స్విట్జర్లాండ్ బయలుదేరిన ట్రంప్ ప్రతినిధి విట్‌కాఫ్
నవతెలంగాణ – జనరల్ డెస్క్
కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ బాంబు దాడులు ఆగడం లేదు. శనివారం జరిగిన తాజా దాడులలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ప్రాంతంలోని పలు ప్రదేశాలపై వైమానిక దాడులు జరిగాయని, పేలుడు శబ్దాలు వినిపించాయని లెబనాన్ అధికార వార్తా సంస్థ ఎన్‌ఎన్‌ఏ తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై ఇజ్రాయిల్, హిజ్బల్లా పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. హిజ్బల్లా దాడులకు ప్రతిగానే తాము కూడా సైనిక చర్యకు దిగామని ఇజ్రాయిల్ చెబుతుంటే లెబనాన్‌లో ఇజ్రాయిల్ ఆగడాలు సాగనివ్వబోమని హిజ్బల్లా తేల్చి చెప్పింది. ఇరాన్ అణు కార్యక్రమం సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు వాషింగ్టన్, టెహ్రాన్‌లు 60 రోజుల గడువు నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆగినప్పుడే ఈ చర్చలు
మొదలవుతాయని ఇరాన్ షరతు విధించింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ప్రారంభం కావాల్సిన తదుపరి చర్చలపై అనిశ్చితి నెలకొంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ చర్చల నిమిత్తం స్విట్జర్లాండ్ బయలుదేరారు. ఆయన అక్కడ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని కలుస్తారని సమాచారం. ఇదిలావుండగా ఇరాన్-అమెరికా ఒప్పందంలో తాను భాగస్వామిని కానని ఇజ్రాయిల్ ఇప్పటికే స్పష్టం చేసింది. లెబనాన్‌లో తన సేనల మోహరింపు కొనసాగుతుందని తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ఇజ్రాయిల్, హిజ్బల్లా వర్గాలు శుక్రవారం ధృవీకరించాయి. అయినప్పటికీ శనివారం ఇజ్రా యిల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు దక్షిణ లెబనాన్, బెక్కా వ్యాలీలోని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఈ రెండింటినీ హిజ్బల్లాకు కంచుకోట లుగా భావిస్తారు. దక్షిణ లెబనాన్‌లోని తమ సేనలపై శుక్రవారం రాత్రి హిజ్బల్లా యాభైకి పైగా దాడులు చేసిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. మరోవైపు పాకిస్తాన్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి మొహసిన్ నఖ్వీ టెహ్రాన్‌లో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో చర్చలు జరిపారు. ఇరాన్-అమెరికా మధ్య తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లో జరగాల్సి ఉండగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆ పర్యటనను శుక్రవారం రద్దు చేసుకు న్నారు. అయితే ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ స్విట్జరాండ్ బయలుదేరారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా చర్చలలో భాగస్వామి అవుతారని తెలుస్తోంది.
యుద్ధాన్ని వ్యతిరేకించిన మెజారిటీ అమెరికన్లు
అమెరికాలో మూడింట రెండు వంతుల మంది ఇప్పటికీ ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇరాన్‌పై సాగించిన యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలిని వారు అంగీకరించడం లేదు. తాజా ఏపీ-ఎన్‌ఓఆర్‌సీ పోల్ ప్రకారం ఇరాన్‌పై సైనిక చర్య అతిగా ఉన్నదని, అవసరమైనంత మేర జరిపి ఉంటే సరిపోయేదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
ఏం సాధించారు? : ఒబామా
ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుపట్టారు. అనేక బిలియన్ డాలర్లు ఖర్చు చేసి, సైన్యాన్ని ఇబ్బంది పెట్టి, సైనికుల ప్రాణాలు బలిగొన్న యుద్ధం సాధించిందేమిటని ప్రశ్నించారు. గతంలో ఎలా ఉందో…ఇంకా చెప్పాలంటే అంతకంటే దారుణంగా పరిస్థితి మారిపోయిందని దుయ్యబట్టారు. కాల్పుల విరమణను ఒబామా స్వాగతించారు.
మళ్లీ ప్రధాని పదవికి పోటీనా? :
నెతన్యాహూపై అసంతృప్తి
ఇజ్రాయిల్ ప్రధాని పదవికి మరోసారి బెంజమిన్ నెతన్యాహూ పోటీ చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఓ తాజా సర్వే ప్రకారం పోటీకి నెతన్యాహూ దూరంగా ఉండాలని 59 శాతం మంది ఇజ్రాయిలీలు అభిప్రాయపడ్డారు. కేవలం 33 శాతం మందే ఆయనను సమర్ధించారు. ఎనిమిది శాతం మంది ఎటూ చెప్పలేదు.
ఆగని ఇజ్రాయిల్ దాడులు
- Advertisement -
- Advertisement -


