Monday, June 22, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

కార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం

- Advertisement -

పెట్టుబడిదారుల లాభాల కోసమే నాలుగు లేబర్ కోడ్లు
కేంద్రం దారిలోనే రాష్ట్రాలు
ఉత్పత్తి పనుల్లో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్ నియామకం
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.32వేలు వేతనం ఇవ్వాలి : సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
లేబర్ కోడ్లతో హైర్ అండ్ ఫైర్ విధానం అమలు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
సంగారెడ్డిలో తెలంగాణ స్టేట్ ఫిక్స్‌డ్ టర్మ్ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ యూనియన్ 
రాష్ట్ర ప్రథమ మహాసభ


నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలను నిర్వీర్యం చేస్తూ.. పెట్టుబడిదారుల లాభాలు పెరగడానికి, దోపిడీని యదేచ్ఛగా కొనసాగించడానికి నాలుగు లేబర్ కోడ్లను గెజిట్ చేసి అమలుకు పూనుకుందని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబా అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఫిక్స్‌డ్ టర్మ్ అండ్ నాన్ రెగ్యూలర్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రథమ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. లేబర్ కోడ్లను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ దారిలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక సంబంధాల కోడ్ ప్రకారం అన్ని పర్మినెంట్ స్థానాల్లో కూడా ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో తాత్కాలిక ఉద్యోగులను పెట్టుకోవడానికి అనుమతి లభించిందని అన్నారు. ఇది లేబర్ కోడ్‌లో వచ్చిందని, దీనివల్ల కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండదని, యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద వాళ్ల జీవనం గడవాల్సి ఉంటుందన్నారు. దీనికి వ్యతిరేకంగానే సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఫిక్స్‌డ్ టర్మ్ అండ్ నాన్ రెగ్యూలర్ ఎంప్లాయిస్ యూనియన్ ఏర్పడిందన్నారు. కార్మికుడు ఏ క్యాటగిరిలో పనిచేస్తున్నా అతనికి సామాజిక భద్రత అయిన పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్, చట్టబద్దమైన సెలవులు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా తగినటువంటి పని భద్రత, రక్షణ పరికరాలు కార్మికులకు అందించాలని తెలిపారు.

కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు అమలు జరిపేందుకు కార్మికశాఖ, ఫ్యాక్టరీల శాఖ తనిఖీలు చేయాలన్నారు. ఇవన్నీ కొత్త లేబర్ కోడ్లతో పక్కకు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కార్మికవర్గాన్ని కాపాడటానికి పోరాటాలే మార్గమని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని వేలాది పరిశ్రమల్లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగ పరిశ్రమల్లో ఉన్న నాన్ రెగ్యూలర్ వర్కర్లను ఈ సంఘం ఐక్యం చేసేందుకు పూనుకుందన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని, వాళ్ల లాభాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పా కార్మికుల జీవన పరిస్థితులు, ఆరోగ్యం, తదితర విషయాలపై ఎలాంటి పట్టింపులేదని విమర్శించారు. కార్మికులను కేవలం బానిసల్లాగా, యంత్రాల్లాగా చూస్తున్నారని, అది చెల్లుబాటు కాదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతనాల జీఓలో రూ.14వేలు వేతనం ఉందని, ఇది ఏ రకమైన కనీస వేతనం, ఏ చట్టం ప్రకారం లెక్కలు కట్టారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంప్‌కు గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లోని రహదారికి ట్రంప్ పేరు ఎందుకు పెడుతున్నారో.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.32 వేలు ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కనీసవేతనాలు, చట్టబద్దమైన హక్కుల నిర్ణయాలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు : 
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పిస్తూ వారికి అనుకూలంగా పాత కార్మికచట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ఆరోపించారు. రాయితీలు ఇచ్చినప్పటికీ పెట్టుబడిదారులు సంతృప్తి చెందడం లేదని, కార్మికుల శ్రమను సరళీకరణ చేయాలని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరళీకరణ చేయడంలో భాగంగానే ప్లెక్సీ లేబర్ అనే పదం నేడు వాడుతున్నారని తెలిపారు. లేబర్ కోడ్స్ సారాంశం హైర్ అండ్ ఫైర్ విధానమని, పని ఉంటే కార్మికులను పనిలో పెట్టుకుంటాం.. పనిలేకపోతే తొలగిస్తామనేది లేబర్ కోడ్ల సారాంశమని అన్నారు. దీనికి అనేక పేర్లు పెడుతున్నారని, ఫిక్స్‌డ్ టర్మ్ కార్మికులని, అప్రెంటీస్, ట్రైనీ, లాంగ్ టర్మ్ ట్రైనీ, నీమ్ కార్మికులని రకరకాల పేర్లతో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదివిన విద్యావంతులైన యువతీయువకులను ఉత్పత్తిలో నియమించు కుంటున్నారని తెలిపారు. వీళ్ల ఉద్యోగానికి ఎలాంటి గ్యారంటీ లేదని, వీళ్లు పర్మినెంట్ కార్మికులతో సమానంగా ప్రొడక్షన్ ఇస్తున్నా.. ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ లాంటివి ఉండవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే కార్మికుల కోసం విధానపరమైన రూపకల్పన చేయాలని, యజమానులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీలు జాబ్ మేళా అనే పేరుమీద జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ సహకారంతో జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం జాబ్‌మేళాకు సహాయం చేస్తుంది తప్పా ఆ పరిశ్రమల్లో వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూసే బాధ్యత కార్మికశాఖకు లేదా అని ప్రశ్నించారు. అందుకే వీళ్లకు చట్టబద్దమైన సౌకర్యాల కోసం జీఓ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, కార్యదర్శులు పద్మశ్రీ, మల్లేశం, బీరం మల్లేష్, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు మాణిక్, ప్రవీణ్, యాదగిరి, మహిపాల్, విద్యాసాగర్, నాగేశ్వర్ రావు, పాండురంగారెడ్డి, బాగారెడ్డి, వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -