Monday, June 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ యుద్ధంలో విజేత చైనాయే

ఇరాన్‌ యుద్ధంలో విజేత చైనాయే

- Advertisement -

పెరిగిన బీజింగ్‌ పలుకుబడి
మధ్యప్రాచ్యంలో దౌత్య యత్నాలకు సహకారం
బాధ్యతాయుత ప్రపంచ శక్తిగా నిరూపణ

బీజింగ్‌ : ఇరాన్‌-అమెరికా యుద్ధంలో విజేత ఎవరైనప్పటికీ అంతర్జాతీయంగా చైనా మాత్రం తన పలుకుబడిని పెంచుకుంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు దాడులు ప్రారంభించిన తర్వాత పలువురు విదేశీ నేతలకు చైనా ఆతిథ్యం ఇచ్చింది. అంతేకాక తనను తాను శాంతి ప్రతిపాదకురాలిగా ప్రకటించుకుంది. ఇరాన్‌ యుద్ధంపై చైనా స్పందించిన తీరుకు ఫిదా అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బీజింగ్‌పై పదే పదే ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా యుద్ధ కాలంలో తలెత్తిన చారిత్రక ఇంధన సంక్షోభాన్ని పొరుగు దేశాల కంటేసమర్ధవంతంగానే తట్టుకోగలిగింది. చైనా వద్ద ఉన్న అపారమైన వ్యూహాత్మక చమురు నిల్వలు, పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం వంటి అంశాలే దీనికి కారణం.

జిన్‌పింగ్‌పై ట్రంప్‌ ప్రశంసలు
అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా విదేశాంగ శాఖ స్వాగతించింది. మధ్యప్రాచ్యంలో శాంతిని, ప్రశాంతతను పునరుద్ధరించడంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఒప్పందంలో చైనా ప్రమేయం ఉన్నదా అని అడిగిన ప్రశ్నకు విదేశాంగ ప్రతినిధి లిన్‌ జియాన్‌ నిర్దిష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఏప్రిల్‌లో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ నాలుగు సూత్రాల శాంతి ప్రతిపాదనను విడుదల చేశారని గుర్తు చేయడంతో పాటు యుద్ధాన్ని ముగించడానికి బీజింగ్‌ చేసిన నిరంతర ప్రయత్నాలను వివరించడానికి వెనుకాడలేదు. ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా జరిగిన పత్రికా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘నేను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన తటస్థంగా…పూర్తి తటస్థంగా ఉన్నారు. నేను దీనిని అభినంది స్తున్నాను’ అని చెప్పారు. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎదుర్కొనేందుకు చైనా తన నౌకాదళాన్ని ఉపయోగించలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ‘వారు అలా చేయలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నాకు సాయపడ్డారు. సహాయ పడడానికి ప్రయత్నించారు. సమస్య పరిష్కారానికి ఆయన కూడా తోడ్పడ్డారని నేను భావిస్తున్నాను’ అని తెలిపారు.

ఆచితూచి అడుగులు
ఇరాన్‌-అమెరికా మధ్య తలెత్తిన వివాద సమయంలో చైనా ఎంతో జాగరూకతతో దౌత్యపరమైన వైఖరిని అవలంబించింది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడిని ఖండించింది. అమెరికా ఆంక్షలను బేఖాతరు చేసి ఇరాన్‌ నుంచి చమురును కొనుగోలు చేసింది. అదే సమయంలో ఇరు పక్షాలతో చర్చలకు తలుపులు తెరిచి ఉంచింది. ఓ వైపు వివాదం కొనసాగుతుండగానే మరోవైపు పలువురు ప్రపంచ నేతలు బీజింగ్‌ను సందర్శించారు. వీరిలో ట్రంప్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీతో పాటు ఇరాన్‌-అమెరికా చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ నేతలు కూడా ఉన్నారు. చర్చల ప్రారంభ దశలో శాంతి ఒప్పందంలో హామీదారుగా చైనా మద్దతు పొందేందుకు ఇరాన్‌ ఆసక్తి చూపింది. కానీ అలాంటి అధికారిక, సంక్లిష్టమైన పాత్రను పోషించేందుకు టెహ్రాన్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. చైనా సీనియర్‌ దౌత్యవేత్త వాంగ్‌ యీ రెండు రోజుల క్రితం అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. హార్ముజ్‌ జలసంధిలో నౌకాయానాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.

బయటపడిన అమెరికా బలహీనతలు
తుది ఒప్పందంపై చైనా దౌత్య ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ఎక్కడైనా యుద్ధం జరుగుతున్నప్పుడు బాధ్యతాయుతమైన ప్రపంచ శక్తిగా, కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నామని బీజింగ్‌ చాటిచెప్పింది. ఏదేమైనా ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ఇరాన్‌పై సాగించిన యుద్ధం అమెరికా బలహీనతలను బయటపెట్టింది. 1950వ దశకంలో సూయిజ్‌ కాలువపై బ్రిటన్‌ తన నియంత్రణను కోల్పోయిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తూ ఇప్పుడు హార్ముజ్‌లో అమెరికాకు అదే చేదు అనుభవం ఎదురవుతుందా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా సైన్యం అఖండ శక్తివంతమైనదని ట్రంప్‌ చెప్పుకుంటున్నప్పటికీ ఇరాన్‌ యుద్ధంలో అది నిరూపితం కాలేదు. పైగా యుద్ధం విషయంలో కీలక మిత్రదేశాల మద్దతును కూడా అమెరికా కోల్పోయింది. అమెరికా నేతృత్వంలోని ప్రపంచ కూటమి వ్యవస్థ బీటలు వారిన సంకేతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు యుద్ధ సమయంలో చైనా వ్యూహాత్మక ఎత్తుగడలు పలువురి ప్రశంసలు పొందాయి. తన చిరకాల మిత్రదేశమైన ఇరాన్‌కు మాటసాయంతో మద్దతు ఇవ్వడంతో పాటు అమెరికాపై విమర్శలు చేయడంలో సంయమనం పాటించింది. ఇరాన్‌ దాడికి గురైన గల్ఫ్‌ దేశాలతో అనేక పర్యాయాలు ఫోన్‌ సంభాషణలు జరిపింది. అమెరికాతో చర్చలకు ఇరాన్‌ను ఒప్పించింది చైనాయేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -