Monday, June 22, 2026
E-PAPER
Homeఆటలుసొంతగూటికి పంత్‌!

సొంతగూటికి పంత్‌!

- Advertisement -

రూ.15 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం
ప్లేయర్‌ ట్రేడ్‌కు లక్నో, ఢిల్లీ చర్చలు సఫలం

న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరో స్టార్‌ క్రికెటర్‌ ట్రేడింగ్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్‌ వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు లక్నో సూపర్‌జెయింట్స్‌కు సొంతమైన రిషబ్‌ పంత్‌.. రెండు సీజన్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరనున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌గా రెండు సీజన్లలో నిరాశపరిచిన రిషబ్‌ పంత్‌.. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్లేయర్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే చర్చలు జరపగా, అవి విజయవంతమైనట్టు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ఐపీఎల్‌ టైటిల్‌ను రెండు కంటే ఎక్కువ సార్లు నెగ్గిన జట్టు సైతం రిషబ్‌ పంత్‌ కోసం లక్నో సూపర్‌జెయింట్స్‌ను సంప్రదించినా.. రిషబ్‌ పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఐపీఎల్‌ కెరీర్‌ మొదలుపెట్టిన రిషబ్‌ పంత్‌ ఆజట్టుకు నాయకుడిగా ఆకట్టుకున్నాడు. కారు ప్రమాదం జరిగిన ఏడాదిలోనూ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం బాసటగా నిలిచింది. పార్థ్‌ జిందాల్‌, గ్రంథి కిరణ్‌లతో చర్చల అనంతరం రిషబ్‌ పంత్‌ రెండేండ్ల క్రితం ఆటగాళ్ల వేలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

రూ. 15 కోట్లకే
రిషబ్‌ పంత్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌ వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో ఒప్పందం మూడేండ్లకు వర్తిస్తుంది. మరో సీజన్‌ ఉండగానే పంత్‌ లక్నోను వీడేందుకు సిద్ధమయ్యాడు. వేలంలో పంత్‌ కోసం రూ.24 కోట్ల వరకు పోటీపడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు ఫేవరేట్‌ ప్లేయర్‌ను రూ.15 కోట్లకే దక్కించుకోనుంది. రిషబ్‌ పంత్‌ను తీసుకుని బదులుగా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌కు బదిలీ చేయనుంది. రిషబ్‌ పంత్‌ను ఢిల్లీ ఇవ్వటంతో లక్నో సూపర్‌జెయింట్స్‌కు రూ.13.75 కోట్లు వేలం పర్సు మిగలనుండగా… ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.1.25 కోట్ల వేలం పర్సులో కోత విధించుకోనుంది. కుల్‌దీప్‌ యాదవ్‌ రూ.13.25 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ తరఫున ఆడనున్నాడు. ప్రాంఛైజీలు ప్లేయర్‌ ట్రేడింగ్‌పై ఓ నిర్ణయానికి రాగా.. బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. 2026 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు చెన్నై సూపర్‌కింగ్స్ రవీంద్ర జడేజా, శామ్‌ కరణ్‌లను వదులుకుని రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి సంజు శాంసన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -