకోవాలని ఆశిద్దాం!
ఎం కోటేశ్వరరావు
8331013288



