Monday, June 22, 2026
E-PAPER
Homeదర్వాజమేదరి వృత్తి జీవన విజ్ఞాన సర్వస్వం

మేదరి వృత్తి జీవన విజ్ఞాన సర్వస్వం

- Advertisement -

ఆదికవి పాల్కురికి సోమన నుండి అర్వాచీనం దాక తెలుగు సాహితీ మాగాణంలో అణువణువు గాలించినా, మేదరుల శ్రమ జీవన కావ్యాలు కనిపించవు. అనువాద ఆదికవి నన్నయ నుండి చిన్నయ్య దాకా, చిన్నయ్య నుండి సినారె దాకా, సినారె నుండి బాలకృష్ణ దాకా తెలుగు సాహితీ క్షేత్రాన్నంత వడబోసినా, మేదరి వృత్తికారుల జీవితాలను చిత్రించిన గ్రంథాలు అగుపించవు. బొల్లం “వెదురు జీవనరాగం” అంతటి లోతైన తాత్త్విక రచన మరొకటి దొరకదు. ఇంతటి మేలైన అస్తిత్వ కవిత్వం పండించిన మహేంద్రుల బతుకు పొత్తం చిక్కడం అరుదు. వెదురు శిల్పుల చెమట చుక్కల పరిమళాలను గానం చేసిన శ్రమకావ్యం కనబడదు. సాహిత్యంలోని ఖాళీలను పూరించడమే కవి రచయితల ముఖ్య బాధ్యత. కాబట్టి సృజనకారులు సమాజంలోని అణగారిన వర్గాల గొంతుకగా మారాలి. ఇప్పటి వరకు చెప్పబడని బడుగుల కథలు, చారిత్రక వాస్తవాలు, మానవ సంబంధాల లోపాలను వెలికితీయాలి. ఆ సృజనలు, అనుసృజనలు, పరిశోధనలు సామాజిక సంస్కరణకు దోహదపడాలి. మేదరుల కులవృత్తిని వెలికి తీసిన “వెదురు జీవన రాగం” దీర్ఘకవిత ఈ పనికి పూనుకున్నట్లు భావించవచ్చు. ఉపాధ్యాయ కవి బొల్లం బాలకృష్ణ మేదరి కులంలో పుట్టిండు. ఆయన చిన్నప్పటి నుండి కులవృత్తి ఆటుపోట్లను అప్రయత్నంగానే గమనించిండు. ఈ కులకశ్పితో పొట్ట పోసుకున్న తాతవ్వలు, తండ్రుల జీవితాలను చూసిండు. ఆయనకు చేతివృత్తి నిపుణి వారసత్వంగా అబ్బింది. తల్లిదండ్రికి పనిపాటల్లో చేదోడువాదోడుగా ఉంటూ చదువుకున్నడు.

ఇంటిల్లిపాది పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్నా, రాశికి రంగానికి రాని ఆర్థిక పరిస్థితులు అతన్ని కదిలించినయి. ప్రపంచీకరణ దాడిని గాడిలో పెట్టలేని ప్రభుత్వాల అలసత్వాన్ని అర్థం చేసుకున్నడు. తరతరాల వెతల్లోంచి తన జాతిని కలంతో మేల్కొల్పాలనుకున్నడు. చీకటి ఆవరించిన బతుకుల్లో ‘పున్నమి పూత’ కావాలనుకున్నడు. పెత్తందారులు చేసిన నెత్తుటి గాయాలను పాటలుగా పల్లవించిండు. శ్రమ దోపిడీ కన్నీటి గాథలను కవితలుగా కదం తొక్కించిండు. ఆయన మీద కేతయ్య కూకున్నడో..! కంకాలమ్మ వాలిందో… మల్లలమ్మ పూనిందో… తెలియదు కానీ మేదరి జీవన శ్రమ సౌందర్యాన్ని దీర్ఘ కావ్యంగా ఆళ్ళకోసై గానం చేసిండు. శీవాలెత్తిన శివసత్తి వోలే ఆశువుగా శివాలు తూలిండు. అపురూపమైన మేదరి అల్లకం కళను కళాత్మకంగా అల్లిక చేసిండు. సామాజికోద్యమ కవి పాల్కురికి సోమన్న బసవ పురండాన్ని పూసగుచ్చినట్టే, ఈయన మేదరి కశ్పి పురండాన్ని అక్షరబద్ధం చేసిండు. జొర్రీగల బుచ్చి రాములు మేదరి చరిత్రను వల్లిస్తే, బొల్లం బాలకృష్ణ “వెదురు జీవనరాగం”ను వల్లెవేసిండు.

వెదురు పుట్టుకను, అది గుంపులు గుంపులుగా విస్తరిస్తూ, ఏపుగా ఎదిగిన తీరును మనోహరంగా చెప్పిండు . “అదిగదిగో వెదురు/మట్టిని చీల్చిన చిగురు/తల విరబోసుకున్న నాగసర్పం/పచ్చటి దీపంలా మెరిసి/ ఎండినా ఎగిరే బంగారు తీగ/అడవితల్లి సిగలో నెలవంక” అంటూ కంకవనం కమణీయతను రమణీయంగా అల్లిక చేసిండు. పిల్ల గాలులకు సయ్యాటలాడుతూ, ఉయ్యాలలూగే వెదురు గుబుర్ల సోయగాన్ని మనసుకు హత్తుకునేలా వర్ణించిండు. మేదర్ల జీవనాధారమైన వెదురు పొదల రూపకాన్ని రూపు కట్టించిండు. “వెదురు పలుకులు అతని భాష/ అల్లికలు అతని లిపి/గుండ్రంగా వెదురు వంచి/చక్రాన్ని గుర్తించి/నాగరికత విత్తనం నాటాడు/అప్పుడు చరిత్ర రాయబడలేదు/కేవలం అల్లబడింది” ఆ చరిత్రను అల్లింది మాత్రం మేదరి అని తేల్చి చెప్పిండు కవి. 1950వ దశకం తొలినాళ్ళ నుంచే తెలుగులో దీర్ఘకవిత వుంది. కుందుర్తి ఆంజనేయులు “తెలంగాణ” దీర్ఘకవిత మొదటిదని పెళ్లూరి సునీల్ సిద్ధాంతగ్రంథంలో చెప్పిండు. కానీ సంగిశెట్టి శ్రీనివాస్, కవిరాజమూర్తి “మిహైక” తొలి దీర్ఘకవిత అని నిరూపించిండు. “దీర్ఘకవితకు వస్తువు ప్రాణం.

రూపం విధానం. దీర్ఘకవిత ప్రాణాయామంతో సమానం. అది తాడుమీద నడక. తడబడితే లోయ” అంటాడు నగ్నముని. ఎంత ఒడుపుగా రాయాలో తెలుస్తున్నది. విస్మరణకు గురైన వర్గాలు దీర్ఘకవితలో తమ కవిత్వపు గొంతును విశ్వరూపంతో విప్పినయి. అనేక రకాలైన వస్తువులు దీర్ఘకవితలో చర్చించబడ్డయి. ఇందులో రాయడానికి నిడివి ఎక్కువగా ఉంటుంది. సినారె విశ్వంభర, గోపీ జలగీతం, నగ్నముని కొయ్యగుర్రం. శివారెడ్డి ఆసుపత్రి గీతం దీర్ఘ కవితలు వచ్చినయి. బిసివృత్తులపై వచ్చిన దీర్ఘకవితల్లో మగ్గంబతుకు, కుంపటి, పెద్దబాడిసె, బువ్వకుండ, అసిపె, మెట్న, వంకతాడు… ఇప్పుడు వెదురు జీవన రాగం చేరింది. వృత్తులలోని కళాత్మకతను దీర్ఘకవిత కవితాత్మకంగా, శిల్పచతురిమను, వైవిధ్యాలను, నూతన పదప్రయోగాలను, నవ్యతనూ పొందుపరిచింది. ఎంచుకున్న వస్తువును క్రమంగా అమర్చుకునీ, అంతస్సూత్రాన్ని పాటిస్తూ, కవిత్వసూత్రం తెగకుండా ఒక ప్రవాహంగా దీర్ఘకవిత ముంచెత్తుతుంది. మేదర్ల జీవన విధానం, వివాహ పద్ధతులు, సంస్కృతీ సంప్రదాయాలు, గోత్ర నామాలు, ఉపకులాలు, ఆశ్రిత కులాలు పలు ప్రాంతాల్లో మేదరులను ఏ పేరుతో పిలుస్తున్నారో సవివరం చేసిండు. ఒంటాల, రెంటాల, ముంటాల, నాల్టాల అల్లకమే మేదరి జీవితం.

ఆ ఒడుపు అల్లికలో… “గణితం ఉంది/గమకం ఉంది/ఓపిక ఉంది/ఒరవడి ఉంది/ప్రతి పేడు ఒక అక్షరం/ప్రతి కర్ర ఒక పదం/ప్రతి వస్తువు ఒక శ్రమకావ్యం”. వాళ్ళ చూపులో వస్తువు కొలత, వేళ్ళలో ఆయి, చేతిలో అల్లిక ఉంటుంది. అందుకే మేదరులు సవ్యసాచులైన విజ్ఞానగనులు. “పుట్టిననాడు చాట/గిట్టిన నాడు పాడే/మనిషితోనే వెదురు/వెదురుతోనే మేదరులు” ఉంటరు. పుట్టిన శిశువును చాటలో వేస్తరు. పెళ్లికి పచ్చటి కంక బొంగులతో కంకతడకలతో పందిరి వేస్తరు. చనిపోయినపుడు కంకబొంగులతో పాడెగడుతరు. దెవ్సాల నాడు చాటతో బూడిదెత్తుతరు. పుట్టిన నుండి గిట్టే వరకు మనిషి జీవన చక్రం మేదురి వస్తువులపై ఆధారపడి ఉందన్న సంగతిని అక్షరాలా పొదిగిండు. ఈనాటికీ మేదరి పేటలు, మేదరి వాడలు, మేదరి బస్తీలు, మేదరి గల్లీలు వెలి వాడలుగానే మిగిలి ఉన్నయి. మేదరులు శూద్రులలో అతిశూద్రులుగా నిరుపేదరికంతో బతికీడుస్తున్నరు. “హరప్పా గాలిలో మౌనం/ సింధు నాగరికత నిశ్శబ్దనాదం/మెహంజోదారో దిబ్బల్లో నీడ/ఈజిప్టు ఇసుకలో అడుగులు/ మట్టిలో కరిగిన మేదరులు”. ప్రపంచంలో ప్రాచీన నాగరికతలు వెల్లివిరీయడానికి మేదరుల పాత్ర కీలకమైనది. కంకబద్దలతో చేసిన వస్తువులు హరప్పా సింధు, ఈజిప్టు మెసపటోనియా నాగరికతల మట్టి పొరల్లో కనిపించకుండా పోయినవని, మేదరివాళ్ల ఆనవాళ్లు శిథిలాల్లో కనిపించడం లేదని కవి ఆవేదన చెందుతడు. పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన శిలాజాలు, శిథిలాలతో ప్రాచీన నాగరికతలను అంచనా వేస్తున్నం. మట్టిలో కలువని లోహాలు ఇనుము, రాగి, తగరం మొదలైన వాటితో చేసిన పురాతన పనిముట్లు మనకు అనేకంగా లభించినయి. అవి చరిత్రా రచనకు సూబుదు గవాయిగా నిలిచినయి.

తరతరాలుగా మేదరి చేతిలో జీవం పోసుకున్న అతారెలూ పతారెలు, ఇసిరెలూ పసిరెలు, కుమ్మరి జల్లెడ, ఈదుల నిచ్చెన, కోళ్ల గూడు, కచ్చురం తడక, వడ్డెర గంప, గొల్లల గుల్ల, చాపల బుట్ట, ఉప్పరి తట్ట, ముగ్గు బుట్ట, పొన్క, గుమ్మి, చాట, మొంటె, విసనకర్ర మొదలైన పనిముట్లు ప్లాస్టిక్ భూతం దాడికి, ప్రపంచీకరణ సైతాను ధాటికి తట్టుకోలేక పోయినయి. దాంతో మేదరి వృత్తికారుల బతుకులు చిల్లం కల్లం అయినయి. నిత్తెం కొర్వి చీమలతో, తిండి కోసం జీవన పోరాటంలో ఓడే మేదరుల గుమ్మం ముందు అప్పులోని గుర్రాలు స్వారీ చేస్తున్నయి. మేదరి వృత్తికారులు ఇకనైనా మేల్కొని, తలవంచిన కాలం నుండి తలెత్తి నడిచే దారిలో నడవాలి. మేమెంతో మాకంత అని ఫులే ఆశయాలను ఉనికిపుచ్చుకోవాలి. అంబేద్కర్ అందించిన అక్షర దీపాలను గుండెల్లో వెలిగించుకొని ముందడుగు వేయాలని కోరుతున్నాను. అస్తిత్వవాదంతో కూడిన వెదురు జీవనరాగం ఆలపించిన బొల్లం బాలకృష్ణకు అభినందనలు. అక్కడక్కడ పడికట్టు పదాలతో కవిత్వం కుంటకుండా జాగ్రత్త పడాలి. ఇంకా కవిత్వం సాపుగా సర్రాసుగా నడిచేటట్టు చూసుకోవాలి. అక్షర దోషాలు దొర్లకుంట శ్రద్ధ తీసుకోవాలి. ఇందులో చిత్రకారుడు గుండు రమణయ్య వేసిన బొమ్మలు బాగున్నయి. మును ముందు బాలకృష్ణ తెలంగాణ భాషా పరిమళాలను వెదజల్లుతూ, తెలంగాణ మట్టి బతుకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దారిలోనే పయనించాలని కోరుకుంటున్నాను.

కూకట్ల తిరుపతి, 9949247591

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -