Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంమౌనేంద్ర మోడీ

మౌనేంద్ర మోడీ

- Advertisement -

అమెరికా దుశ్చర్యలను ఖండించలేని పరిస్థితి
భారత ప్రయోజనాలను కాపాడటంలో విఫలం
గతంలో మన్మోహన్‌‌పై ‘మౌన్‌మోహన్‌’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు
ఇప్పుడు నోరు మెదపని దేశ ప్రధాని
ఇది నాయకత్వ బలహీనతకు సంకేతం : విశ్లేషకులు

న్యూఢిల్లీ : గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ.. అప్పటి భారత ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మన్మోహన్ సింగ్‌ను ‘మౌన్‌మోహన్’ అని ఎద్దేవా చేసిన మోడీ… ఇప్పుడు తానే ‘మౌనేంద్ర మోడీ’గా మారిపోయారు. ‌తాజా పరిణామాలే మోడీ తీరును బయటపెడుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల అమెరికా దాడుల్లో భారతీయ నావికులు మరణించినా, ట్రంప్ పలుమార్లు భారత్‌ను అవమానించినా, భారత్‌-‌పాక్‌ ‌మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పినా, భారత్‌‌పై అమెరికా భారీ సుంకాలు విధించినా.. మోడీ బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమెరికా పేరును కానీ, ట్రంప్‌ ‌పేరును కానీ తీసుకొని విమర్శించే ధైర్యమూ చేయలేదు. ఒకప్పుడు గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా మన్మోహన్‌‌ను విమర్శించిన మోడీ, ఇప్పుడు ప్రధానిగా ఉండి కూడా అమెరికా విషయంలో మౌనమే సమాధానంగా వ్యవహరించడం ఆయన ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నది. దీంతో భారత ప్రధాని తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

​బీజేపీని ఇరుకున పెడుతున్న తాజా పరిణామాలు
దేశీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసే మోడీ.. తనకు ఇబ్బందికరమైన జాతీయ అంశాల విషయంలో మాత్రం నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇబ్బందికర అంశాలపై మాట్లాడకపోవటమే మంచిదనీ, సమస్యలు వాటంతట అవే కనుమరుగవుతాయని భావిస్తున్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నా రు. గత ఏడాది కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి భారత్‌కు జరిగిన అవమానాలపై మోడీ స్పందించలేదు. మోడీని ఒక ధైర్యవంతమైన ప్రపంచ నాయకుడిగా ప్రచారం చేసుకున్న బీజేపీకి తాజా పరిణామాలు సంకటంగా మారాయి. అయితే ఇదంతా ఒక ‘వ్యూహాత్మక మౌనం’ అంటూ బీజేపీ, దాని అనుబంధ వర్గాలు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

​దేశం, సైన్యానికి ఇచ్చే గౌరవం ఇదేనా?
తమకు దేశం, సైన్యం చాలా ముఖ్యమని ప్రధాని మోడీ చెప్తుంటారు. ఇందుకు దీపావళి వేడుకలను సైనికుల మధ్య జరుపుకోవడాన్ని ఉదహరిస్తుంటారు. అయితే దేశానికీ, సైన్యానికి.. అమెరికా నుంచి జరగరానంత అవమానం జరిగినా మోడీ మాత్రం కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ఈ విషయం మరోసారి బయటపడింది. జూన్ 9-10 మధ్య గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా యుద్ధవిమానం జరిపిన దాడిలో ఎమ్.టి. సెటెబెల్లో నౌకలో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. ఈ ఘటన తర్వాత ట్రంప్‌ను కలిసినప్పుడు మోడీ ఏం చెప్తారోనని యావత్‌ దేశం ఎదురుచూసింది. కానీ మోడీ నుంచి ఆశించిన స్పందన రాలేదు. సెటెబెల్లోపై దాడికి ముందు ఎమ్.టి. మారివెక్స్ అనే మరో నౌకపై కూడా అమెరికా దాడి చేసింది. ఆ తర్వాత ఎమ్.టి. జల్వీర్‌పై కూడా దాడి జరిగింది. దీంతో దేశానికి, సైన్యానికి మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా అనే ప్రశ్నలు దేశ ప్రజల నుంచి వస్తున్నాయి.

అమెరికాను ప్రశ్నించడంలో 
వెనుకాడుతున్న మోడీ
అమెరికాను నేరుగా ప్రశ్నించడంలో మోడీ ప్రభుత్వం తొలి నుంచీ వెనుకాడుతోంది. మారివెక్స్ ఘటన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దాడి చేసింది ఎవరో కూడా స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. మొదటి దాడిపైనే భారత్ గట్టిగా స్పందించి ఉంటే.. తర్వాత సెటెబెల్లోపై అమెరికా ఇంత సులభంగా దాడి చేసేదా? అనే ప్రశ్నలు భారత ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ముగ్గురు భారత నావికులు మరణించిన సెటెబెల్లో ఘటన తర్వాత కూడా భారత ప్రభుత్వ స్పందన బలహీనంగానే ఉంది. దాడి జరిగిన 20 గంటల తర్వాత ప్రకటన రావడం గమనార్హం. అందులో కూడా.. అమెరికా పేరును ప్రస్తావించకుండా, ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించాలని మాత్రమే కోరడం మోడీ సర్కారు పేలవ పనితీరును తెలియజేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక భారత్ అమెరికా రాయబారి ప్రతినిధిని పిలిచి నిరసన తెలిపినా, కొన్ని గంటల్లోనే జల్వీర్‌పై మరోసారి అమెరికా దాడి చేయడం గమనార్హం.

​జైశంకర్‌ అలా.. రూబియో ఇలా..
ఈ ఘటనలపై సోషల్ మీడియాలో ప్రజాగ్రహం పెరిగింది. ఈ ఒత్తిడి కారణంగానే మోడీ సర్కారు కొంత గట్టిగా స్పందించాల్సి వచ్చింది. ఇందులో భాగంగా జూన్ 13న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఆ ఫోన్ సంభాషణ అనంతరం విడుదలైన ప్రకటనల్లో భారత్-అమెరికా మధ్య ఉన్న తేడాలు స్పష్టంగా కనిపించాయి. జైశంకర్ భారతీయ నావికుల మరణాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. కానీ రూబియో నుంచి మాత్రం విరుద్ధమైన స్పందన వచ్చింది. అమెరికా ఆదేశాలను పాటించాలని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. పైగా మరణించిన భారతీయ నావికుల పట్ల రూబియో సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం.

​ట్రంప్‌‌పై మోడీ ప్రశంసలు
ట్రంప్‌పై మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణకు ట్రంప్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కానీ ఆ ప్రాంత అస్థిరతకు ట్రంప్ విధానాలే కారణమన్న విషయాన్ని భారత ప్రధాని గుర్తెరగకపోవడం గమనార్హం. ఇక మీడియా సమావేశంలో భారతీయ జర్నలిస్టులు కూడా మోడీని ఎలాంటి కఠినమైన ప్రశ్నలూ అడగలేదు. ఒక భారతీయ విలేకరి భారత నావికుల మరణాలపై ట్రంప్ స్పందన కోరినప్పుడైనా మోడీ కలుగజేసుకొని స్పందించొచ్చు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలపవచ్చు. అమెరికా తప్పును పరోక్ష‍ంగానైనా ఎత్తి చూపచ్చు. కానీ ఇలా ఏదీ చేయకుండా మోడీ మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ఈ మొత్తం పరిణామాలను చూస్తే.. ఒకప్పుడు ‘మౌన్‌మోహన్’ అని విమర్శించిన మోడీ ఇప్పుడు తానే ‘మౌనేంద్ర మోడీ’గా మారిపోయారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది దేశ నాయకత్వం బలహీనంగా ఉందని చెప్పే సంకేతమని అంటున్నారు.

ట్రంప్‌‌తో మీడియా సమావేశంలో మోడీ మౌనం
ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సమావేశంలో మోడీ తన ప్రతిష్ట దెబ్బతినకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. భారత నావికుల మరణాల గురించి నేరుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జీ7 సమావేశంలో చేసిన ప్రసంగంలోనూ ట్రంప్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. అయితే భారత మీడియా మాత్రం ‘ట్రంప్ సమక్షంలో మోడీ నావికుల అంశాన్ని లేవనెత్తారు’ అంటూ ప్రచారం చేయడం గమనార్హం. మీడియా సమావేశంలో కూడా మోడీ ఎక్కువసేపు మౌనంగానే కూర్చున్నారు. ఇదే సమయంలో అమెరికా తన ‘ఇండో-పసిఫిక్’ వ్యూహాత్మక భావనకు ప్రాధాన్యం తగ్గించిందనీ, భారత్‌కు అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యం తగ్గిపోతోందని విశ్లేషకులు చెప్తున్నారు. అయినా మోడీ మాత్రం భారత్-అమెరికా సంబంధాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని చెప్పడం గమనార్హం. అమెరికా భారత్‌పై భారీ సుంకాలు విధించిన విషయాన్ని కూడా ప్రస్తావించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -