Monday, June 22, 2026
E-PAPER
Homeజాతీయంధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వరకు క‌ద‌ల‌ం

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వరకు క‌ద‌ల‌ం

- Advertisement -

జంతర్ మంతర్ వద్ద సీజేపీ భారీ ఆందోళ‌న‌
చీక‌టి ప‌డ‌గానే లైట్లు ఆపేసిన పోలీసులు
మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో కొన‌సాగిన ఆందోళ‌న‌
మైక్రోఫోన్ కనెక్షన్‌, నీటి సరఫరా నిలిపివేత‌
మీడియాపై కూడా నియంత్రణ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వ‌ర‌కు కదలబోనని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్ప‌ష్టం చేశారు. నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌, సీబీఎస్‌ఈ అవ‌క‌త‌వ‌క‌లు వంటి విద్యా రంగ వైఫల్యాలకు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ శ‌నివారం నాడిక్క‌డ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద‌ తమ రెండో దశ ఆందోళ‌న‌ను చేప‌ట్టింది. తొలిత నీట్ గంద‌ర‌గోళం మ‌ధ్య ఆత్య‌హ‌త్య చేసుకున్న విద్యార్థుల చిత్ర‌ప‌టాల‌కు నివాళుల‌ర్పించారు. స్టీల్ ప‌ళ్లాల‌ను చెంచాల‌తో మోగిస్తూ ‘‘ప్ర‌ధాన్ గో బ్యాక్’’ అంటూ నినాదాల హోరెత్తించారు. జాతీయ జెండాల‌తో పాటు అంబేద్క‌ర్‌, భ‌గ‌త్ సింగ్, మ‌హాత్మా గాంధీ, పూలే వంటి ప్ర‌ముఖుల చిత్ర‌ప‌టాలు, రాజ్యాంగం కాపీల‌ను చేబూని వేలాది మంది విద్యార్థులు, పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థులు, వారి త‌ల్లిదండ్రులు, బంధువులు ఆందోళ‌న‌లో భాగమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన విద్యార్థి, యువ‌జ‌న లోకంతో దేశ రాజ‌ధానిలో క‌దంతొక్కారు. దేశంలోని విద్యా రంగ ప‌రిర‌క్షించాల‌ని చేసే ఈ ఆందోళ‌న‌తో జంత‌ర్ మంత‌ర్‌ జ‌న‌సంద్రంలా మారింది.

​సీజేపీ ఆందోళ‌న‌ను ఎదుర్కోవడానికి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు కలిసి జంతర్ మంతర్ వద్ద తుపాకులతో మకాం వేశారు. జంతర్ మంతర్, దానిని ఆనుకుని ఉన్న రహదారుల చుట్టూ పలు దఫాలుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రిజర్వ్ బలగాలను కూడా సిద్ధంగా ఉంచారు. అయినప్పటికీ, మండుటెండలో వేలాది మంది యువ‌త ఆందోళ‌న ప్రాంతానికి చేరుకున్నారు. దీప్కే పిలుపు మేరకు నిరసనకారులు పళ్ళాలు, చెంచాలు పట్టుకుని వచ్చారు. అభిజీత్ జాతీయ జెండాతో పాటు గాంధీ, అంబేద్కర్ చిత్రాలతో వేదికపైకి చేరుకున్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ తరువాత‌ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల చిత్రాలకు ఆయన పూలు సమర్పించి, అనంతరం మౌనం పాటించారు. నిరసనకారులను దేశద్రోహులుగా, పాకిస్థానీయులుగా చిత్రీకరించేందుకు సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా దీప్కే, ఇతరులు జంతర్ మంతర్ వద్ద గళం విప్పారు. రెచ్చగొట్టడంతో శనివారం నాటి ఆందోళ‌న‌ను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ‘గోడీ మీడియా’ ఆందోళ‌న వద్దకు వెళ్లి రెచ్చగొట్టే ప్రశ్నలు అడగడం కొనసాగించారు. కార్యకర్తలు దీనిని వ్యతిరేకించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ‘గోడీ మీడియా’ను అక్కడి నుంచి పంపించేశారు.

​మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ ఆందోళ‌న‌కు సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు అనుమతి లభించింది. ఆ తరువాత‌ సమయం పొడిగించాలని అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆందోళ‌న చేసేందుకు స‌మ‌యం పొడిగించేందుకు పోలీసులు స‌సేమీరా అన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత ఆందోళ‌న‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు, ఆందోళ‌న చేస్తున్న వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. విద్యార్థులు, యువ‌త అందుకు అంగీకరించలేదు. ఆందోళ‌నకారుల‌ను ఖాళీ చేయించడానికి పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించారు. బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాన్ని విద్యార్థి, యువ‌జ‌న‌లు ప్రతిఘటించారు. దీంతో పోలీసులు మైక్రోఫోన్ కనెక్షన్‌ను నిలిపివేశారు. చీక‌టి ప‌డ‌గానే లైట్లను కూడా నిలిపివేశారు. నీటి సరఫరాను నిలిపివేశారు. ప్రాథమిక అవసరాల కోసం ఆందోళన ప్రాంతం నుండి బయటకు వెళ్లిన వారిని, ఆ తరువాత‌ తిరిగి లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. మీడియాపై కూడా నియంత్రణ ప్ర‌దర్శించారు. కానీ విద్యార్థులు, యువ‌త ఈ చ‌ర్య‌లన్నింటినీ వ్యతిరేకించారు. మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో ఆందోళ‌న‌ను కొన‌సాగించారు.

​జంతర్ మంతర్‌లోకి ఆహారాన్ని తీసుకువెళ్లడానికి ఢిల్లీ పోలీసులు ఇప్పుడు అనుమతించడం లేదని అభిజీత్ దీప్కే అన్నారు. మహాత్మా గాంధీ కూడా నిరాహార దీక్ష చేశారని, తాము కూడా నిరాహార దీక్ష చేస్తామని ఆయన అన్నారు. “కానీ చరిత్ర రాసినప్పుడు, మిమ్మల్ని జనరల్ డయర్‌తో పోలుస్తారు. ఆ ప్రాంతంలోకి నీరు, ఆహారాన్ని అనుమతించాలని మేము ఢిల్లీ పోలీసులను మరోసారి కోరుతున్నాము. భగత్ సింగ్ ఆందోళ‌న‌ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వారు కూడా వారికి నీళ్లు ఇచ్చారు” అని ఆయన అన్నారు. “ఈ చీకట్లో నాపై ఏదైనా దాడి జరిగితే, లైట్లు ఆపివేసిన వారే బాధ్యులు అవుతారు” అని దిప్కే అన్నారు. “తాగునీటి సరఫరాను నిలిపివేయడానికి బారికేడ్ల వద్ద పోలీసులు మోహరించారు. మీరు ఇంతైనా ప్రయత్నం చేసి ఉంటే, పేప‌ర్‌ లీకేజీలు జరిగి ఉండేవి కావు. 12 మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు” అని ఆయన అన్నారు. ఆందోళ‌న‌ ప్రదేశంలో లైట్లు, నీరు, ఆహారం అందుబాటులో ఉంచడానికి అనుమతించాలని పోలీసులను కోరారు. ప‌దేప‌దే కోర‌డంతో రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు లైట్లు ఆన్ చేశారు. లైట్లు వెలిగించినందుకు ఢిల్లీ పోలీసులకు అభిజీత్ దీప్కే ధన్యవాదాలు తెలిపారు.

​న్యాయం కోసం ఎంతకైనా తెగిస్తామ‌ని అభిజీత్ దీప్కే ప్రకటించారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. “అయితే నేను అడగాలనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా మంత్రిగా ఎందుకు కొనసాగుతున్నారు? చట్టం కేవలం మా కోసమేనా? మీ నిరసన సమయం ముగిసిందని ఢిల్లీ పోలీసులు మాకు హెచ్చరిక ఇస్తున్నారు. మంత్రివర్గంలో మీ సమయం ముగిసిందని మీరు ధర్మేంద్ర ప్రధాన్‌కు కూడా హెచ్చరిక ఇవ్వాలి” అని దీప్కే సూచించారు. “మన ప్రతినిధుల పిల్లలు కూడా అందరి పిల్లలతో పాటు ఒకే పాఠశాలలకు వెళ్లినప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది” అని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. జూన్ 6న జరిగిన ఆందోళ‌న‌లో పాల్గొన్న వారి కంటే శనివారం నాటి ఆందోళ‌న‌లో ఎక్కువ మంది పాల్గొన్నారు. సీజేపీ ఆహ్వానం మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎ, ఏఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాల‌ కార్యకర్తలు కూడా ఈ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీఘోష్ కూడా ఈ ఆందోళ‌న‌లో పాల్గొని మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -