కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు ఎస్ఎఫ్ఐ పాదయాత్ర
పోలీసుల ఆంక్షలను దాటుకుంటూ నిరసన ప్రదర్శన
పాల్గొన్న వందలాది మంది విద్యార్థులు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో పాదయాత్ర చేపట్టింది. పోలీసులు పెట్టిన అన్ని ఆంక్షలన్నింటినీ దాటుకుంటూ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, సీబీఎస్ఈ అవకతవకలు వంటి అంశాలను లేవనెత్తిన ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్ఎఫ్ఐ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిషేధాన్ని ఉల్లంఘించి ఆందోళన చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను చేదించి విద్యార్థులు కదంతొక్కారు. ఢిల్లీతో పాటు రాజస్తాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు నిరసన తెలిపేందుకు దేశ రాజధానికి వచ్చారు. శుక్రవారం హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను బారికేడ్లు ఉపయోగించి, విద్యార్థులను అరెస్టు చేసి విచ్ఛిన్నం చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, మాతా సుందరి కళాశాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విద్యార్థులు నెట్టుకుంటూ ముందుకు సాగారు. అక్కడ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు విద్యార్థుల ముందు మోకరిల్లాల్సి వచ్చింది.
అనంతరం ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందాన్ని విద్యా మంత్రిత్వ శాఖకు తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య, ఉపాధ్యక్షురాలు శిల్పా సురేంద్రన్, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ మంత్రిత్వ శాఖకు చేరుకుని వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం నాడు డిమాండ్లపై సవివరమైన చర్చకు మంత్రిత్వ శాఖ అధికారులు ఆహ్వానించారు. ఎస్ఎఫ్ఐ ఆందోళనను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. తుపాకులు, బాష్ప వాయువుతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ ఆందోళనను శనివారం నుంచి మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని ఎస్ఎఫ్ఐ నాయకత్వం తెలిపింది. ఈ నిరసన ప్రదర్శనలో ఉపాధ్యక్షుడు సుభాష్ జాఖర్, సంయుక్త కార్యదర్శి అనిల్ ఠాకూర్, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ ఎలామన్, కేంద్ర కమిటీ సభ్యుడు అభిజిత్ మణిలాల్, ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యులు మెహినా ఫాతిమా, అనిల్ సేతుమాధవన్, జేఎన్‌యూఎస్‌యూ ఉపాధ్యక్షురాలు కె. గోపిక బాబు తదితరులు పాల్గొన్నారు.


