Saturday, June 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిలిచిన 'స్టాండ్‌ అప్ ఇండియా'

నిలిచిన ‘స్టాండ్‌ అప్ ఇండియా’

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికుల
గొంతు కోసిన కేంద్రం
ఆశ చూపించి అర్ధాంతరంగా
ముగించిన వైనం
కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి
విన్నవించుకున్నా ఫలితం శూన్యం
పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని
పారిశ్రామికవేత్తల డిమాండ్‌


నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన ‘స్టాండ్‌ అప్ ఇండియా’ పథకం తొమ్మిదేండ్లకే అటకెక్కింది. అదిగో ఇదిగో మళ్లీ ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పినా పునరుద్దరణ కాలేదు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆశపడిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు కేంద్రం వైఖరితో నిరాశే ఎదురైంది. 2016లో ప్రారంభమైన పథకం 2025 మార్చి 31న ఆగిపోయింది. లబ్దిదారులకు మరింత మేలు చేసేలా దీనిని మార్పులు చేసి, పునరుద్ధరించాలన్న బూచి చూపి కేంద్ర ప్రభుత్వం మొత్తానికే ఆపేసింది. నిధుల కొరత, కఠినమైన రుణ మంజూరు నిబంధనలు అధిగమించి కొంత మంది పారిశ్రామికులు లబ్దిపొందారు. ఈ క్రమంలో పథకాన్ని పునరుద్ధరణ చేయాలని కోరుతూ.. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పలుమార్లు కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి ఉత్తరాలు రాసినా ఫలితం లేదు. ఇప్పటికైనా స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో వచ్చే ఆర్థిక సహాయాన్ని పునరుద్ధరించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఈ పథకం కింద ప్రతి బ్యాంకు నుంచి 5 మంది ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికులకు రుణాలు ఇవ్వాల్సింది.

దేశ వ్యాప్తంగా ఈ పథకం వచ్చిన నాటి నుంచి 2025 మార్చి 31 వరకు రూ.65వేల కోట్ల రుణాలిచ్చారు. ఈ రుణాల వల్ల 5 లక్షల మందికి లబ్ది చేకూరింది. ఆమన్‌గల్‌, జీడిమెట్లలో రూపింగ్‌ పరిశ్రమ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌లో దాన ఫ్యాక్టరీ, వనపర్తిలో పశువుల దాన ఫ్యాక్టరీ, భూ త్పూరులో పాల ఉత్పత్తుల పరిశ్రమ పరిశ్రమలున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా.. లబ్దిదారులందరికీ న్యాయం జరగలేదు. ముఖ్యంగా గ్రీన్‌ఫీల్డ్‌, ప్రాజెక్టులకే పరిమితం చేయడం వల్ల అప్పటికే యూనిట్‌ను మొదలు పెట్టిన వారికి ఈ పథకం వర్తించలేదు. దీంతో అనేక మంది యువతీయువతులకు పథకం అందు బాటులోకి రాలేదు. మొదటిసారి వ్యాపారం ప్రారంభించే వారికి మాత్రమే వర్తించింది. ఇప్పటికే చిన్న వ్యాపారాలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి లేదా ఆధునీకరించు కోవడానికి ఈ రుణాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

బ్యాంకుల మొండి వైఖరి
పథకం కింద 10 లక్షల నుంచి కోటి వరకు రుణాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో బ్యాంక్‌ అధికారులు పూచీకత్తు అడగడం, నిబంధనల కారణంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా వర్గాలకు రుణాలు సకాలంలో అందలేదు. అయితే, మహిళా పారిశ్రామికవేత్తలకే అత్యధికంగా రుణాలు మంజూరయ్యాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీ సామాజిక తరగతులకు, ముఖ్యంగా ఎస్టీ తరగతికి ఈ పథకం ద్వారా లభించిన రుణాలు నిధుల శాతం చాలా తక్కువ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 2025 నాటికే ఈ పథకం గడువు ముగిసింది.
నీతి ఆయోగ్‌ అధ్యయనం ఆధారంగా దీనిని మార్పులు చేసి కొత్తగా తీసుకొస్తామని చెప్పినప్పటికీ.. సరైన గడువు విధివిధానాలను ప్రకటించక పోవడంతో కొత్త వ్యాపారులకు నిరాశే మిగిలింది. ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ‘స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా’ క్షేత్రస్థాయిలో సాధించిన విజయాల కంటే, విధానపరమైన లొసుగుల వల్ల అట్టడుగు వర్గాలకు అందని ద్రాక్షగా మారింది.

నిధులు పెంచి ప్రారంభించాలి
స్టాండ్‌ అప్ ఇండియా పథకానికి నిధులు పెంచాలని ఒక వైపు డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు పథకాన్నే నిలిపేయడం సరికాదు. కేంద్రం విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయి. నిధులు పెంచి పథకాన్ని పునరుద్ధరించాలి.

డీవైఎఫ్‌ఐ మహబూబ్‌నగర్‌
జిల్లా కన్వీనర్‌ కమ్మరి ప్రశాంత్‌


పునరుద్ధరణ చేయాలి
‘స్టాండ్‌ అప్ ఇండియా’ పథకాన్ని నిలిపేయడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిరాశ మిగిలింది. పథకాన్ని నిలిపేసి 15 నెలలు కావస్తోంది. ఇప్పటికీ కేంద్రం ఈ పథకాన్ని పున:ప్రారంభం చేయలేదు. వెంటనే పునరుద్ధరించా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు న్యాయం చేయాలి.
భారతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా

జాతీయ సమాఖ్య అధ్యక్షులు
పుట్టపాగ శ్రీనివాసులు, నాగర్‌కర్నూల్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -