Monday, June 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ గ్రూప్ లోకి ఖతార్‌ జెట్‌

ట్రంప్‌ గ్రూప్ లోకి ఖతార్‌ జెట్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : గత సంవత్సరం ఖతార్‌ ప్రభుత్వం అమెరికాకు ‘బేషరతు’ బహుమతిగా అందజేసిన కొత్త బోయింగ్‌ 747-8 జెట్‌ను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ కోసం ఆవిష్కరించారు. సుమారు 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఈ విలాసవంతమైన జంబో జెట్‌లో అమెరికా సైన్యం అవసరమైన మార్పులు, చేర్పులను పూర్తి చేసింది. ‘ఈ విమానాన్ని ఆకాశంలో ఎగిరే అత్యంత విలాసవంతమైన శ్వేతసౌధంగా తీర్చిదిద్దారు’ అని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ చెప్పారు. విమానం పనితీరును చూస్తే నమ్మలేరని, వాడిన కలప, సామగ్రి, ఇంజిన్ల నాణ్యత అత్యుత్తమమైనదని తెలిపారు. కాగా అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించడానికి ముందు విమానానికి తుది పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇది వినియోగంలోకి వస్తుంది. జెట్‌లో భద్రత, మిషన్‌ కమ్యూనికేషన్లు, లాజిస్టిక్స్‌ మద్దతు, సాంకేతికత పరిజ్ఞానం వంటి వాటిని ఆధునీకరించడం జరిగిందని వైమానిక దళం తెలియజేసింది. విమానం లోపలి భాగాలలో స్వల్పంగా మార్పులు చేశారు. బయటి భాగానికి కొత్తగా ఎరుపు, తెలుపు, నీలం, బంగారు రంగులు వేశారు.
గత సంవత్సరం మేలో ఖతార్‌ రాజకుటుంబం విలాసవంతమైన బోయింగ్‌ 747-8 విమానాన్ని అమెరికా రక్షణ విభాగానికి బహుమతిగా అందజేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు ఇప్పటికే వినియోగిస్తున్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమాన సముదాయంలో ఇప్పుడు ఈ జెట్‌ కూడా చేరింది. ఈ బహుమతి గురించి గత సంవత్సరంలో వార్తలు వెలువడినప్పుడు ట్రంప్‌ మిత్రపక్షాలు సహా పలువురి నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దారితీస్తుందని, అది రాజ్యాంగ విరుద్ధం కావచ్చునని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఫెడరల్‌ చట్టం ప్రకారం 480 డాలర్ల లోపు విలువైన బహుమతులను మాత్రమే అధికారులు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే విమానాన్ని తీసుకోవడం చట్టబద్ధమేనని, ట్రంప్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత దానిని అధ్యక్ష గ్రంథాలయానికి విరాళంగా ఇస్తారని శ్వేతసౌధం చెప్పుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -