ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం ఆదేశం
హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం
రెండేండ్ల జైలు శిక్ష ఖరారు
ప్రత్యూష ఆత్మహత్య కేసులో దాదాపు 24 ఏళ్ల తరువాత తుది తీర్పు
2002లో సిద్దార్థ రెడ్డితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రత్యూష
న్యూఢిల్లీ: తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దాదాపు 24 ఏళ్ల తరువాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు (ఉమ్మడి ఏపి హైకోర్టు) విధించిన రెండేళ్ల జైలు శిక్షను సమర్థించింది. ప్రత్యూష మరణానికి సంబంధించి చార్జ్ షీట్ లో పొందుపరిచిన మొత్తం 12 అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పును వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ… 2012 జనవరిలో సిద్ధార్థ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రత్యూష పై అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి సరోజినీ దేవి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. అప్పటి నుంచి 14 ఏళ్లగా ఈ కేసులో 17 పర్యాయాలు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు వింది. చివరగా గతేడాది నవంబర్ లో 19న ఇరు వైపు సుదీర్ఘ వాదనల అనంతరం విచారణను రిజర్వ్ చేసింది. మంగళవారం జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ల ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఇరువైపు వాదనల అనంతరం 12 అంశాలను పరిగణలోకి తీసుకొని నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థిస్తున్నట్లు వెల్లడించింది. ‘గొంతు కోసి చంపడం వల్ల హత్య జరిగిందని ఆరోపణ తోసిపుచ్చుతున్నాం. కంటి, వైద్య ఆధారాలు విష ప్రయోగం వల్ల మరణాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రత్యూష తల్లి ఆరోపించినట్టు నిందితుడిపై అత్యాచార నేరం నిర్ధారణ కాలేదు. అయితే… సిద్దార్థ న్యూరాన్ టోన్ కొనుగోలు చేశారని తేలింది. తద్వారా ఆత్మహత్యకు తను ప్రేరేపించడం నిరూపితమైంది.’ అని ధర్మాసనం తీర్పులో కాపీలోని ముఖ్య అంశాలను చదివి వినిపించింది. మరోవైపు డాక్టర్ మునిస్వామి అనైతిక పోర్ట్ మార్టం రిపోర్ట్ ను అందించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తద్వారా ఈ రిపోర్ట్ ముందస్తు, ఉద్దేశపూర్వకంగా ప్రచురించడం వల్ల కలిగే పరిణామాలపై కోర్టు మందలించింది. ‘ఇద్దరు కలిసి చేసుకున్న ఆత్మహత్య ఒప్పందంలో జీవించి ఉన్న భాగస్వామి చట్టపరంగా దోషి. ఈ కారణాల వల్ల ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో అప్పీల్దారు అయిన సిద్దార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు.
2002 ఫిబ్రవరిలో ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి కలిసి ఆత్మహత్య యత్నం
ఇంటర్మిడియట్ చదివుతుండగానే సిద్దార్థ రెడ్డితో ప్రత్యూష ప్రేమలో పడింది. ఆమె నటిగా మంచి ఆవకాశాలు అందుకుంటున్న సందర్భంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఇద్దరు కలిసి మరణించాలని డిసైడ్ అయి, ఫిబ్రవరి 23, సాయంత్రం కూల్ డ్రింక్ లో విషం కలుపుకొని తాగారు. ప్రత్యూష మరునాడు చనిపోగా.. సిద్ధార్థ బతికాడు. దాదాపు 15 రోజుల పాటు హస్పిటల్ నుంచి సిద్ధార్థ మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సిద్దార్థనే పురికొల్పాడని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా సిద్దార్థపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
ఈ కేసులో తొలత 2004 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సిద్ధార్థ కు ఐదేళ్ల కారాగారశిక్ష విధించారు. అలాగే రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు శిక్ష కాలాన్ని రెండేండ్లకు తగ్గిస్తూ సిద్ధార్థకు డిసెంబర్ 28, 2011 లో ఉపశమనం కల్పించింది. అయినప్పటికీ ఈ కేసులో బెయిల్ కోరుతూ… 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రత్యూష తల్లి సరోజినీ దేవి హత్య కారణంగానే మృతి చెందారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష సబబే అని వ్యాఖ్యానిస్తూ ఈ రెండు పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది.
నాలుగు వారాల్లో లొంగిపోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



