– పండువారిగూడెం లో 600 ఎకరాల సాగు ప్రశ్నార్థకం
– తక్షణమే మరమ్మత్తులు చేయించాలని గిరిజన రైతుల డిమాండ్
– ప్రతిపాదనలు పంపించాం, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం
– ఐబీ ఏఈఈ శ్రీనివాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అటవీ ప్రాంతంలోని పాలవాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్న కుడి, ఎడమ తూములు శిధిలావస్థకు చేరడంతో వాటి పరివాహక ప్రాంతం పండు వారి గూడెం ఆదివాసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆ ప్రాంతాన్ని నవతెలంగాణ సందర్శించింది. ఈ సందర్భంగా ఆ గ్రామం రైతులు విలేకరి తో వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
మూడు సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో సాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతింది. దీంతో సుమారు 600 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం వర్షాకాల సాగు సీజన్ ప్రారంభమైనప్పటికీ తూముల మరమ్మతులు జరగకపోవడంతో ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తూముల గేట్లు పూర్తిగా తుప్పు పట్టి దెబ్బతినడంతో నీటి నియంత్రణ అసాధ్యంగా మారిందని వాపోయారు.
ఈ సందర్భంగా రైతులు సీసం నాగేశ్వరరావు, వీరాస్వామి, వెంకటేష్, బాబురావు, వీరమ్మ, బంగారముతో, మడకం అర్జున్‌రావు మాట్లాడుతూ, వెంటనే తూముల మరమ్మతు పనులు చేపట్టి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వందలాది ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ఈ విషయమై ఐబీ (ఇరిగేషన్) శాఖ అధికారి ఏఈఈ శ్రీనివాస్ ను సంప్రదించగా, “తూముల మరమ్మతులకు సంబంధించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం” అని ఆయన తెలిపారు. రైతులు మాత్రం అనుమతుల పేరుతో జాప్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకుని సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.



