రూ.50.73 కోట్లతో మౌలిక సదుపాయాల పనులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా,
సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన దిశగా రాష్ట ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. రాష్ర్ట వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, స్టేడియాల ఆధునీకరణ సహా క్రీడా అకాడమీల ఏర్పాటుకు రూ.50.73 కోట్లతో అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో శంకుస్థాపనలు చేశారు. ఇందులో జిల్లాలో మినీ స్టేడియాలకు రూ.36.65 కోట్లు, గచ్చిబౌలి-ఎల్బీ స్టేడియంలో పలు అకాడమీలకు రూ.14.08 కోట్లు వ్యయం చేశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఫిఫా-ఏఐఎఫ్‌ఎఫ్ బాలికలు, బాలురు అకాడమీలను రూ.5.70 కోట్ల చొప్పున వ్యయంతో ఏర్పాటు చేయగా.. ఎల్బీ స్టేడియంలో 58.50 లక్షలతో ఫుట్‌బాల్ అకాడమీ, రూ.49 లక్షలతో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, మహ్మద్ అజహరుద్దీన్, అడ్లూరీ లక్మణ్ కుమార్, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శంకుస్థాపన చేసిన రాష్ర్ట వ్యాప్త ప్రాజెక్టులు
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలో రూ.10 కోట్లతో మినీ స్టేడియం నిర్మాణం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ స్టేడియం ఆధునీకరణకు రూ.10 కోట్లు, నారాయణపేట్ జిల్లా నర్వ మండల కేంద్రంలో రూ.4 కోట్లతో మినీ స్టేడియం, వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో రూ.4 కోట్లతో మల్టీ పర్పస్ స్టేడియం, కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రూ.3.50 కోట్లతో మినీ స్టేడియం, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.2.65 కోట్లతో మినీ స్టేడియం, నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో రూ.2.50 కోట్లతో వాలీబాల్, కబడ్డీ కోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.



