పరిశోధనలకు ఏఐ మిషన్ 2.0ను తెస్తాం :కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి
న్యూఢిల్లీ: వచ్చే రెండేండ్లలో భారత కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరుగు తోన్న ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. ఏఐ రంగంలో భారత్ అద్భుతమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. వచ్చే రెండేండ్లలో ఐదు ఎఐ కీలక విభాగాల్లో సుమారు 200 బిలియన్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.18 లక్షల కోట్ల విలువ. మౌలిక సదుపాయాల నుంచి ఇంధన వనరుల వరకు ఎఐ అభివృద్ధికి అవసరమైన అన్ని రంగాల్లో అంతర్జాతీయ సంస్థలు భారత్ పట్ల ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇది దేశ సాంకేతిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ పెట్టుబడుల ఆకర్షణలో భారత్‌లోని పునరుత్పాదన ఇంధన వనరులు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 51 శాతం క్లీన్ ఎనర్జీ నుంచే వస్తుండటం, డేటా సెంటర్ల నిర్వహణకు భారత్‌ను అగ్రగామిగా నిలబెడుతోందని మంత్రి పేర్కొన్నారు. సాంకేతికత కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండకుండా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. త్వరలోనే పరిశోదన, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ‘ఏఐ మిషన్ 2.0’ను ప్రారంభించనున్నామని మంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మానవ వనరులను సిద్ధం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలతో కలిసి ప్రస్తుత ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటుగా కొత్త టాలెంట్ ప్రోత్సహించనున్నట్టు మంత్రి తెలిపారు. కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి అదనంగా 20,000 జీపీయూలను జోడిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాధ్యతాయుతమైన ఎఐ వినియోగంపై ఏకాభిప్రాయం సాధించేందుకు భారత్ కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
భారీ ఏఐ డేటా సెంటర్లపై అదానీ దృష్టి
అదానీ గ్రూప్ రాబోయే దశాబ్ద కాలంలో భారత దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధనంతో నడిచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల నిర్మాణానికి 100 బిలియన్ల (సుమారు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా అనుబంధ రంగాలైన సర్వర్ తయారీ, క్లౌడ్ సర్వీసుల్లో మరో 150 బిలియన్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా భారత్‌లో 250 బిలియన్ల ఎఐ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పడుతుందని సంస్థ అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ వెల్లడించారు.
ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో కలిసి విశాఖపట్నం, హైదరాబాద్, నోయిడా, పూణే వంటి నగరాల్లో డేటా సెంటర్లను నిర్మిస్తున్నామన్నారు. భారత్ ఏఐ టెక్నాలజీని కేవలం వాడుకోవడమే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో భారతీయ ఏఐ స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థల కోసం ప్రత్యేకంగా కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కేటాయించనున్నట్టు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.



